breaking news
animals dies
-
టెన్షన్ పెడుతున్న ప్రాణాంతక వైరస్ లంపీ.. కీలక హామీ ఇచ్చిన మోదీ
గ్రేటర్ నోయిడా(యూపీ): పశుసంపదను బలితీసుకుంటున్న లంపీ చర్మ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ రైతాంగానికి భరోసా ఇచ్చారు. ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రబలే లంపీ వ్యాధి పశువుల్లో తీవ్రమైన జ్వరం, చర్మంపై గడ్డలు ఏర్పడి తుదకు ప్రాణాలను హరిస్తోంది. ఇటీవలి కాలంలో ఈ వ్యాధికారణంగా గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, హరియాణాసహా ఎనిమిది రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పాడి ఆవులు, పశువులు మృత్యువాతపడిన విషయం తెల్సిందే. సోమవారం గ్రేటర్ నోయిడాలో ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్‌ను ప్రారంభించి మోదీ ప్రసంగించారు. ‘ రైతులకు, వారి ఆదాయానికి, పాల ఉత్పత్తికి విఘాతంగా మారిన లంపీ వ్యాధి వ్యాప్తి నిరోధానికి దేశీయంగా వ్యాక్సిన్ అందుబాటులోనే ఉంది. మూడేళ్లలో దేశంలోని అన్ని పశువులకు కాళ్లు, నోటి సంబంధ వ్యాధులకు సంబంధించిన వ్యాక్సినేషన్ పూర్తిచేస్తాం’ అని మోదీ అన్నారు. ‘‘పశు ఆధార్ పేరిట ప్రతీ పాడిజంతువుకు బయోమెట్రిక్ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాడి పరిశ్రమ విస్తరణతోపాటు సంతులిత పాడి ఆర్థికవ్యవస్థ సాధ్యమవుతుంది. గోవర్థన్ యోజనతో వ్యవసాయ, డెయిరీ రంగంలో కొత్తగా వేయికిపైగా అంకుల సంస్థలు పురుడుపోసుకున్నాయి. మహిళల భాగస్వామ్యం వల్లే డెయిరీ సెక్టార్ వృద్ధిబాటలో పయనిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితంతో పోలిస్తే 44 శాతం వృద్ధితో పాల ఉత్పత్తి నేడు 21 కోట్ల టన్నులకు పెరిగింది. ప్రపంచ వృద్ధి రేటు (2 శాతం)తో పోలిస్తే భారత్‌లో పాల ఉత్పత్తిలో వార్షిక వృద్ధి రేటు 6 శాతానికి పెరిగింది. చిన్న రైతుల వల్లే ఇది సాధ్యమైంది’’ అని మోదీ అన్నారు. -
ఈదురు గాలుల విధ్వంసం
ఎస్.కోట నియోజకవర్గంలోని వేపాడ, జామి, ఎల్.కోట మండలాల్లో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. చెట్లు నేలకూలాయి. అరటి, బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పల్లెల్లో అంధకారం అలముకుంది. పిడుగుపాటుకు జామి మండల కేంద్రంలోని దొండపర్తి కూడలిలో ఒక ఆవు మృతి చెందింది. గాలుల ధాటికి జనం బెంబేలెత్తిపోయారు. ఇళ్లకు పరుగుతీశారు. తీరా.. చిరుజల్లులే కురవడంతో రైతులు నిరాశచెందారు. వేపాడ/జామి/ఎల్.కోట: ఎస్.కోట నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులకు జనం భయంతో పరుగు తీశారు. ఎక్కడికక్కడే చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో భయపడ్డారు. గాలుల ధాటికి వేపాడ మండలంలోని ఎస్‌కేఎస్‌ఆర్ పురంలో విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్ నేలకొరిగింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దిబ్బపాలెంలో పశువుల పాకలు కూలిపోయాయి. ఎస్కేఆర్ పురానికి చెందిన రైతు శిరికి ఈశ్వరమ్మకు చెందిన సుమారు 5.60 ఎకరాల బొప్పాయి తోట ధ్వంసమైంది. సుమారు రూ.25 లక్షల పంట చేతికొచ్చేదశలో నష్టపోయామంటూ ఆమె గగ్గోలు పెడుతోంది. చామలాపల్లి పంచాయతీ పోతుబందిపాలెంగిరిజన గ్రామంలో విద్యుత్ స్తంభాలు ఇళ్లపై పడడంతో జనం పరుగులు తీశారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. లక్కవరపుకోట మండలంలో సాయంత్రం కురిసిన చిరుజల్లులకు వాతావరణం చల్లబడింది. ఈదురు గాలులకు ఎల్.కోట బీసీ కాలనీలో తాటి చెట్టు బి.పార్వతమ్మ ఇంటిపై కూలిపోయింది. దీంతో ఇంటిగోడ కూలిపోయే స్థితికి చేరింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అరకు–విశాఖ ప్రధాన రోడ్డులో సోంపురం జంక్షన్ సమీపంలో తాటిచెట్టు విద్యుత్ తీగెలపై పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎస్సై ప్రయోగమూర్తి జేసీబీ సాయంతో తాటిచెట్టును తొలిగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈదురు గాలులకు సుమారు 8 విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో మండలంలో పూర్తిగా విద్యుత్‌కు అంతరాయం కలిగింది. జామి మండలంలో పిడుగులు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. ఫొని తుపాను ఎలాంటి ప్రభావం చూపకపోగా ఒక్కసారి ఈదురుగాలులు ధాటిగా వీయడం, పిడుగులు పడడంతో జనం భయపడ్డారు. జామి మండలంలో మొత్తం 21 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కె.భీమసింగిలో–5, జామి, శ్రీచక్ర సిమ్మెంట్ ఫ్యాక్టరీ మధ్యలో 7, ఏ.ఆర్.పేటలో 5, కొత్తూరులో 2, గొడికొమ్ములో ఒకటి, అలమండలో ఒకటి చొప్పున విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ తీగెలు తెగిపోయాయి. గాలుల బీభత్సానికి విద్యుత్ శాఖకు సుమారు రూ.3 లక్షల ఆర్థిక నష్టం చేకూరిందని జామి విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కె.భీమసింగి, యాతపాలెం, చిల్లపాలెం తదితర గ్రామాలకు మంగళవారం సాయంత్రానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు. మామిడి పంటకు అపారనష్టం అసలే ఈ ఏడాది అరకొరగా మామిడిపంటతో మామిడి రైతులు ఆందోళనలో ఉన్నారు. సోమవారం వీచిన గాలులకు మామిడిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో ఎక్కడికక్కడ మామిడి కాయలు నేలరాలాయి. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పిడుగుపడి ఆవు మృతి.. జామి మండల కేంద్రంలోని దొండపర్తి జంక్షన్ వద్ద కొత్తలి రాంబాబుకు చెందిన సుమారు రూ.50వేలు విలువ చేసే ఆవు పిడుగుపాటుకు గురై మృతిచెందింది. కల్లాంలోని ఓ చెట్టుకింద ఉన్న ఆవుపై పిడుగు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎక్కడికక్కడే భారీ శబ్దంతో పిడుగులు పడడంతో మండల వాసులు భయాందోళన చెందారు. -
రో'జూ'విలవిల
శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో వరుసగా వన్యప్రాణులు మృతిచెందుతున్నాయి. దీని వెనుకఅసలు కారణం ఏమిటనేది అంతుచిక్కడం లేదు. వరుసగా మూగ జీవాలు మృతి చెందుతున్నాయి.వన్యప్రాణుల కేర్ టేకర్ల పర్యవేక్షణ లోపమా.. వైద్యులనిర్లక్ష్యమా.. అధికారుల పనితీరు లోపమా.. అనేది తెలియడం లేదు. ఈ క్రమంలో గురువారం మగ సింహం పిల్ల మృతి చెందింది. కేన్సర్ వ్యాధితో మృతి చెందిందని పశు వైద్యులు నిర్ధారించారు. గత నెలలో కూడా మనుబోతులు మూడు మృతి చెందాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక వడదెబ్బ వల్ల జంతువులు మృతి చెంది ఉండవచ్చనే అనుమానం కూడా ఉంది. తిరుపతి సిటీ: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో వన్యప్రాణులు రోజురోజుకు అంతరించిపోతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 28 మూగజీవాలు మృతి చెందినట్లు జూ పార్క్ రికార్డుల్లో నమోదైంది. మూగజీవాల మృతికి కారణం ఏమిటనే విషయం అంతుపట్టడం లేదు. జూలో 1,068 వన్యప్రాణులు ఉన్నాయి. వాటిలో ఇటీవల రెండు మనుబోతులు,ఒక కణితి, చుక్కల దుప్పి, బుర్ర జింక కూడా మృతిచెందాయి. గురువారం 8 నెలల మగ సింహం పిల్ల మృతి చెందింది. ఇది వడదెబ్బకు గురై మృతి చెందిందనే అనుమానాలు ఉన్నాయి. జూ క్యూరేటర్ మాత్రం ఊపిరాడక మృతి చెందిందని చెప్పారు. ముందే పసిగట్టలేని వైద్యులు సింహం పిల్ల అనారోగ్యానికి గురైందని జూలో ఉన్న డాక్టర్లు ముందుగా పసిగట్టలేకపోయారు. వైద్యులు జంతువుల ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచడం లేదని ఈ సంఘటన బట్టి తెలుస్తోంది. డాక్టర్లు జూ అంతటిని కార్లలో చుట్టి వెళ్లిపోతుంటారు. జంతువులు ఉండే చోటికి వెళ్లి కారు దిగకుండానే అనిమల్ కీపర్‌ను వారి దగ్గరకు పిలుపించుకుని జంతువు బాగుందా.. ఫీడ్ తీసుకుంటుందా అని అడిగి వెళ్లిపోతుంటారు. పోస్టుమార్టంపై అనుమానాలు జూలో ఏ జంతువు మృతి చెందినా వెటర్నరీ యూనివర్సిటీకి పంపించి పోస్టుమార్టం నిర్వహించాలి. గతంలో ఇదే విధానాన్ని అధికారులు అమలుచేసేవారు. కానీ ప్రస్తుతం జూ లోనే అక్కడున్న వైద్య సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించి దహనక్రియలు చేస్తుండడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. స్ప్రింక్లర్లు ఉన్నా.. నామమాత్రమే. జూలో మొత్తం 1,500 స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. అన్నింటిని పూర్తిగా వినియోగించడంలేదు. ఏవరైనా వీఐపీలు వచ్చిన సమయంలో వాటిని వినియోగంలోకి తెస్తారు. మిగిలిన సమయాల్లో వాటిని వినియోగించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అరణ్యంలో.. అగ్గి
సాక్షి, భూపాల్పల్లి: వేసవి ఇలా ప్రారంభమైందో లేదో అప్పుడే అడవిలో మంటలు చెలరేగుతున్నాయి. గురువారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గంగారం, తాడ్వాయి అడవుల్లో నిప్పు రగులుకుని వృక్షాలు, జీవరాసులు దగ్ధమయ్యాయి. మంటలు అలాగే కొనసాగుతున్నాయి. తాడ్వాయి నుంచి గంగారం, పస్రా నుంచి తాడ్వాయి, ఏటూరునాగారం వరకు ఉన్న అడవుల్లో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. పశువుల కాపరులు చుట్ట, బీడీలు కాల్చిన అగ్గిపుల్లను అడవుల్లో వేయడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఉడుములు, పాములు, కుందేళ్లు మంటల్లో కాలి బూడిదైనట్లు జంతు ప్రేమికులు వెల్లడించారు. అలాగే వన్య ప్రాణులైన జింకలు, దుప్పులు, మేకలు, కనుజులు, కొండముచ్చులు, తదితర జంతువులు మంటల వేడికి, పొగకు తట్టుకోలేక పరుగులు పెట్టి దాహానికి అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వేసవిలో అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు నిప్పు నివారణకు ఫైర్ లైన్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండాపోతుంది. -
మూగజీవాల మరణమృదంగం
పెథాయ్ తుఫాన్ జిల్లాలో మూగజీవాల పాలిట మృత్యువుగా మారింది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో 990 పశువులు మృతి చెందాయి. వీటిలో ఆవులు, లేగదూడలు, గొర్రెలు, మేకలు తదితరమైనవి ఉన్నాయి. వీటి మృతితో రూ.లక్షల్లో నష్టం సంభవించింది. పశుసంవర్ధక శాఖ అంచనాల మేరకు మంగళవారం నాటికి 20 గేదెలు, 18 దూడలు, పది ఎద్దులు, 618 మేకలు, 324 కోళ్లు మృత్యువాత పడ్డాయి. పెంపకందారులు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకొంటున్నారు. విజయనగరం ,గరివిడి: పెథాయ్ తుఫాన్ గొర్రెల పాలిట యమపాశమైంది. తుఫాన్ చలిగాలులకు మండలంలో 95 గొర్రెలు చనిపోయినట్టు రెవెన్యూ, పశు వైద్యాధికారులు గుర్తించారు. ఒక్క కుమరాం గ్రామంలోనే 71 గొర్రెలు మృతి చెందాయి. ఆ గ్రామానికి చెందిన వైగాల రాముడు, వైగాల పెద్దోడు, డొప్ప చిన్నయ్య, డొప్ప కర్రి అప్పయ్య, డొప్ప తాత, డొప్ప తవుడు, తొండ్రంగి తాత, వైగాల మాలచ్చి, వైగాల అప్పమ్మలకు చెందిన గొర్రెలు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. వెదుళ్లవలస గ్రామంలో బందపు సత్యవతి, బందపు ఈశ్వరరావు, బందపు చిన్నయ్య, బందపు రాములు, వాకాడ అప్పయ్య, దువ్వాన నందినలకు చెందిన గొర్రెలు చనిపోయాయి. కొండశంభాం గ్రామంలో లెంక అసిరినాయుడుకు చెందిన గొర్రెలు చనిపోయాయి. మండలం మొత్తం తుఫాన్ కారణంగా చలికి తట్టుకోలేక 95 గొర్రెలు చనిపోయినట్లు గుర్తించినట్లు తహసీల్దార్ కె.సుభాష్‌బాబు, పశువైద్యాధికారిణి డాక్టర్ కమలకుమారి తెలిపారు. సతివాడలో 108 గొర్రెలు... తెర్లాం: మండలంలోని సతివాడ గ్రామానికి సమీపంలో మామిడితోటలో గొర్రెల మందల్లోని 108 గొర్రెలు, పిల్లలు తుఫాన్ వల్ల వీచిన గాలులకు చల్లి తట్టుకోలేక మృతి చెందాయి. చీపురుపల్లి మండలం పేరిపి గ్రామానికి చెందిన 11 మంది గొర్రెల కాపరులు వారి గొర్రెల మందలను సతివాడ గ్రామంలో మంద కాసేందుకు తీసుకొచ్చారు. పెథాయ్ తుఫాన్ వల్ల కురిసిన వర్షాలు వీచిన గాలులకు సోమవారం రాత్రి మృతి చెందాయి. పేరిపికి చెందిన బాగు చినప్పయ్య, రామప్పమ్మ, లక్ష్మి, శ్రీదేవి, సూర్యకళ, గంగిమ్మ, రామప్పమ్మ, కాకి రాములమ్మ, సూరీడు, చినప్పమ్మ, రాములమ్మ, ఆదిలక్ష్మిలకు చెందిన 108 గొర్రెలు, పిల్లలు చనిపోయాయి. మంగళవారం మందను వేరే ప్రాంతానికి తరలించేందుకు చూడగా అవి మృతి చెంది ఉండడాన్ని గుర్తించి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వి.రామస్వామి, ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వివరాలు తెలుసుకున్నారు. చీపురుపల్లికి చెందిన మండల పశువైద్యాధికారితో పాటు గోపాలమిత్రలు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. చలితో.. చీపురుపల్లి రూరల్: పెథాయ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవటంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. మండలంలోని రావివలస గ్రామంలో పొదిలాపు గణపతికి చెందిన రెండు గేదె దూడలు మృతి చెందాయి. ఇదిలా ఉండగా అలజంగి పంచాయతీ పరిధి ఎలకలపేట గ్రామం కాకి సూర్యనారాయణకు చెందిన 15 గొర్రెలు రాజాం సమీపంలో గల అగూరు కంచరాం వద్ద చలి తీవ్రతతో మృతి చెందాయి. చలి గాలులకు 17 గొర్రెలు... శృంగవరపుకోట రూరల్: తుఫాన్ చలిగాలులకు తట్టుకోలేక మండలంలోని కొట్టాం గ్రామంలో 17 గొర్రెలు మృతి చెందినట్టు గ్రామ రెవెన్యూ అధికారి గణేష్ మంగళవారం తెలిపారు. కొట్టాం గ్రామానికి చెందిన నెక్కళ్ల అబద్ధం, నెక్కళ్ల రాములమ్మ, టేకుబోయిన ఎర్నాయుడు తమ గొర్రెల మందలను విశాఖ జిల్లా పెందుర్తి మండలం, పెదగాడ గ్రామాని కి మందకు తీసుకువెళ్లారు. సోమవారం రాత్రి వీచిన గాలులకు 17 గొర్రెలు మృతి చెందాయి. తహసీల్దార్ ఎం.అరుణకుమారికి సమాచారం అందజేశారు. 32 మూగజీవాలు మృతి సాలూరు రూరల్: పెథాయ్ తుఫాన్ వల్ల వీచిన చలి గాలులకు సాలూరు, పాచిపెంట మండలాల్లో సుమారు 32 మూగజీవాలు మృతి చెందాయి. సాలూరు మండలంలో 2, పాచిపెంట మండలంలో 30 మూగజీవాలు మృతి చెందాయి. సాలూరు మండలంలో దుగ్దిసాగరం పంచాయతీలో పుల్లేరిగుడ్డివలసలో 1 ఆవు, ఒక దూడ మృతి చెందాయి. పాచిపెంట మండలంలో పద్మాపురం, కేసలి, కొటికిపెంట, పనుకువలస, బొర్రమామిడి పంచాయతీల్లో తెట్టేడివలసలో 4 మేకలు, కేసలిలో 2 గొర్రెలు, కోష్టువలసలో 4 గొర్రెలు, పెదచీపురువలసలో 4 మేకలు, బడ్నాయికవలసలో 2 ఆవులు, రాయివలసలో 1 మేక, 3 ఆవులు, బొర్రమామిడిలో 1 ఆవు, చినచీపురువలసలో 1 మేక, బడేవలసలో 6 మేకలు, సేరిగుడ్డిలో ఆవు దూడ, మెట్టగుడ్డిలో 1 మేక మృతి చెందినట్లు ఇన్చార్జి తహసీల్దార్ కుప్పిలి నాగేశ్వరరావు తెలిపారు. పశు వైద్యాధికారులు, సిబ్బంది, రెవెన్యూ అధికారులు పర్యటించి దర్యాప్తు నిర్వహించారు. చలి తీవ్రతతో.. మెంటాడ: ఈదురు గాలులతో ప్రారంభమైన పెథాయ్ తుఫాన్ చలికి తట్టుకోలేక పోరాంలో నాలుగు, ఉద్దంగిలో నాలుగు, జయితిలో 8, చింతలవలస ఆరు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. సవరివల్లిలో రెండు ఎద్దులు మృతి చెందినట్లు పెంపకందారులు తెలిపారు. 22 గొర్రెలు మృతి గుర్ల: పెథాయ్ తుఫాన్ వల్ల రెండు రోజులుగా వీస్తున్న చలి గాలులకు 22 గొర్రెలు మృతి చెందాయి. మణ్యపురిపేటలో 14 గొర్రెలు, గుర్లలో 8 గొర్రెలు, చింతలపేటలో ఎద్దు మరణించాయి. రెండు రోజులుగా చలితీవ్రత అధికంగా ఉండడం వల్ల చలికి తట్టుకొలేక మరణించినట్లు పశువైద్యాధికారులు మంగళవారం తెలిపారు. గుర్లలోని గొర్రెల కాపరులను ఎంపీడీవో ఆమంచి కామేశ్వరరావు, ఈవోపీఆర్డీ అల్లు భాస్కరరావు పరామర్శించారు. గొర్రెల మృతి చెందిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహరం అందేలా చర్యల తీసుకుంటాం ఎంపీడీవో హమీ ఇచ్చారు. మృతి చెందిన పశువులు బొబ్బిలి రూరల్: పెథాయ్ తుఫాన్‌తో వీచిన చలి గాలులకు కారాడలో వై.గంగయ్య, వై.అప్పలస్వామిలకు చెందిన చెరో మేక మృతి చెందగా మెట్టవలసలో ఒక మేక చనిపోయింది. నారశింహునిపేటకు చెందిన పి.లకు‡్ష్మనాయుడుకు చెందిన ఆవు, దూడ మృత్యువాత పడ్డాయి. పెంపకందారులకు ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామని పశువైద్యులు సుధాకర్, అనిత తెలిపారు. లెంకపేటలో... మెరకముడిదాం: మండలంలోని గర్భాం మేజర్ పంచాయతీ పరిధిలో గ్రామమైన లెంకపేట గ్రామంలో పెథాయ్ తుఫాన్ కారణంగా చలికి తట్టుకోలేక గ్రామానికి చెందిన కోరాడ చిన్నయ్యకు చెందిన ఐదు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటూ ఈదురు గాలుల వల్ల గొర్రెలు మృతి చెందాయి. -
ఆంత్రాక్స్‌పై యాక్షన్ ప్లాన్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో మహమ్మారిలా మారిన ఆంత్రాక్స్ నివారణకు ప్రభుత్వం ఐదేళ్ల సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖ ఏజెన్సీలో ఏటా ఆంత్రాక్స్ కలకలం రేపుతున్న నేపథ్యంలో పశుసంవర్థక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి ఆమోదం తెలుపుతూ నిధుల విడుదలకు ప్రభుత్వం జీవో నంబరు 21ని జారీచేసింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. పాడేరు కేంద్రంగా ఇతర కార్యక్రమాల అమలుకు ఏటా గిరిజన సంక్షేమ శాఖ నుంచి అవసరమైన నిధులు కేటాయిస్తారు. రాష్ట్రంలో ఆంత్రాక్స్ వ్యాక్సిన్ తయారీ కేంద్రం లేదు. దీంతో వ్యాధి నివారణకు అవసరమయ్యే 3 లక్షల డోస్‌ల ఆంత్రాక్స్ డోస్‌ను సరఫరా చేయాలని పశుసంవర్థకశాఖ జేడీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాటు మృత పశువుల బ్యాక్టీరియా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా సరిగా ఖననం చేస్తారు. ఇంకా 500 పశుమిత్రలను ఎంపిక చేసి, శిక్షణ ఇస్తారు. వీరు ఏజెన్సీ 11 మండలాల్లోని 3700 శివారు గ్రామాలను కవర్ చేస్తారు. వీరికి కిట్లను అందజేస్తారు. ఇందుకు రూ.1.48 కోట్లు, గిరిజనులకు గొర్రెలు, మేకల పెంపకానికి రూ.1.72 కోట్లు కేటాయించారు. వ్యాక్సినేషన్ ఇన్సెంటివ్‌లకు రూ.49 లక్షలు, గిరిజనుల్లో అవగాహనకు రూ.15.40 లక్షలు, ప్రచారానికి రూ.25.50 లక్షలు, పశువుల గుర్తింపునకు రూ.1.25 కోట్లు, పశువుల బీమాకు రూ.19.36 కోట్లు వెరసి రూ.25 కోట్లు మంజూరు చేశారు. దీర్ఘకాలిక ప్రణాళిక కింద గోకులంలు, వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు రూ.104 కోట్లు వెచ్చించనున్నారు.