ఆంత్రాక్స్‌పై యాక్షన్‌ ప్లాన్‌

Action Plan On Anthrax - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో మహమ్మారిలా మారిన ఆంత్రాక్స్‌ నివారణకు ప్రభుత్వం ఐదేళ్ల సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖ ఏజెన్సీలో ఏటా ఆంత్రాక్స్‌ కలకలం రేపుతున్న నేపథ్యంలో పశుసంవర్థక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి ఆమోదం తెలుపుతూ నిధుల విడుదలకు ప్రభుత్వం జీవో నంబరు 21ని జారీచేసింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. పాడేరు కేంద్రంగా ఇతర కార్యక్రమాల అమలుకు ఏటా గిరిజన సంక్షేమ శాఖ నుంచి అవసరమైన నిధులు కేటాయిస్తారు.

రాష్ట్రంలో ఆంత్రాక్స్‌ వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం లేదు. దీంతో వ్యాధి నివారణకు అవసరమయ్యే 3 లక్షల డోస్‌ల ఆంత్రాక్స్‌ డోస్‌ను సరఫరా చేయాలని పశుసంవర్థకశాఖ జేడీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాటు మృత పశువుల బ్యాక్టీరియా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా సరిగా ఖననం చేస్తారు. ఇంకా 500 పశుమిత్రలను ఎంపిక చేసి, శిక్షణ ఇస్తారు. వీరు ఏజెన్సీ 11 మండలాల్లోని 3700 శివారు గ్రామాలను కవర్‌ చేస్తారు. వీరికి కిట్లను అందజేస్తారు. ఇందుకు రూ.1.48 కోట్లు, గిరిజనులకు గొర్రెలు, మేకల పెంపకానికి రూ.1.72 కోట్లు కేటాయించారు. వ్యాక్సినేషన్‌ ఇన్సెంటివ్‌లకు రూ.49 లక్షలు, గిరిజనుల్లో అవగాహనకు రూ.15.40 లక్షలు, ప్రచారానికి రూ.25.50 లక్షలు, పశువుల గుర్తింపునకు రూ.1.25 కోట్లు, పశువుల బీమాకు రూ.19.36 కోట్లు వెరసి రూ.25 కోట్లు మంజూరు చేశారు. దీర్ఘకాలిక ప్రణాళిక కింద గోకులంలు, వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు రూ.104 కోట్లు వెచ్చించనున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top