కరోనా బాధితురాలిని ఇంటికి రానివ్వని అత్త | Family Not Allowed to COVID 19 Daughter in law SPSR Nellore | Sakshi
Sakshi News home page

రెండు రోజులుగా రోడ్డుపైనే..

Jul 20 2020 12:52 PM | Updated on Jul 20 2020 12:52 PM

Family Not Allowed to COVID 19 Daughter in law SPSR Nellore - Sakshi

నెల్లూరు(అర్బన్‌): కరోనా సోకిన ఓ మహిళను ఇటు సొంత అపార్ట్‌మెంట్‌లోకి రానివ్వక, అటు అత్తగారింట్లోకి అడుగు పెట్టనివ్వకపోవడంతో రోడ్డుపైనే రెండు రోజులుగా ఉండాల్సిన దారుణ స్థితి నెల్లూరు నగరంలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ స్వయంగా స్పందించడంతో ఆమెకు వైద్యం అందింది. దారుణమైన ఈ ఘటనను పరిశీలిస్తే.. నగరంలోని 15వ వార్డులో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. ముందుగా భర్తకు కరోనా పాజిటివ్‌ రావడంతో నారాయణ ఆస్పత్రికి తరలించారు. తర్వాత భార్యకు చేసిన పరీక్షల్లో ఆమెకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో నారాయణ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఉండేందుకు బెడ్లు ఖాళీగా లేవని, హోం ఐసోలేషన్‌లో ఇంట్లోనే ఉండాలని డాక్టర్లు ఉచిత సలహా ఇచ్చి ఆస్పత్రిలో చేర్చుకోలేదు. ఇక చేసేదేమీ లేక సొంత ఇంటికి రావడంతో అక్కడ అపార్ట్‌మెంట్‌ వారు రావద్దన్నారు.

పక్కనే 14వ వార్డులో ఆమె అత్త ఒక్కటే నివసిస్తోంది. డబుల్‌ బెడ్‌ రూం కావడంతో అక్కడ హోం ఐసోలేషన్‌లో ఉండొచ్చని కొండంత ఆశతో అత్తగారింటికి వెళ్లింది. కరోనా తనకు కూడా సోకుతుందనే భయంతో అత్త తన ఇంట్లోకి రావద్దని చెప్పింది. ఆమె మరుదులు(భర్త తమ్ముళ్లు) ఇద్దరు కూడా ఇంట్లోకి రానీయవద్దని చెప్పేశారు. చేసేదేమీ లేక శుక్రవారం సాయంత్రం నుంచి అత్త ఇల్లు ఉండే రోడ్డు మీదనే ఆమె ఉండాల్సివచ్చింది. ఈ బాధాకరమైన ఘటన మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌కు ఆదివారం తెలిసింది. వెంటనే 15వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వెంకటేశ్వర్లును ఆమె అత్తగారింటికి పంపించారు. మంత్రి కూడా స్వయంగా అత్త, బాధితురాలితో మాట్లాడారు. నారాయణ వైద్యశాలకు ఫోన్‌ చేసి తక్షణమే ఆమెను ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకోవాలని ఆదేశించారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చూడాలని జేసీ ప్రభాకర్‌రెడ్డిని మంత్రి ఆదేశించారు. దీంతో జిల్లా అధికారులు స్పందించారు. వెంటనే 108 వాహనాన్ని పంపారు. వైఎస్సార్‌సీపీ 15వ డివిజన్‌ ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో 108లో బాధితురాలిని నారాయణ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రస్తుతం ఆమెను అడ్మిట్‌ చేసుకుని డాక్టర్లు వైద్యసేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ మాట్లాడుతూ కరోనా వచ్చినంత మాత్రాన రోగిని హీనంగా చూడకూడదన్నారు. రోగుల విషయంలో మానవత్వం ప్రదర్శించాలని కోరారు. ప్రభుత్వం తరఫున పూర్తిగా రోగులను ఆదుకుంటామని తెలిపారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement