మా కుటుంబానికి న్యాయం చేయండి

Family Hunger Strike Infront Of Collectorate - Sakshi

నా భర్తను హత్య చేసిన వ్యక్తులను అరెస్టు చేయండి : భార్య సకురు లక్ష్మి

సీఐ, ఎస్‌ఐలపై చర్యలు చేపట్టాలంటూ కలెక్టరేట్‌ వద్ద నిరాహారదీక్ష

కాకినాడ రూరల్‌: తన భర్త సకురు రాంబాబును హత్యచేసిన వ్యక్తులను కాపాడుతున్న అన్నవరం ఎస్సై, ప్రత్తిపాడు సీఐలపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతుడు రాంబాబు భార్య సకురు లక్ష్మి తన పిల్లలు, బంధువులతో కలెక్టరేట్‌ వద్ద మంగళవారం నిరాహారదీక్ష చేపట్టారు. తన భర్త మేకలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడని, అతడి మరణానికి నాలుగు రోజుల ముందు శంఖవరం మండలం వజ్రకూటం గ్రామానికి చెందిన సకురు ధర్మరాజు పోడుభూమి వ్యవహారంలో తన భర్తను చంపి కాల్చేస్తానంటూ బెదిరించాడన్నారు.

ఫిబ్రవరి 23న వజ్రకూటానికి చెందిన ధర్మరాజు, అతను పురమాయించుకున్న కిరాయి మనుషులు కర్రి సోమరాజు, దేశలింగ రాంబాబు, అమలకోటి సూరిబాబు, అతడి అల్లుళ్లు గోపు సురేష్, కేళంగి జగ్గారావు, మేనల్లుడు గంగుమళ్ల అప్పారావు తన భర్తను హత్య చేసి కాల్చేశారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.  అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తన భర్తను చంపిన వ్యక్తులపై కేసులు పెట్టాలని కోరుతుంటే.. అన్నవరం పోలీసులు తమ కుటుంబాన్ని బెదిరించి, తప్పుడు కేసులు పెడుతున్నారని లక్ష్మి  విలపించింది. తన కుటుంబానికి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా తన భర్తను హత్యచేసిన ధర్మరాజు అతడి మనుషులను అరెస్టు చేయాలంటూ లక్ష్మి డిమాండ్‌ చేసింది. ఈ దీక్షల్లో సకురు త్రిమూర్తులు, సకురు రోజామణి, సకురు వెంకటలక్ష్మి, సకురు విష్ణుమూర్తి, పెదిరెడ్డి మంగ, సకురు నాగేశ్వరరావు తదితరులు కూర్చొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top