నకిలీ నోట్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను టౌన్ సీఐ యు.
నకిలీ నోట్ల ముఠా అరెస్టు
Jan 7 2014 2:58 AM | Updated on Sep 2 2017 2:21 AM
రేపల్లె రూరల్, న్యూస్‌లైన్ :నకిలీ నోట్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను టౌన్ సీఐ యు.నాగరాజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండలంలోని నల్లూరుకు చెందిన రైతు శ్రీపతి శ్రీనివాసరావును రేపల్లెలో 20 రోజుల క్రితం పేటేరుకు చెందిన గాలి చంద్రబాబు, అమర్తలూరి వీరబాబు, భట్టిప్రోలుకు చెందిన పేటేటి అరవిందబాబులు కలిశారు. రూ. 50 వేలు ఇస్తే లక్ష రూపాయలు నకిలీ నోట్లు ఇస్తామని వారు నమ్మబలికారు.తన వద్ద ఉన్న పది వేల రూపాయలను శ్రీనివాసరావు ఇవ్వగా మిగతా రూ.40 వేలు ఇస్తే రాజమండ్రిలో లక్ష రూపాయల నకిలీ నోట్లు ఇప్పిస్తామని నమ్మించారు. అయితే, ఇటీవల గుడ్డికాయలంకలో నకిలీ నోట్ల ముఠాను అరెస్టు చేశారన్న సంగతి తెలుసుకున్న శ్రీనివాసరావు మోసపోయానని భావించి నాలుగు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించాడు.
ఆ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం ఉదయం బస్టాండ్ సెంటర్‌లో అనుమానాస్పదంగా ఉన్న అరవిందబాబు, వీరబాబు, చంద్రబాబులను అదుపులోకి తీసుకుని విచారించారు. అరవిందబాబు నకిలీ నోట్ల మార్పిడి ఏజెంట్‌గా మారి అమాయకులకు డబ్బు ఆశ చూపి మోసగిస్తున్నట్లు వెల్లడయింది. గతంలో గాలి చంద్రబాబు, అమర్తలూరు వీరబాబులకు నకిలీనోట్లు ఇప్పిస్తానని రూ.1.70 లక్షలు అరవిందబాబు కాజేశాడు. దీంతో నష్టపోయిన సొమ్మును రాబట్టుకునేందుకు ఈ ఇద్దరు కూడా అరవిందబాబుతో జతకట్టారు. అరవిందబాబు ఇప్పటివరకు రేపల్లె, నరసరావుపేట, వెల్లటూరులలో ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు విచారణలో తెలింది. సమావేశంలో హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వరావు, సిబ్బంది లింగరాజు, హర్ష, పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement