అనకాపల్లిలో దొంగనోట్ల గుట్టు రట్టయింది. రూ.4.95 లక్షల విలువైనవిగా కనిపించే నకిలీ కరెన్సీని అనకాపల్లి
దొంగనోట్ల గుట్టు రట్టు
Sep 18 2013 2:42 AM | Updated on May 28 2018 4:20 PM
అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్ : అనకాపల్లిలో దొంగనోట్ల గుట్టు రట్టయింది. రూ.4.95 లక్షల విలువైనవిగా కనిపించే నకిలీ కరెన్సీని అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. దొంగనోట్లతో రైల్వేస్టేషన్‌లో సంచరిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వాస్తవ్యుడు ద్వారపూడి వెంకటరెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విక్రంజిత్ దుగ్గల్ మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన సమాచారం ప్రకారం.. తణుకుకు చెందిన వెంకటరెడ్డి అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో నకిలీ నోట్లతో తిరుగుతూ ఉండగా సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు పట్టుకున్నా రు. అతని నుంచి వెయ్యి, అయిదు వందల నోట్లలో ఉన్న రూ.4.95 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు వెంకటరెడ్డిని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయని ఎస్పీ తెలిపారు. దొంగనోట్ల చెలామణీ వ్యవహారంలో పట్టణానికి చెందినవారే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారికి కూడా సంబంధాలున్నాయని తెలిసిందన్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నకిలీ నోట్లను వెంకటరెడ్డి తీసుకువచ్చి అసలు నోట్లను మార్చి సంబంధిత వ్యక్తులకు ఇచ్చే మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాడని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి సమగ్ర సమాచారాన్ని రాబడతామని తెలిపారు. దొంగనోట్లతో సంబంధమున్న వారిని పట్టుకుంటామని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ వి.ఎస్.ఆర్. మూర్తి, సీఐలు పి. శ్రీని వాసరావు, జి. శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement