నకిలీ సీబీఐ అధికారుల హల్‌చల్‌ ... | Fake CBI Officials' Search Two Houses In Visakhapatnam | Sakshi
Sakshi News home page

నకిలీ సీబీఐ అధికారుల హల్‌చల్‌ ...

Jul 22 2018 1:09 PM | Updated on Aug 25 2018 5:39 PM

Fake CBI Officials' Search Two Houses In Visakhapatnam - Sakshi

సీబీఐ అధికారులమంటూ హడావుడి చేసిన వ్యక్తులు

శుక్రవారం ఉదయం 7.30 గంటలు.. సీతమ్మధార కేఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌లోనూ, బాలయ్యశాస్త్రి లేఔట్‌లోనూ రెండు ఇళ్లపై సీబీఐ దాడులు జరిగాయి.

ఇద్దరు యువకులు వచ్చి తాము సీబీఐ అధికారులమని చెప్పుకున్నారు.. కుటుంబ సభ్యులందరి వద్ద నుంచి ఫోన్లు లాక్కున్నారు. వారందరినీ ఒక రూములోకి పంపించి దాదాపు నిర్బంధించినంత పని చేశారు. ఎవరైనా కదిలినా,  వేరే వాళ్లకు సమాచారం అందించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. 

తాము సీబీఐ అధికారులమనీ, తమకు వచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించేందుకు సహకరించాలన్నారు. 

ఐడీకార్డు చూపించమని అడిగితే.. పాన్‌ కార్డు చూపించి..  తనిఖీలకు వచ్చినప్పుడు ఐడీ కార్డు చూపించాల్సిన అవసరం లేదని దబాయించారు.
దీంతో.. ఇళ్లలోనివారు సైలెంట్‌ అయిపోయారు. 

వచ్చినవారు ఇళ్లలోని అణువణువూ జల్లెడ పట్టారు. ప్రతి అంగుళం సోదా చేసి.. మీ ఇంట్లో ఏమీ దొరకలేదంటూ వెళ్లిపోయారు.

ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధితులు.. ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించారు. తీరా చూస్తే.. వారంతా నకిలీ సీబీఐ అధికారులని తేలింది. వారికి ఓ ఆర్‌ఎస్‌ఐ సహకరించినట్లు పోలీసుల చేతికి చిక్కిన సీసీటీవీ ఫుటేజీల ద్వారా వెల్లడైంది. 

ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీలో నకిలీ ఏసీబీ అధికారులు దాడులు చేసిన వైనం మరవకముందే.. సీబీఐ అధికారులమంటూ దుండగులు చేసిన తాజా హడావుడి కలకలం సృష్టిస్తోంది.    

విశాఖసిటీ, విశాఖ క్రైం: నగరంలోని సీతమ్మధార రైతుబజార్‌ ఎదురుగా ఉన్న కేఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ సీ బ్లాక్‌లోని 401 ఫ్లాట్‌లో నివాసముంటున్న దాట్ల వెంకట సూర్యనారాయణేశ్వర జోగి జగన్నాధరాజు ఓ సివిల్‌ ఇంజినీరింగ్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 7.30 గంటలకు జగన్నాథరాజు పేపర్‌ చదువుతుండగా ఇద్దరు అపరిచిత యువకులు నేరుగా ఇంట్లోకి ప్రవేశించి సీబీఐ అధికారులమంటూ హల్‌చల్‌ చేశారు. ఇంట్లో వారందరినీ.. ఓ గదిలోకి తీసుకెళ్లి ఉంచారు. ఓ గదిలో అనారోగ్యంతో బాధపడుతున్న జగన్నాథరాజు తల్లి ఉన్నారు. 

ఆమె వద్దకు వెళతామని చెప్పినా వారు అంగీకరించలేదు. దాదాపు గంట సేపు తనిఖీల పేరుతో హడావుడి చేశారు. అన్ని గదుల్లో ఉన్న సూట్‌కేసులు, అల్మరాలు మొత్తం సోదాలు చేసి సామాన్లు చిందరవందరగా పడేసి ఏమీ దొరకలేదని వెళ్లిపోయారు. కిందికి వచ్చి చూడగా.. పోలీస్‌ అని రాసి ఉన్న ఏపీ35డీడీ1533 నంబర్‌ గల కారులో వెళ్లిపోతూ కనిపించారు. ఈ హఠాత్పరిణామంతో జగన్నాథరాజు తల్లి మరింత అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుడు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును ఆశ్రయించగా శుక్రవారం ద్వారకానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టగా.. కేఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌లో అమర్చి ఉన్న సీసీటీవీల్లో నకిలీ సీబీఐ అధికారుల కదలికలు కనిపించాయి. వారికోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. వీరితో పాటు వచ్చిన పోలీస్‌ దుస్తుల్లో ఉన్న వ్యక్తి ఓ రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని ద్వారకానగర్‌ పోలీసులు విచారించగా.. తన స్నేహితుడు తనతో పాటు రమ్మని కేఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లారని, పైన ఏం జరిగిందనేది తనకు తెలీదని ఆయన చెప్పినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ద్వారకానగర్‌ సీఐ రాంబాబు తెలిపారు.

గంట తర్వాత మరోచోట
కాగా అక్కడికి గంట తర్వాత బాలయ్యశాస్త్రి లే అవుట్‌లోనూ ఇదే మాదిరిగా అపరిచితులు సోదాల పేరుతో హల్‌చల్‌ చేశారు. గీతికా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న పేరిచర్ల ప్రసాదరాజు ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ అధికారులమంటూ వెళ్లి సోదాలు నిర్వహించారు. దాదాపు గంట పాటు సోదాలు చేసిన అనంతరం.. పొరపాటున వచ్చామంటూ వేగంగా వెళ్లిపోయారనీ.. బాధితుడు ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ తిరుమలరావు తెలిపారు.రెండు నెలల క్రితం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులమంటూ కొంతమంది వ్యక్తులు దాడులు నిర్వహించిన ఘటన కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో మరోసారి నగరంలో నకిలీ సీబీఐ దాడులు అలజడి రేపుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement