Sakshi News home page

‘ఎక్సైజ్’ సదస్సులో కొట్లాట

Published Sun, Jul 27 2014 12:36 AM

‘ఎక్సైజ్’ సదస్సులో కొట్లాట - Sakshi

భీమవరపుకోటలో అవగాహన సదస్సు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు గ్రామంలో సారా తయారీదారుల పేర్లు చెప్పిందెవరంటూ ఇరువర్గాల కొట్లాట
 
నాతవరం : విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల ఎక్సైజ్ అధికారులు భీమవరపుకోటలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సు ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు ఎక్సైజ్ పోలీసులు లాఠీ చార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ గ్రామంలో సుమారు 80 మందికిపైగా నాటు సారా తయారీ విక్రయదారులు ఉన్నట్టు తమ దృష్టికి రావడంతో ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

సదస్సు అనంతరం ఇరువర్గాల వారు గ్రామంలో సారా తయారు చేస్తున్నవారి పేర్లు ఎవరు చెప్పారంటూ ఎక్సైజ్ అధికారులు ఎదుట ఘర్షణకు దిగారు. ఒకరినొకరు తిట్టుకుంటూ సదస్సు ప్రాంగణంలో కొట్టుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ఎక్సైజ్ అధికారులు ఎంత ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. ఈ ఘటనలో కొందరు స్వల్ప గాయాలకు గురయ్యారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో అధికారులు లాఠీ చార్జి చేసి వారిని చెదగొట్టారు.

ఈ సందర్భంగా నర్సీపట్నం ఎక్సైజ్ సీఐ జగన్మోహనరావు మాట్లాడుతూ మీ కోసమే ఈ సదస్సు నిర్వహించామని, ఈ విధంగా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల నాతవరం మండలంలో పట్టుబడిన సారా విక్రయదారులను ప్రశ్నిస్తే మీ వద్ద నుంచే సారా తెస్తున్నామని వారు చెప్పిన నేపథ్యంలో ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. దీంతో వారంతా శాంతించారు.
 

Advertisement

What’s your opinion

Advertisement