అధికార పార్టీ జులుం మితిమీరింది | Excessive oppression of the ruling party | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ జులుం మితిమీరింది

Sep 5 2015 1:51 AM | Updated on Aug 10 2018 8:16 PM

అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరి పోయాయని, ఇలాగైతే రాష్ట్రంలో ఉద్యోగులు పనిచేయలేరని ఏపీ ఉద్యోగుల ...

ఏఈపై టీడీపీ ఎంపీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
ఏపీ జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ చంద్రశేఖర్‌రెడ్డి
 

హైదరాబాద్: అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరి పోయాయని, ఇలాగైతే రాష్ట్రంలో ఉద్యోగులు పనిచేయలేరని ఏపీ ఉద్యోగుల జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీపీ ప్రతాపరెడ్డి ఇటీవలే బద్వేలులో గ్రామీణ నీటిసరఫరా (ఆర్‌డబ్ల్యుఎస్) విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసాద్‌పై దాడిచేయడాన్ని హేయమైన చర్యగా వర్ణించారు. శుక్రవారం ఆయన ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలతో పాటు ఆర్‌డబ్ల్యుస్, పంచాయతీరాజ్ ఇంజినీర్ల సంఘాలతో కలిసి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాకు చెందిన తహసిల్దార్ వనజాక్షిని అధికార పార్టీ ఎమ్మెల్యే దారుణంగా కొట్టారు. ఇప్పుడేమో ఏఈపై ఎంపీపీ దాడి చేశారు.  ఉద్యోగులు పనిచేయాలంటేనే భయపడుతున్నా’రని అన్నారు. అధికార పార్టీ ఎంపీపీ పదిమంది గూండాలను తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా దాడిచేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

 కలెక్టర్లు ప్రభుత్వ తొత్తులు కాదు
 జిల్లా కలెక్టర్లు అధికార పార్టీకి తొత్తులు కాదని, ఉద్యోగులపై దాడి జరిగితే అండగా నిలవాలని చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. దాడికి గురైన ఆర్‌డబ్ల్యూ ఏఈ.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే స్పందించకపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రా కేసు నమోదు చేస్తే కేసును ఉపసంహరించుకోవాలని కోరడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, 24 గంటల్లో ఏఈపై దాడి చేసిన వారిని అరెస్టు చెయ్యకపోతే ఇంజినీర్లందరూ విధులు బహిష్కరిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ ఇంజినీర్ల సంఘం కార్యదర్శి మురళీకృష్ణలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement