నిలిచిన రూ.10 వేల కోట్ల వ్యాపారం

An estimated Rs 10,000 crore business was stopped - Sakshi

     లారీల సమ్మెతో 5 రోజుల్లో ప్రభుత్వానికి రూ.125 కోట్ల నష్టం

     కంకర, ఇటుక సరఫరా ఆగడంతో కుదేలైన నిర్మాణ రంగం

     ఆగిపోయిన బంగాళాదుంప, ఉల్లిపాయ, టమాటా సరఫరా 

     మరో రెండు రోజులు సమ్మె కొనసాగితే అన్ని రంగాలపై ప్రభావం  

సాక్షి, అమరావతి: గత 5 రోజులుగా నడుస్తున్న లారీల సమ్మె ప్రభావం క్రమంగా సామాన్యులను తాకుతోంది. సమ్మె వల్ల రాష్ట్రంలో రూ. 10 వేల కోట్ల వ్యాపార లావాదేవీలు నిలిచిపోయినట్లు ఏపీ లారీ యజమానులు సంఘం వెల్లడించింది. కూరగాయల ధరలు రెక్కలు విచ్చుకుంటుండగా, ఇటుక, కంకర, సిమెంట్‌ సరఫరా తగ్గడంతో నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పశ్చిమ బెంగాల్‌ నుంచి బంగాళదుంపలు, మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయ దిగుమతులు ఆగిపోగా, రాష్ట్రం నుంచి టమాటా, ఇతర కూరగాయల ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో కూరగాయల ధరలు క్రమేపీ పెరగుతున్నాయి. తొలుత నిత్యవసర వస్తువులను సమ్మె నుంచి మినహాయించాలని చూసినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో కూరగాయల సరఫరాను ఆపేయాలని నిర్ణయించినట్లు లారీ యజమానుల సంఘం తెలిపింది. సిమెంట్, ఇసుక, కంకర సరఫరా ఆగిపోవడంతో నిర్మాణ రంగ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి పనులు లేక కూలీలు రోడ్డునపడ్డారు. ప్రస్తుతానికి సమ్మె ప్రభావం ఎక్కువగా లేకపోయినా ఇంకో రెండు రోజులు దాటితే మాత్రం అన్ని రంగాలపై ప్రభావం పడుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏ క్షణమైనా సమ్మెలోకి పెట్రోలు ట్యాంకర్లు
ముఖ్యంగా బియ్యం రవాణాపై లారీల సమ్మె ప్రభావం అధికంగా కనిపిస్తోంది. బియ్యం ఎగుమతుల కోసం కాకినాడలో నాలుగు ఓడలు, పంచదార కోసం రెండు ఓడలు నిలిచి ఉండగా లారీల సమ్మె కారణంగా ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో మిల్లర్లు బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేసే కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)తో నెట్టుకొస్తున్నట్లు రాష్ట్ర రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ కార్యదర్శి సాదినేని హన్ముంతరావు తెలిపారు. గత ఐదు రోజుల సమ్మె వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.125 కోట్లు, లారీ యజమన్యాలు రూ. 175 కోట్లు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే మొండి వైఖరి కొనసాగిస్తే నిత్యావసరాల సరఫరాను కూడా నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వై.ఈశ్వరరావు తెలిపారు. ఏక్షణమైనా పెట్రోలు ట్యాంకర్లను కూడా సమ్మెలోకి తీసుకువస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

మార్కెటింగ్‌పై లారీల సమ్మె పోటు
లారీల సమ్మె మార్కెటింగ్‌ శాఖ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సమ్మె కారణంగా వాణిజ్య పంటలకు మంచి ధర రాకపోవచ్చనే ఉద్దేశంతో రైతులు మిర్చి, పసుపు, ఉల్లి, పత్తి, సుగంధ ద్రవ్యాలను మార్కెట్‌ కమిటీలకు దిగుమతి చేయడం లేదు. దీంతో మార్కెట్‌ కమిటీల ఆదాయం గణనీయంగా పడిపోతోంది. ధాన్యం, అపరాల విక్రయాలు తగ్గిపోవడంతో దాని ప్రభావం ఆదాయంపై పడింది. సెస్‌ రూపంలో సాలీనా మార్కెటింగ్‌ శాఖకు రూ. 150 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. ఐదు రోజులుగా జరుగుతున్న లారీల సమ్మె కారణంగా సెస్‌ రూపంలో రావాల్సిన రూ.15 కోట్ల ఆదాయం నిలిచిపోయిందని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు జరిగిన రాష్ట్ర బంద్‌ విజయవంతం కావడంతో మార్కెట్‌ కమిటీల్లో పూర్తిగా క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top