వేటు మొదలయ్యింది....!

ERO Memos to Voter Lists Officials - Sakshi

ఓటర్ల జాబితాపై సిబ్బందిలో ఆందోళన

ఏమరుపాటుగా ఉంటే కఠిన చర్యలు

ఇప్పటికే 33 మంది ఉద్యోగులకు నోటీసులు

తాజాగా తిరుపతిలో బీఎల్వో సస్పెన్షన్‌

పలమనేరు ఈఆర్వో ప్రభాకర్‌రెడ్డికి చార్జిమెమో  

ఎన్నికల విధులకు ఎవరూ అతీతులుకారు

చిత్తూరు కలెక్టరేట్‌ :  ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు జిల్లాలో గట్టి కసరత్తు జరుగుతోంది. సవరణ జాబితా ప్రక్రియలో అలసత్వం చూపిన 33 మంది ఉద్యోగులకు ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం కలెక్టర్‌ తిరుపతి నియోజకవర్గంలోని 181వ నెంబరు పోలింగ్‌ బూత్‌లో బీఎల్వోను సస్పెండ్‌ చేశారు. సెలవుకు ముందస్తు అనుమతి తీసుకోనందుకు, ఓటర్ల ప్రక్రియలో వెనుకబడినందుకు పలమనేరు ఈఆర్వో(జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి) ప్రభాకర్‌రెడ్డికి చార్జి్జమెమో జారీచేశారు. దీంతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. ఈ ప్రక్రియపై కలెక్టర్‌ శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

బీఎల్వోను ఎందుకు సస్పెండ్‌ చేశారంటే ..
తిరుపతి నియోజకవర్గంలోని పోలింగ్‌బూత్‌ నెంబర్‌ 181లో ఆశావర్కర్‌ (శివనేశ్వరి)ని సస్పెండ్‌ చేశారు. ఆ పోలింగ్‌ బూత్‌లోని సుమంత్‌ అనే యువకుడు ఆమెపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీఈవో సిసోడియాకు ఫిర్యాదు చేశారు. సుమంత్‌ తన ఓటు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.  క్షేత్రస్థాయిలో తనిఖీకి వెళ్లిన బీఎల్వో అతని ఆధారాలు చూపాలని కోరింది. సుమంత్‌ తన ఆధార్‌కార్డు గతంలో వైఎస్సార్‌ జిల్లాలో ఉండేదని ప్రస్తుతం తిరుపతిలో ఉద్యోగరీత్యా ఉన్నానని చెప్పారు. ఓటు మార్పునకు ఏదో ఒక ఆధారం కావాల్సిందే. ఆధారం లేకుండా ఓటును ఆమోదించాలంటే రూ.20 ఇవ్వమని  కోరినట్లు సుమంత్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన  కలెక్టర్‌ ప్రద్యుమ్న ఆమెను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు. జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరూ అప్రమత్తం కా వాలని టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హెచ్చరించారు.

తహసీల్దార్‌ కార్యాలయాల తనిఖీకి ఆదేశాలు
ఆకస్మికంగా తనిఖీలుంటాయని కలెక్టర్‌ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. 15 నుంచి జిల్లాలోని తహసీల్దార్‌ కార్యాలయాలు తనిఖీ చేస్తామన్నారు.  ఇప్పటివరకు అందిన దరఖాస్తుల మ్యాన్యువల్‌ నివేదికలు, ఈఆర్వో నెట్‌ నివేదికలు తప్పనిసరిగా ఉండాలన్నారు. వీఐపీ ఓట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. వీఐపీ ఓట్ల మార్కింగ్‌ విషయంలో వారు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించాలన్నారు. కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓటు వినియోగించుకునేలా చూడాలన్నారు.  జిల్లాకు ఎన్నికల అబ్జర్వర్‌ వచ్చేసరికి(17నాటికి) ప్రక్రియ పూర్తవ్వాలన్నారు.

ఓటర్ల సమస్యల పరిష్కారానికి కాల్‌సెంటర్‌
ఓటర్ల సమస్యల ఫిర్యాదుకు, పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో కాల్‌సెంటర్‌ ను ప్రారంభిం చారు.  ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇది పనిచేస్తుందని డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్‌ వెల్లడించారు. జిల్లాలోని ఓటర్లు సమస్యలుంటే 08572–240899 నెంబర్‌‡ తెలియజేయాలన్నారు.  ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్నట్లు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top