రాష్ట్రాన్ని విభజిస్తే రెండు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగేలా ఉండాలని, లేకుంటే సమైక్యంగానే ఉంచాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ డిమాండ్ చేశారు
ఒంగోలు, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని విభజిస్తే రెండు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగేలా ఉండాలని, లేకుంటే సమైక్యంగానే ఉంచాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా ఆ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు స్థానిక చర్చిసెంటర్‌లో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష శిబిరాన్ని సోమవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ముందుగా జగన్ దీక్షకు మద్దతుగా స్థానిక లాయర్‌పేటలోని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి చర్చిసెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పాటై నాలుగువైపులా వాహనాల రాకపోకలను సుమారు గంటపాటు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రాష్ట్రం అగ్నిగుండంలా మారిందన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను ఎలా నిర్వహించాలనే దానిపై యూపీఏకు కనీస అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. అలాంటివేమీ తెలియకుండా కేవలం స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించి రాష్ట్ర ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రెండుకళ్ల సిద్దాంతం కారణంగా రాష్ట్రంలో అశాంతి నెలకొందన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన.. ప్రజల పక్షాన నిలవకుండా గోడమీద పిల్లిలాగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
చివరకు కాంగ్రెస్‌తో చేతులు కలపడం దుర్మార్గమైన చ ర్యని దుయ్యబట్టారు. వారందరి స్వార్థ రాజకీయాలను ఎండగట్టి ప్రజలందరికీ సమన్యాయం కోసం పోరాడేందుకే వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని వివరించారు. ఇది మనందరం గర్వించ దగ్గ విషయమన్నారు. రాష్ర్ట విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతంలోని అన్నివర్గాలు, అన్నిరంగాల వారితో పాటు విద్యార్థులకు సైతం తీవ్ర నష్టం జరుగుతుందని బత్తుల పేర్కొన్నారు. అయినప్పటికీ ఇక్కడి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా పదవులు పట్టుకుని వేలాడుతున్నారని, వారందరికీ తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో సస్పెండ్ అయ్యామనిపించుకుని కొందరు ఎంపీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి నాటకాలను తిప్పికొట్టాలని సూచించారు.
పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జగన్ దీక్ష కు మద్దతుగా ఉద్యమించాలన్నారు. ముందుగా జగన్ దీక్షకు మద్దతుగా స్వర్ణ రవీంద్రబాబు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష శిబిరంలో ఏర్పాటు చేసిన మహానేత వైఎస్‌ఆర్ విగ్రహానికి నాయకులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. రవీంద్రబాబుకు పూలమాల వేసి అభినందించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బత్తుల బ్రహ్మానందరెడ్డితో పాటు నూకసాని బాలాజీ, పార్టీ వై.పాలెం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, దీక్ష చేపట్టిన రవీంద్రబాబు తదితరులు దీక్షనుద్దేశించి మాట్లాడారు.
రవీంద్రబాబు దీక్షను ఆదర్శంగా తీసుకుని జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే లాభాలు లేకపోగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య జటిలమవుతుందని తెలిపారు. అందువల్ల సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. రవీంద్రబాబుతో పాటు విద్యార్థులు రాజశేఖరరెడ్డి, శ్రీనివాస్ తదితరులు దీక్షలో కూర్చోగా అధిక సంఖ్యలో విద్యార్థులు, నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్‌ఆర్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు,
జిల్లా అధికార ప్రతినిధులు కొఠారి రామచంద్రరావు, నరాల రమణారెడ్డి, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ (బుజ్జి), యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, కేవీ ప్రసాద్, కఠారి శంకర్, బీ కొండలరావు, యరజర్ల రమేష్‌భాబు, నాయకులు చుండూరి రవి, సింగరాజు వెంకట్రావు, డీ అంజిరెడ్డి, ఎస్‌వీ రమణయ్య, టీ సోమశేఖర్, జాలయ్య, మాజీ కౌన్సిలర్ వెలనాటి మాధవరావు, కత్తినేని రామకృష్ణారెడ్డి, ఎస్‌వీ రమణయ్య, కావూరి సుశీల, బడుగు ఇందిర, రాజేశ్వరి పాల్గొన్నారు.