ఒంటరి ఏనుగు హల్‌చల్‌ 

Elephant Halchal In Chittoor District - Sakshi

గాయపడిన యువకుడు

యాదమరి: మండల పరిధిలో ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేస్తోంది. పంట పొలాలను నాశనం చేయడమేగాక గ్రామాల్లో ఇళ్ల మధ్య తిరుగుతూ ప్రజలపై దాడికి తెగబడుతోంది. దాడిలో ఒక యువకుడు గాయపడ్డాడు. యాదమరి మండలంలో పది రోజులకు పైగా ఏనుగుల గుంపు తిష్టవేసింది. 14 ఏనుగులు గుంపుగా మండల పరిధిలోని పలు గ్రామాలలో పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. మూడు రోజులుగా గుంపులో నుంచి రెండు ఏనుగులు విడిపోయాయి. అవి మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న పేరకూరు, చిన్నిరెడ్డిపల్లె, గొల్లపల్లె గ్రామాల వైపు వస్తున్నాయి. శుక్రవారం ఉదయం తమిళనాడు సరిహద్దులోని పెరగాండ్లపల్లె, ఎలమూరు, గ్రామాల్లోని పంట పొలాల్లో పంటలను నాశనం చేయగా, విడిపోయిన రెండు ఏనుగుల్లో ఒకటి నుంజర్ల ప్రాజెక్టు అటవీ ప్రాంతానికి వెళ్లింది.

రెండో ఏనుగు పేరకూరు, చిన్నిరెడ్డిపల్లె, 12 కమ్మపల్లె, దళవాయిపల్లె గ్రామాల వైపు వెళ్లింది. అక్కడి పొలాల్లోకి వెళ్లడంతో నీరు కడుతున్న రైతులు దాన్ని చూసి పరుగులు తీశారు. అనంతరం 12 కమ్మపల్లె గ్రామంలోకి ప్రవేశించింది. గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. గోపి అనే యువకుడిని తొండంతో విసిరికొట్టింది. దీంతో అతను గాయపడ్డాడు. చిన్నపిల్లలు కేకలు పెడుతు పరుగులు తీశారు. 

పంట పొలాలపై ఆగని గజ దాడులు 
గంగవరం : మండలంలోని కీలపట్ల గ్రామ పరిసరాల్లో ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. గురువారం రాత్రి గుంపుగా వచ్చిన ఏనుగులు పంట పొలాలపై పడ్డాయి. మూర్తికి చెందిన క్యాబేజీ, టమాటా, బీన్స్, పశుగ్రాసం, డ్రిప్‌పైపులు, ఉలవ పంటను ధ్వంసం చేశాయి. పొలం వద్దే కాపురముంటున్న మూర్తి కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. నాలుగు పెద్ద, రెండు చిన్న ఏనుగులు మొత్తం ఆరు గుంపుగా వచ్చినట్లు వారు తెలిపారు. అనంతరం మునేంద్రకు చెందిన ఉలవ పంట, మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి పండించే పంటలను ఏనుగులు నాశనం చేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నష్టపోయిన పంటలకు పరి హారం చెల్లించాలని కోరుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top