జనం ‘గజ..గజ’

Elephant Attacks on Palamaneru Villages Crops - Sakshi

తాజాగా ఏనుగు దాడిలో ముగ్గురికి గాయాలు

ఏనుగుల దాడుల్లో ఇప్పటికి ఆరుగురు మృతి, పలువురికి గాయాలు

జనావాసాల్లోకి వచ్చి హడలెత్తిస్తున్న ఏనుగులు

శాశ్వత పరిష్కారం చూపని ప్రభుత్వం

చిత్తూరు, పలమనేరు: ఈ మధ్యనే కాలువపల్లె అడవిలో ఎలి ఫెంట్‌ ట్రాకర్స్‌పై ఏనుగులు దాడిచేయడంతో నలు గురు ట్రాకర్స్‌ గాయపడ్డారు. అంతకుముందు ఇదే అడవిలో అటవీ సిబ్బందిపై ఏనుగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. రెండేళ్ల క్రితం పి.వడ్డూరుకు చెందిన చిన్నబ్బను తొక్కి చంపాయి. ఏడాది క్రితం చెత్తపెంటకు చెందిన రైతు మునీంద్రను బలిగొన్నాయి. తాజాగా పొలం వద్ద పడుకుని ఉన్న ముగ్గురిపై ఏనుగు దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో పలమనేరు, కుప్పం ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో ఆరుగురి ప్రాణాలు గజరాజుల కారణంగా గాల్లో కలిసాయి. ఏనుగులు దాడులకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.

దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న సమస్య
జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాలలో దశాబ్దాలుగా ఏనుగులు  దాడుల మూలాన పంట, ప్రాణ నష్టాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పలమనేరు మండలంలోనే రెండేళ్ల కాలంలో ఏనుగుల దాడులు నాలుగైదు జరిగాయి. ప్రజల ప్రాణాలకు దినదిన గండంగా ఈ సమస్య మారినా పరిష్కారం విషయంలో పాలకుల అలసత్వం శాపంగా మారింది.

అడవి నుంచి జనావాసాల్లోకి..
అడవిలో మేత, నీరు కరువై తరచూ ఈ ఏనుగులు గ్రామాల వైపు వస్తున్నాయి. ఇప్పటికి ఏడు ఏనుగులు సైతం మృత్యువాత పడ్డాయి. ఏనుగులను దారి మళ్లించేందుకు ప్రజలు టపాసులు పేల్చడం, టైర్లను కాల్చడం, పెద్దపెట్టున శబ్దాలను చేస్తుండడంతో కొన్ని సందర్భాల్లో ఏనుగులు రెచ్చిపోతున్నాయి. ఏనుగులు మూడు గ్రూపులుగా విడిపోయి, రెండు మాత్రం ఒంటరిగా మారి ఎటుపడితే అటువెళుతూ పంటలు, ప్రజలపై దాడులు చేస్తున్నాయి.

తమిళనాడు పాపం–మనకు శాపం
ఒక ఏనుగుకు సగటున రోజుకు 900 లీటర్ల నీరు, 10 హెక్టార్లలో మేత అవసరముంది.  దీంతో అవి మేతకోసం మైళ్లదూరం వెళుతుంటాయి. మన రాష్ట్ర సరిహద్దు నుంచి ఏనుగులను తమిళనాడు అడవిలోకి వెళ్లగానే అక్కడి అటవీశాఖ వాటిని తిరిగి ఇక్కడికి మళ్లిస్తోంది. దీంతో ఏనుగులు అడ్డొచ్చిన వారిపై విరుచుకుపడుతున్నాయి.

నీరుగారిన లక్ష్యం
పంటలను ధ్వంసం చేసే ఏనుగులను కట్టడి చేయాలనే ఉద్దేశంతో 1984లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌండిన్య ఎలిఫెంట్‌ శాంక్చురీ పూర్తి స్థాయిలో ప్రయోజనం లేకుండా పోతోంది. లక్షలాది రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేసిన సోలార్‌ ఫెన్సింగ్‌ ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. దీనికి తోడు సోలార్‌ ఫెన్సింగ్‌ సక్రమంగా పనిచేయడం లేదు. ఈ మధ్యనే  (ఎలిఫెంట్‌ ఫ్రూఫ్‌ ట్రెంచెస్‌) పనులను చేపట్టారు. వీటిని సైతం దాటి ఏనుగులు పంటల వైపు వస్తుండటంతో రైతులకేమీ పాలుబోవడం లేదు. ఏనుగుల సమస్యకు మూడు రాష్ట్రాల్లో కారిడార్‌ నిర్మాణం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది.

గజదాడుల ఘటనలు
2013లో ఏనుగుల గుంపు గుడిపల్లె మండలంలోని పెద్దపత్తికుంట గ్రామంలోకి చొరబడి ఓ రైతును పొట్టన పెట్టుకున్నాయి.
2014లో వి.కోట మండలంలోని నాయకనేరి ప్రాంతంలో ఓ రైతు ఏనుగు దాడిలో మరణించాడు.
2014 డిసెంబర్‌లో రామకుప్పం మండలం లోని ననియాల అటవీ ప్రాంతంలో వాచర్‌ మునెప్పను ఏనుగుల గుంపు తొక్కి చంపాయి.
2015లో గుడుపల్లె మండలంలో ఇద్దరు రైతులు గాయపడ్డారు.
2016లో బైరెడ్డిపల్లె మండలం వెంగంవారిపల్లెకు చెందిన పెరుమాళప్ప అడవిలో ఉండగా ఏనుగులు తొక్కి చంపాయి.
2017 జూన్‌లో పలమనేరు అటవీశాఖ కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిపై మదపుటేనుగు దాడి చేసింది. వీరిలో ఒకరు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు.
2017 ఆగస్టులో పలమనేరు మండలం పి. వ డ్డూరుకు చెందిన రైతును తొక్కి చంపేశాయి.
2018లో ఇద్దరు అటవీ ఉద్యోగులపై ఏనుగు లుదాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.
తాజాగా ఏనుగు కారణంగా గొబ్బిళ్లకోటూరుకు చెందిన హరికృష్ణ, ఉదయ్‌కుమార్, సోమశేఖర్‌ గాయపడ్డారు.

ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం
ఏ క్షణంలో ఏనుగులు దాడులు చేస్తాయో తెలియదు. రైతుల ప్రాణాలకు రక్షణ కరువైంది.అటవీశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు ఫలించడం లేదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం పట్టించుకోకుంటే ఎలా?– మురుగన్, రైతు, చెత్తపెంట

ప్రతిరోజూ డ్రైవ్‌ చేస్తూనే ఉన్నాం
కౌండిన్య అడవిలో ప్రస్తుతం ఏనుగులు మూడు గుంపులుగా సంచరిస్తున్నాయి. వీటిలో రెండు వేర్వేరుగా తిరుగుతున్నాయి. వేరుగా తిరిగే రెండు ఏనుగులు జనాన్ని చూస్తే దా డులకు పాల్పడుతున్నాయి. ప్రజలే కాదు మా సిబ్బంది, ఎలిఫెంట్‌ ట్రాకర్స్‌ కూడా గా యపడ్డారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. –ఎఫ్‌ఆర్వో మదన్‌మోహన్‌రెడ్డి, పలమనేరు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top