గుడ్డు.. గోల్‌మాల్‌ | Egg Distributors Stops In PSR Nellore | Sakshi
Sakshi News home page

గుడ్డు.. గోల్‌మాల్‌

Oct 31 2018 1:30 PM | Updated on Jul 11 2019 5:40 PM

Egg Distributors Stops In PSR Nellore - Sakshi

భోజనం చేస్తున్న హాస్టల్‌ విద్యార్థులు

విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. వారంలో ఆరుసార్లు కోడి గుడ్లు మెనూలో అందించాల్సిఉన్నా విద్యార్థులకు అందడం లేదు. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ మాత్రం గుడ్లు సరఫరా చేయకుండానే బిల్లులు పెడుతున్నారు. కొన్నిచోట్ల మారిన మెనూతో భారమవుతోందంటూ హాస్టల్‌ వార్డెన్లు గుడ్డుకు ఎగనామం పెడుతుండగా మరికొన్నిచోట్ల వార్డెన్లు గుడ్లు కొనుగోలు చేసినట్లు బిల్లులు పెడుతున్నారు. అధికారులు మాత్రం రెండు బిల్లులూ మంజూరు చేస్తుండడం గమనార్హం.

నెల్లూరు రూరల్‌: విద్యార్థులు మెచ్చేలా ప్రభుత్వం రూపొందించిన మోనూ అమలుకావడం లేదు. మెనూ ప్రకారం విద్యార్థులకు కోడిగుడ్లు అందించడం లేదు. దీంతో వారికి పౌష్టికాహారం అందడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో చదివే విద్యార్థులకు మెరుగైన పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విద్యార్థులు మెచ్చేలా మెనూలో మార్పు చేసింది. ఇందులో భాగంగా హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మెస్‌ చార్జీలు జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్నారు. మారిన మెనూ ప్రకారం వారానికి మూడుసార్లు కోడికూర, ఆరుసార్లు కోడి గుడ్లను అందించాల్సిఉంది. కాంట్రాక్టర్‌ సక్రమంగా గుడ్లను సరఫరా చేయకపోవడంతో వార్డెన్లు కొనుగోలు చేయాల్సివస్తోంది. మారిన మెనూతో భారం ఎక్కువైందంటూ వార్డెన్లు గుడ్లకు ఎగనామం పెట్టారు. దీంతో సంక్షేమ వసతిగృహ విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ మాత్రం గుడ్లు సరఫరా చేయకుండానే హాస్టళ్లకు సరఫరా చేసినట్లు బిల్లు పెట్టడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వార్డెన్లు గుడ్లు కొనుగోలు చేసినట్లు బిల్లులు పెడుతుండడంతో ఈ బిల్లులు కూడా అధికారులు మంజూరు చేస్తున్నారు. సంక్షేమ శాఖల అధికారులు గుడ్ల పేరుతో లక్షలాది రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కోడి కూర పెడుతున్నామంటూ గుడ్లు కట్‌
జిల్లాలో 87 ఎస్సీ హాస్టళ్లు, 79 బీసీ హాస్టళ్లు, 23 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వారంతా పేద వర్గాలకు చెందిన వారు. దూరప్రాంతాల నుంచి వచ్చిచదువుకుంటున్నారు. మారిన మెనూను జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ హాస్టళ్లతోపాటు కళాశాల వసతిగృహాల్లో సైతం ఈ మెనూను అమలు చేస్తున్నారు. మారిన మెనూ ప్రకారం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ కోడి గుడ్డు, మంగళ, శుక్ర, ఆదివారాలు కోడి కూరతో భోజనం పెట్టాలి. హాస్టల్‌ విద్యార్థులు మధ్యాహ్న భోజనం పాఠశాలల్లోనే చేసినా మారిన మెనూ ప్రకారం అదే రోజు గుడ్లు, కోడికూర పెట్టాల్సి ఉంది. ఒకవేళ పాఠశాలలకు సెలవు అయితే వసతిగృహాల్లోనే భోజనం పెడతారు. అందులో పోషకాహారం ఉండేలా చర్యలు తీసుకోవాలి. అయితే కోడి కూర పెడుతున్నామనే నెపంతో కొంతమంది వార్డెన్లు కోడిగుడ్డు పెట్టడం మానుకున్నారు.

గుడ్లు సరఫరా చేయకుండానే దర్జాగా బిల్లులు డ్రా
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలకు కోడిగుడ్లను సరఫరా చేసేందుకు టెండర్లు పిలువగా ఒక్కో గుడ్డు ధర రూ.4.14లకు పీవీఆర్‌ ఎగ్‌ సప్లయర్స్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకుంది. జూలై 1వ తేదీ నుంచి ప్రతి హాస్టల్, గురుకులాలకు కోడిగుడ్లను సరఫరా చేయాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లోని హాస్టళ్లకు మాత్రమే సరఫరా చేస్తూ గ్రామీణ ప్రాంతాలకు సక్రమంగా సరఫరా చేయడం లేదు. సరఫరా చేసినా నాసిరకం, చిన్నసైజు గుడ్లను హాస్టళ్లకు పంపిస్తున్నారు. దీంతో ఆయా హాస్టళ్ల వార్డెన్లు బయట మార్కెట్‌లో కోడి గుడ్లను కొనుగోలు చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ మాత్రం గుడ్లను సరఫరా చేసినట్లు బిల్లు పెట్టి దర్జాగా డ్రాచేసుకుంటున్నారు. వార్డెన్లు కూడా ప్రత్యేకంగా గుడ్ల బిల్లు పెట్టుకునే అవకాశం కల్పించడంతో కాంట్రాక్టర్‌ సరఫరా చేయకపోయినా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం లేదు. గుడ్ల కొనుగోలులో భారీస్థాయిలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్‌ జోక్యం చేసుకుని సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement