
ఇంద్రకీలాద్రిపై స్వర్ణకవచాలంకృత అలంకారంలో ఉత్సవ విగ్రహం
శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం కనులపండువగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కోటి కనక ప్రభలతో శోభాయమానంగా వెలిగిపోతున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు.
సాక్షి, విజయవాడ/శ్రీశైలం ప్రాజెక్టు : ఇంద్రకీలాద్రిపై పది రోజుల పాటు సాగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం కనులపండువగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కోటి కనక ప్రభలతో శోభాయమానంగా వెలిగిపోతున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. ఉదయం స్నపనాభిషేకం అనంతరం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు. దుర్గగుడి పరిసర ప్రాంతాలన్నీ దుర్గమ్మ నామస్మరణతో మార్మోగాయి. మల్లికార్జున మహామండపంలో ప్రత్యేక కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. కాగా, ఉ.10 గంటల తరువాత భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఆదివారం కూడా కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. మంత్రి మోపిదేవి వెంకటరమణ, దేవదాయ శాఖ కమిషనర్ మొవ్వ పద్మ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు తొలిరోజు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. కృష్ణానది వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నదీతీరంలోని ఏర్పాట్లు సమీక్షించారు. అనంతరం.. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవీ సురేష్‌బాబు నగరోత్సవంలో పాల్గొన్నారు. సోమవారం అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
భృంగి వాహనంపై ఆదిదంపతులు..శైలపుత్రి అలంకారంలో అమ్మవారు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం విశేషపూజలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉ.9గంటలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈఓ కేఎస్ రామారావు, అర్చకులు, వేద పండితులు ఆరంభ పూజలకు అంకురార్పణ చేశారు. అనంతరం అర్చకులు లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర అభివృద్ధిపై సంకల్పం చేశారు. రాత్రి 7.30 గంటలకు శ్రీ భ్రమరాంబాదేవిని శైలపుత్రిగా అలంకరించారు. అనంతరం ఆది దంపతులైన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లు భృంగి వాహనంపై కొలువుతీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత గ్రామోత్సవం నిర్వహించారు.