గువ్వలచెరువు ఘాట్ మరోసారి రక్తంతో తడిసి ముద్ద అయింది. అర్ధరాత్రి బయలుదేరిన లారీ ఘాట్‌లోకి రాగానే ఓ మలుపు మృత్యువై పిలిచింది. లారీని అదుపు తప్పించి దారి తప్పేలా చేసింది
గువ్వలచెరువు ఘాట్ మరోసారి రక్తంతో తడిసి ముద్ద అయింది. అర్ధరాత్రి బయలుదేరిన లారీ ఘాట్‌లోకి రాగానే ఓ మలుపు మృత్యువై పిలిచింది. లారీని అదుపు తప్పించి దారి తప్పేలా చేసింది. లోయలోకి దూసుకెళ్లిన లారీ నుజ్జునుజ్జు కాగా, అందులోని డ్రైవర్, క్లీనర్ బతుకులు నలిగిపోయాయి. వారి కుటుంబాల్లో చీకట్లు నింపాయి.
చింతకొమ్మదిన్నె, న్యూస్‌లైన్ : కడప-రాయచోటి ప్రధాన రహదారి గువ్వలచెరువు ఘాట్‌లోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల మలుపులోకి బుధవారం అర్ధరాత్రి వచ్చిన లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. సంఘటనలో డ్రైవర్ షామీర్(45), క్లీనర్ నాగయ్య(38) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘోరో సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతులిద్దరూ రాయచోటి, శిబ్యాల ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది.
బెల్లం లోడుతో వచ్చి.. ముక్కచెక్కలై...
చిత్తూరు జిల్లా పీలేరు నుంచి బెల్లం లోడుతో సూర్యాపేటకు బయలుదేరిన లారీ మార్గమధ్యంలోని గువ్వలచెరువు ఘాట్‌లోని ఓ మలుపు వద్దకు రాగానే ఇరవై అడుగులో లోతు కలిగిన లోయలోకి దూసుకెళ్లింది. దీంతో లారీ మొత్తం ముక్కలైంది. డ్రైవర్, క్లీనర్ అందులోనే ప్రాణాలొదిలి ఇరుక్కుపోయారు. వారిని బయటకు లాగడం చాలా కష్టమైంది.
క్రేన్ సహాయంతో...
ప్రమాద సమాచారం తెలుసుకున్న కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, రూరల్ సీఐ నాగేశ్వరరెడ్డి, చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ నరసింహారెడ్డి గురువారం ఉదయమే హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసేందుకు ఎంతగా ప్రయత్నించినా ఇనుప కంచెల మధ్య ఇరుక్కుపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో క్రేన్‌ను తెప్పించి లారీ ట్రాలీని తప్పించారు. ఆ తరువాత మృతదేహాలను వెలికితీశారు. వాటిని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్‌కు తరలించారు.
బంధువుల రోదనలతో నిండి..
డ్రైవర్ షామీర్‌కు భార్య ఇద్దరు కుమారులు ఉండగా, క్లీనర్ నాగయ్యకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఆయా కుటుంబాలతో పాటు బంధువులు గువ్వలచెరువు ఘాట్‌కు చేరుకున్నారు.
అడవిలో.. దిక్కులేని చావు చచ్చిన తమ వారిని చూసి గుండెలు పగిలేలా రోదించారు. వారి రోదనలతో అటవీ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.