నిన్న దొర నేడు చెర

'DSP confessed to role in Gedela Raju murder' - Sakshi

అధికారం నుంచి అదఃపాతాళానికి రవిబాబు

తన సహచరుల వెనుక తలదించుకొని నిందితునిగా నిల్చున్న దుస్థితి

గేదెలరాజు హత్యలో రవిబాబు పాత్రను వెల్లడించిన డీసీపీ

హత్యకు ముందు ఓ గెస్ట్‌హౌస్‌లో సెటిల్‌మెంట్‌

అక్కడ గేదెలరాజు బెదిరించడంతోనే హత్యకు ఆలోచన

దాని అమలుకు బ్యాంకాక్‌లో పథక రచన

నాటి సెటిల్‌మెంట్‌లో పాల్గొన్న ఐదుగురి కోసం గాలింపు

ఇన్నాళ్లూ ఓ మంత్రి సంరక్షణలో డీఎస్పీ రవిబాబు

నిన్న మొన్నటి వరకు ఆయనో దొర.. పోలీస్‌ దొర..
కానీ నేడు ఆయనకు తప్పలేదు చెర..

ఎన్నో కేసులను ఛేదించారు.. ఎందరో నిందితులను తన వెనుక నిలబెట్టించి మీడియాకు చూపించారు..
కానీ నేడాయనే తన సహచరుల వెనుక నిందితుడిలా తలదించుకొని, చేతులు కట్టుకొని నిలబడాల్సిన దుస్థితి..

అధికారం అడ్డదారులు తొక్కితే.. ఎంతటివారైనా అదఃపాతాళానికి దిగజారిపోతారనడానికి నిలువెత్తు సాక్ష్యమే డీఎస్పీ దాసరి రవిబాబు..
మాజీ ఎంపీపీ కాకర పద్మలత, రౌడీషీటర్‌ గేదెలరాజు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న ఆయన్ను శనివారం పోలీసు అధికారులు మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య దీనవదనంతో చేతులు కట్టుకొని నిలబడిన దృశ్యం అక్కడ గంభీర వాతావరణాన్నే సృష్టించింది.

చోడవరంలో లొంగిపోయే ముందు తానేం నేరం చేయలేదని.. కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని రవిబాబు చెప్పగా..
గేదెలరాజును తానే హత్య చేయించానని అంగీకరించారని..
డీసీపీ రవికుమార్‌మూర్తి తాజాగా ప్రకటించడం విశేషం..

ఈ హత్యకు ముందు జరిగిన సెటిల్‌మెంట్‌లో పాల్గొన్న భూపతిరాజు
సహా మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని.. హత్యకు బ్యాంకాక్‌లో
కుట్ర పన్నారన్న అంశంపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించడంతో రవిబాబు పూర్తిగా ఇరుక్కుపోయినట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సాక్షి, విశాఖపట్నం:  ఒకప్పుడు ఎన్నో కేసుల్లో ఎంతో మంది ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ రవిబాబు శనివారం తానే ముద్దాయిగా మారి తన సహచర అధికారుల వెనుక చేతులు కట్టుకొని నిలబడ్డారు. గేదెల రాజు హత్య కేసులో మీడియా ముందు తనను ప్రవేశపెట్టినప్పుడు డీసీపీ రవికుమార్‌మూర్తి తనను ఉద్దేశించి చెప్పిన వివరాలను, చేసిన వ్యాఖ్యలను మౌనంగా విన్నారు. ఏసీపీగా పనిచేసినప్పుడు ఇదే సీపీ కార్యాలయంలో తాను ఎదురుపడితే హోంగార్డ్‌ నుంచి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వరకు శాల్యూట్‌ చేసేవారే.. ఇప్పుడు ఆయన్ను చూసి ముఖం తిప్పుకున్న దయనీయ స్థితి. తాను పోస్టింగ్‌లు వేయించిన వారు.. తన కింద పని చేసిన వారు సైతం నోరు విప్పి పలకరించలేని పరిస్థితి కల్పించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు స్మరించుకుంటున్న వేళ.. అదే పోలీసు వ్యవస్థకు కళంకం  ఓ పోలీస్‌ అధికారినే సమాజం ముందు నిల్చోబెట్టాల్సి రావడం పోలీసువర్గాలను కూడా ఇబ్బందికరంగా మారింది.

నిన్న రెవెన్యూ..నేడు పోలీస్‌..బజారున పడ్డ పరువు
ఇప్పటికే రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జాలతో విశాఖ జిల్లా రెవెన్యూ శాఖ పరువు రాష్ట్ర స్థాయిలో మంటగలిసింది. ఇప్పుడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని దందాలు, సెటిల్‌మెంట్లు చేయడమే కాకుండా అడ్డువచ్చిన వారిని హత్యలు చేయించిన డీఎస్పీ రవిబాబు ఉదంతంతో పోలీసు శాఖ పరువు కూడా బజారుపడింది. ప్రజల రక్షణ కోసం ప్రాణాలిచ్చిన పోలీసులున్నట్టే.. ప్రజల మానప్రాణాలను తమ స్వార్థానికి బలిచేసే వారూ ఉన్నారని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది. కాగా నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం చోడవరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన రవిబాబును శనివారం సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ–2 రవికుమార్‌ మూర్తి మీడియా ఎదుట హాజరుపర్చారు. అతన్ని నేరుగా కోర్టులోనే ప్రవేశపెట్టాలని మొదట పోలీసులు భావించారు. అయితే ప్రధాన ముద్దాయిని మీడియా ఎదుట ప్రవేశపెడతారా.. లేదా అంటూ విస్తృత చర్చ జరిగిన నేపథ్యంలో విమర్శలకు తావు లేకుండా డీఎస్పీని మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మీడియా ముందుకు తీసుకొచ్చారు.

మీడియాలో మాట్లాడనివ్వలేదు
ఎలాంటి ముసుగు లేకుండానే రవిబాబును మీడియా ముందు హాజరుపర్చారు. చోడవరంలో లొంగిపోయినప్పుడు ధరించిన దుస్తులతోనే రవిబాబును తీసుకురాగా.. మీడియాతో మాట్లాడనీయకుండానే ఫోటోలు మాత్రమే తీయించి ఆ వెంటనే పంపించేయడం విమర్శలకు తావిచ్చింది. సాధారణంగా మీడియా ఎదుట హాజరుపర్చిన నిందితులను ప్రెస్‌మీట్‌ పూర్తయ్యే వరకు పోలీస్‌ అధికారుల వెనుకే నిల్చోబెడతారు. మీడియా అడిగిన ప్రశ్నలకు వారితో సమాధానాలు కూడా చెప్పిస్తా రు.  ఇక్కడ డీసీపీ రవికుమార్‌ మూర్తే అన్నీ తానై సమాధానాలు చెప్పేశారు. కాకర పద్మలత, గేదలరాజు హత్య కేసుల్లో రవిబాబు పాత్రకు సంబంధించి పక్కా సాక్ష్యాధారాలు సేకరించినట్టు డీసీపీ ప్రకటించారు. ఈ కేసుల్లో ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకునే చాన్స్‌ లేదంటూ డీసీపీ స్పష్టంగా చెప్పడం విశేషం. గేదెల రాజును తానే హత్య చేయించానని రవిబాబు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడని డీసీపీ వెల్లడించడం ఈ కేసులో కీలకంగా మారింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని..అన్నీ కోర్టులో తేల్చుకుంటానని లొంగిపోయే ముందు చోడవరంలో మీడియాకు చెప్పిన రవిబాబు.. పోలీసులకు మాత్రం తానే హత్య చేయించానని ఒప్పుకోవడం గమనార్హం.

పాస్‌పోర్టు స్వాధీనం
ఏసీపీగా పనిచేసినప్పుడు రవిబాబుతో కలిసి పనిచేసిన రంగరాజు ఆధ్వర్యంలో డీఎస్పీ రవిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించారు. మురళీనగర్‌లోని ఆయన ఇంటిలో అణువణువు సోదా చేశారు. పాస్‌పోర్టు సీజ్‌ చేశారు. అలాగే చెక్‌బుక్‌లు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కీలక పత్రాలను పక్కదారి పట్టించినట్టుగా చెబుతున్నారు.సెటిల్‌మెంట్ల కోసం గాజువాకలోని రఘు, రోహిత్‌ నిర్వహణలో ఉన్న హోటల్స్‌లో పలు  కీలక సమావేశాలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో వారిని అదుపులోకి తీసుకొని ఇప్పటికే తమదైన శైలిలో విచారణ జరిపి కొంత సమాచారాన్ని రాబట్టినట్టు చెబుతున్నారు. అలాగే ల్యాండ్‌ సెటిల్‌మెంట్ల విషయంలో కూడా రవిబాబు పాత్రపై ఆరా తీస్తున్నారు.

ప్రభుత్వానికి నివేదిక పంపించాం డీసీపీ–2 రవికుమార్‌మూర్తి  
అల్లిపురం: గేదెల రాజు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్టీసీ విజిలెన్స్‌ డీఎస్పీ దాసరి రవిబాబుపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపించామని, ఏ నిర్ణయమైనా పై స్థాయిలో తీసుకోవల్సి ఉందని నగర శాంతిభద్రతల డీసీపీ–2 టి.రవికుమార్‌మూర్తి తెలిపారు. శనివారం పోలీస్‌ కమిసనరేట్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. గేదెల రాజు హత్య కేసుతో పాటు, కేసుకు ప్రధాన కారణంగా భావిస్తున్న మాజీ ఎంపీపీ కాకర పద్మలత మరణంపై అనుమానాలు వస్తుండటంతో ఈ కేసును ప్రత్యేకంగా తీసుకున్నామన్నారు. కేసులో రెండో నిందితుడు భూపతిరాజు శ్రీనివాసరాజు దొరికితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని తెలిపారు. కాకర పద్మ మృతి విషయంలో కాకక పద్మలత తమ్ముడుని విచారించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షాలన్నీ సేకరిస్తున్నామని, అవన్నీ ఈ కేసులో కీలకంగా ఉంటాయని తెలిపారు.

పద్మలత హత్య కేసు కూడా..
గాజువాక : రౌడీషీటర్‌ గేదెలరాజు హత్య కేసులో ఎ–1 నిందితుడిగా ఉన్న ఆర్టీసీ విజిలెన్స్‌ డీఎస్పీ దాసరి రవిబాబుపై గాజువాక పోలీసులు మరో హత్య కేసు నమోదు చేశారు. గతేడాది సెప్టెంబర్‌ 22న తన కుమార్తె పద్మలతను రవిబాబే హత్య చేయించాడని  ఆమె తండ్రి కాకర నూకరాజు శనివారం పోలీసులు ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు రవిబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో కూడా పద్మలతను తానే హత్య చేయించినట్టు విచారణ సమయంలో పోలీసు అధికారుల వద్ద రవిబాబు ఒప్పుకున్నట్టు సమాచారం.  

ఆ నలుగురు ఎవరు?
పద్మలతను అడ్డు తొలగించుకునేందుకు రూ.కోటితో గేదెల రాజుతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. ఇందుకోసం రూ.50 లక్షలు అడ్వాన్స్‌ కింద ముట్టజెప్పగా, మిగిలిన రూ.50 లక్షల కోసం ఒత్తిడి తేవడంతోనే ఈ హత్యోదంతం చోటు చేసుకుంది. గేదెల రాజు బెదిరింపులకు తలొగ్గి ఫైనల్‌ సెటిల్‌మెంట్‌గా రూ.25 లక్షలు చెల్లించేందుకు రవిబాబు అంగీకరించారు. ఈ మేరకు ఆగస్టు 13న బీచ్‌రోడ్‌లోని సుధీర్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌లో సెటిల్‌మెంట్‌ జరిగినట్లు డీసీపీ వెల్లడించారు.
ఈ భేటీలో రవిబాబు, గేదెల రాజు, భూపతిరాజు శ్రీనివాసరాజులతో పాటు ఏడుగురు పాల్గొన్నారు.  వారిలో గేదెలరాజు హతమయ్యాడు, రవిబాబు దొరికిపోయారు. దాంతో భూపతిరాజు కాకుండా మిగిలిన నలుగురు ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా తన వద్ద రికార్డెడ్‌ ఎవిడెన్స్‌ ఉన్నాయని గేదెల రాజు బెదిరించడంతో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆయనతో ముప్పు తప్పదన్న భయంతోనే అతడ్ని వదిలించుకోవాలన్న నిర్ణయానికొచ్చిన డీఎస్పీ రవిబాబు భూపతిరాజు శ్రీనివాసరాజుతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని డీసీపీ వెల్లడించారు. నాటీ భేటీలో వీరితో పాటు సెటిల్‌మెంట్‌లో పాల్గొన్న మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. కాగా హత్యోదంతంలో పాల్గొన్న 10 మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్‌ చేశామని.. భూపతిరాజుతో పాటు అతడిì  డ్రైవర్‌ను అరెస్ట్‌ చేయాల్సి ఉందని వివరించారు. భూపతిరాజు చిక్కితే ఈ హత్య కేసుకు సంబంధించిన మరింత కీలక సమాచారం లభిస్తుందని సీపీ అన్నారు.

27 వరకు రిమాండ్‌
గాజువాక : రౌడీషీటర్‌ గేదెలరాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు డీఎస్పీ రవిబాబుకు గాజువాక 8వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి ఈనెల 27 వరకు రిమాండ్‌ విధించారు. న్యూపోర్టు పోలీసులు అంతకుముందే ఆయన పాస్‌పోర్టుతోపాటు బ్యాంకు చెక్‌ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు గాజువాక కోర్టులో హాజరుపరిచారు. సెక్షన్‌ 302, 201 ప్రకారం రవిబాబుపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

కోర్టు ఆవరణలో రవిబాబు ఫోన్‌ సంభాషణ
విచారణ నిమిత్తం రవిబాబును పోలీసులు గాజువాక కోర్టుకు తీసుకొచ్చిన అనంతరం ఆయన ఫోన్‌లో మాట్లాడటం చర్చనీయాంశమైంది. గేదెలరాజు హత్య జరిగిన తరువాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ అతడి మొబైల్‌ ఫోన్‌ స్విచాఫ్‌లో ఉంది. కోర్టుకు వచ్చిన తరువాత పోలీసుల పర్యవేక్షణ ఉండగానే ఆయన సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. ఆయన ఎవరి ఫోన్‌తో మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి.

సెంట్రల్‌ జైలుకు
ఆరిలోవ(విశాఖ తూర్పు): రౌడీ షీటరు గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు డీఎస్పీ దాసరి రవిబాబును శనివారం పోలీసులు విశాఖ కేంద్ర కారాగారానికి రిమాండ్‌కు తరలించారు. ఆయన్ని కారాగారం అధికారులు మొదటి రోజు అడ్మిషన్‌ బ్లాక్‌లో ఉంచారు. ఆదివారం సెలవు కావడంతో అడ్మిషన్‌ బ్లాక్‌కే ఆయన పరిమితమవుతారు. సోమవారం ఆయనకు ప్రత్యేక బ్లాక్‌ కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.   

ఒకరు షెల్టర్‌.. మరొకరు బ్యాంకాక్‌కు టికెట్లు
రవిబాబును కాపాడేందుకు ఓ మంత్రి చివరి నిమిషం వరకు విఫలయత్నం చేశారు. గేదెల రాజు హత్యలో తన పాత్ర గురించి వెలుగులోకి వచ్చిన మర్నాడే రవిబాబు ఆ మంత్రిని ఆశ్రయించినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆ మంత్రి సంరక్షణలోనే అతనికి చెందిన ఓ గెస్ట్‌హౌస్‌లో ఉన్నట్లు తెలిసింది. ఎలాగైనా కేసు తీవ్రతను తగ్గించి తనను బయటపడేయాలని ఆ మంత్రిని వేడుకున్నా ఫలితం దక్కలేదు. సాక్ష్యాధారాలన్నీ పక్కాగా ఉండడంతో.. లొంగిపోమని సలహా ఇచ్చింది కూడా సదరు మంత్రేనని చెబుతున్నారు.
లొంగిబాటుకు చోడవరం పోలీస్‌స్టేషన్‌ను ఎంచుకోమని చెప్పింది కూడా ఆయనేనని అంటున్నారు. మరోవైపు గేదెల రాజు హత్యకు బ్యాంకాక్‌లోనే స్కెచ్‌ వేశారని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా బ్యాంకాక్‌ వెళ్లేందుకు మరో మంత్రి తనయుడు వీరికి టికెట్లు తీసిచ్చినట్లు తెలియవచ్చింది. సరదాగా ఎంజాయ్‌ చేసే వంకతోనే బ్యాంకాక్‌ వెళ్లినప్పటికీ అక్కడే గేదెల రాజును హత్యకు పథక రచన చేసినట్టుగా వినికిడి. దీంతో రవిబాబు వెనుక ఉన్న ప్రజాప్రతినిధులెవరు..అతడిని కాపాడాలని వారు ఎందుకంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న చర్చ సర్వత్రా సాగుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top