నేటితో డీఎస్సీ పరిసమాప్తం.. | Dsc exams will finish today | Sakshi
Sakshi News home page

నేటితో డీఎస్సీ పరిసమాప్తం..

May 11 2015 4:33 AM | Updated on Sep 3 2017 1:48 AM

నేటితో డీఎస్సీ పరిసమాప్తం..

నేటితో డీఎస్సీ పరిసమాప్తం..

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెండు రోజులుగా జరిగిన డీఎస్సీ పరీక్షలు సోమ వారం ముగియనున్నాయి.

గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెండు రోజులుగా జరిగిన డీఎస్సీ పరీక్షలు సోమ వారం ముగియనున్నాయి. డీఎస్సీ-2014లో భాగంగా ఉపాధ్యాయ అర్హత-నియామక పరీక్ష (టెట్ కం టీఆర్టీ) ఆదివారం సజావుగా జరిగింది. గుంటూరులోని 20 కేంద్రాల్లో జరిగిన భాషా పండిట్, పీఈటీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 3,663 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 16 కేంద్రాల్లో జరిగిన ఎల్పీటీ పరీక్షలకు దరఖాస్తు చేసిన 3,402 మంది అభ్యర్థుల్లో 3,012 మంది హాజరయ్యారు.

అదే విధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాలుగు కేంద్రాల్లో జరిగిన పీఈటీ పరీక్షకు దరఖాస్తు చేసిన 780 మంది అభ్యర్థులకు  651 మంది పరీక్ష రాశారు. కేంద్రాల పరిధిలో అభ్యర్థులకు తాగునీరు, ఫర్నీచర్ సదుపాయాలను కల్పించ డంలో విద్యాశాఖాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు నిర్ణీత సమయానికే కేంద్రాలకు చేరుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు సజావుగా జరిగినట్లు డీఈవో కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

నేటితో ముగియనున్న డీఎస్సీ పరీక్షలు ....
 రెండు రోజులుగా జరుగుతున్న డీఎస్సీ పరీక్షలు సోమవారం ముగియనున్నాయి. సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో జరిగే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 25,679 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందు కోసం గుంటూరు నగరంలోని 107 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 వరకు 25 కేంద్రాల్లో జరిగే స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పరీక్షకు 5,259 మంది, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.15 వరకు 92 కేంద్రాల్లో జరిగే స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) పరీక్షలకు 20,420 మంది హాజరుకానున్నారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
 పట్నంబజారు (గుంటూరు): ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను దృష్టిలో ఉంచుకుని డీఎస్సీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పిన్నమనేని వెంకటరామారావు తెలిపారు. ఆదివారం సైతం రీజియన్ పరిధిలో 548 బస్సులు తిరగగా 200 బస్సులను ప్రత్యేకంగా డీఎస్సీ పరీక్షలకు కోసం కేటాయించడం జరిగిందన్నారు.

సోమవారం ఉదయం 8 గంటల్లోపు గుంటూరు చేరుకునేందుకు రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి బస్సులు తిరుగుతాయని చెప్పారు. అభ్యర్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని అధికంగా సర్వీసులు నడిపేందుకు దృష్టి సారిస్తున్నామన్నారు. రీజియన్ పరిధిలో 952 బస్సులు తిరగాల్సి ఉండగా, తాత్కాలిక కార్మికులచే సుమారు 600 సర్వీసుల వరకు తిప్పుతున్నామని వివరించారు. విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement