‘బోరు’మంటున్నారు!

‘బోరు’మంటున్నారు! - Sakshi


సాక్షి, చిత్తూరు: జిల్లా ప్రజలు గుక్కెడు నీటికోసం అల్లాడుతున్నారు. వేసవి దాటినా ఎండలు తగ్గకపోవడం, బోర్లు అడుగంటడం తో పంటలు ఎండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.  

 

ఈయన కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండ లం పెద్దగుమ్మనపల్లెకు చెందిన చంద్రప్ప 5ఎకరాల్లో మల్బరీ సాగు చేశాడు. ఎకరాకు రూ.10 వేలు చొప్పున పెట్టుబడి పెట్టాడు. సాగునీటి కోసం బోరు వేశాడు. 750 అడుగుల్లో నీళ్లు పడ్డాయి. చూస్తుండగానే బోరు ఎండిపోయింది. మళ్లీ బోరు వేశాడు. 1050 అడుగుల్లో నీళ్లు పడ్డాయి. ఇది కూడా ఎండిపోయింది. నీళ్లు లేక మల్బరీ తోట కూడా ఎండిపోతోంది. రెండు బోర్లకు రూ.4 లక్షలు, పంట పెట్టుబడికి రూ.50 వేలు వెరసి రూ.4.50 లక్షల అప్పు మిగిలింది. ‘బోరు’మని విలపించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి చంద్రన్నది.

 

జిల్లాలో భూగర్భజలాలు ఎంతవేగంగా పడిపోతున్నాయో తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. 2005-2014 మధ్య భూగర్భజలాల గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో ప్రతియేటా భూగర్భజలాలు వందల మీటర్ల లోతుకు వెళుతున్నాయి. తద్వారా జిల్లాలో సాగు, తాగునీటి సమస్య జఠిలమవుతోంది. జిల్లాలో చిత్తూరు, మదనపల్లె నియోజకవర్గాలతోపాటు పాకాల మండల పరిధిలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. భూగర్భజలాలు అడుగంటడంతో వీటి పరిధిలోని 164 గ్రామాల్లో బోర్లు ఎండిపోయాయి.



ట్యాంకర్ల ద్వారా ఆయా గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. ఏప్రిల్ వరకూ రోజుకు 362 ట్యాంకర్లతో మంచినీళ్లు సరఫరా చేసేవాళ్లు. జూన్ నుంచి రోజుకు 562 ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి రోజుకు 40 లీటర్ల నీటిని సరఫరా చేయాలని అధికారులు చెబుతున్నా 20 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. పూతలపట్టు, తవణంపల్లి, ఐరాల, బంగారుపాళెంలో పాడిపరిశ్రమ ఎక్కువగా ఉంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీరు మనుషులు తాగేందుకే సరిపోవడం లేదు.

 

నెలకు రూ.49.23 లక్షలు ఖర్చు



ఒక్కో ట్యాంకరుకు ట్రిప్పుకు రూ.292 ప్రభుత్వం చెల్లిస్తోంది. రోజుకు 562 ట్యాంకర్లకు రోజుకు 1.64 లక్షల చొప్పున నెలకు 49.23 లక్షలు ఖర్చు చేస్తోంది. పూతలపట్టు లో ఏడాదిగా ట్యాంకర్ల యజమానులకు డబ్బులు ఇవ్వకపోవడంతో నీరు సరిగా సరఫరా చేయడం లేదని తెలుస్తోంది.

 

వ్యవసాయ బోర్లదీ అదే పరిస్థితి



జిల్లాలో 2.47 లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. అందులో ఈ ఏడాది 618 ఎండిపోయినట్లు తెలుస్తోంది. వాటి కింద సాగులో ఉన్న మామిడి, మల్బరీ, ఇతర పంటలు ఎండిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు.

 

టీడీపీ నేతలకు అధికారుల జీ హుజూర్..



తాగు, సాగునీటి సమస్యను జిల్లా ప్రజలు, ఎమ్మెల్యేలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా పరిషత్ పాలకమండలి ఏర్పాటయ్యే వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేమని అధికారులు తేల్చి చెబుతున్నారు. నిధుల విడుదల పై టీడీపీ నేతల హుకుంతోనే అధికారులు ఇలా వ్యవహరి స్తున్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం రూ.20 లక్షలు, కోటి, రెండు కోట్లతో మూడు పథకాలకు సంబంధించి కలెక్టర్ అనుమతులను మంజూరు చేశారు. అయినా అధికారు లు పట్టించుకోవడం లేదు. కలెక్టర్ రాంగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం.

 

 తాగేందుకు నీళ్లు సరిపోవడం లేదయ్యా

 రోజుకు ఇంటిల్లిపాదికి 5-6 బిందెల కంటే ఎక్కువగా నీళ్లు ఇవ్వడం లేదు. రెండు, మూడు దినాలకు ఒకసారి ట్యాంకర్లు వస్తాయి. ఆ నీళ్లు తాగేందుకే సరిపోవడం లేదు. నీళ్లకోసం సానా తిప్పలు పడుతుండాం.

 -షాదర్దీ, సుగాలిమిట్ట, పూతలపట్టు మండలం

 

 గొడ్లను చూస్తే బాధేస్తోంది

 రోజుకు ఒకటిన్నర లేదా రెండు ట్యాంకర్లు నీళ్లు వచ్చేవి. వాటితో ఊరంతా సర్దుకోవాలంటే ఎట్టా. ఊళ్లోని మోటారుకు కరెంటు తీగ కాలిపోయింది. దాన్ని కూడా అధికారులు పట్టించుకోలేదు. మా పక్కింటోళ్లు నీళ్లు లేక గేదెలు, ఆవులను పస్తు పెడతా ఉండారు. చూస్తే బాధేస్తోంది.

 -మునెమ్మ, సుగాలిమిట్ట, పూతలపట్టు మండలం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top