ఆత్మహత్యలు చేసుకుంటేనే నీరిస్తారా? | Do you supply water, if people commits suicide? | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యలు చేసుకుంటేనే నీరిస్తారా?

Aug 13 2013 5:32 AM | Updated on Oct 1 2018 2:00 PM

సార్వా సాగుకు ఆది నుంచి సాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్న రైతులు నీటి పారుదల శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంటుమిల్లి రూరల్, న్యూస్‌లైన్ : సార్వా సాగుకు ఆది నుంచి సాగునీటి కోసం  నానా అవస్థలు పడుతున్న రైతులు నీటి పారుదల శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మల్లేశ్వరం ఇరిగేషన్ బంగ్లాలో సోమవారం పలు గ్రామాల రైతులతో కవుతరం నీటిపారుదల శాఖ డీఈ అప్పలరాజు, జేఈ ఎంకె బేగ్  సమీక్షా  సమావేశం నిర్వహించారు. బంటుమిల్లి కాలువకు విడుదలవుతున్న నీటి పరిమాణంపై వివరించేందుకు అధికారులు సిద్ధపడగా రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బంటుమిల్లి కాలువకు ఎందుకు పూర్తిగా నీరు ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రం పాలవుతున్న నీటిని రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు.  

కాలువకు నీరు విడుదల చేసి నెల రోజులవుతుండగా ఏ అధికారీ కాలువ మొహం చూడలేదని డీఈని నిలదీశారు. నష్టాల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప నీరివ్వరా అంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు.  డెల్టా ఆధునికీకరణ అని దాళ్వా లేకుండా చేశారని మండిపడ్డారు.  సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్న రైతులు అధికారులను నోటికొచ్చినట్టు మాట్లాడుతుండడంతో  అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీఈ అప్పలరాజు ఈఈ నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు.   వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తిరుమాని శ్రీనివాసరావు, బంటుమిల్లి నీటి సంఘం మాజీ అధ్యక్షుడు ఎస్.జనార్దనరావు, తూర్పు కృష్ణా డెల్టా మాజీ వైస్ చైర్మన్ గౌరిశెట్టి వెంకటేశ్వరరావు, సిహెచ్.రాధాకృష్ణ రైతుల పరిస్థితులను ఈఈకి ఫోన్లో వివరించారు.

దీనిపై స్పందించిన ఆయన బ్రాంచి కాలువల  రీడింగ్ కొంత తగ్గించి కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం లాకువద్ద నీరు రీడింగ్ నిలిపిన తర్వాత పూర్తి స్థాయిలో బ్రాంచి కాలువలకు నీరు విడుదల చేస్తామని చెప్పారు. అయితే బ్రాంచి కాలువలకు నీటి విడుదల తగ్గించే విషయంలో రెతులు అభ్యంతరం వ్యక్తంచేశారు. మంగళవారం సాయంత్రానికి 900 క్యుసెక్కుల నీరు విడుదల చేస్తామని డీఈ అప్పలరాజు తెలిపారు.  చిటికినేని అబ్బులు, పట్టపు రామచంద్రరావు, ప్రత్తి గాంధీ, నారిబాబు, ప్రత్తి శ్రీనివాసరావు, గోవాడ మురళీకృష్ణ, గూడవల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.


వాతావరణం సహకరించలేదు....
 కృష్ణా తూర్పు కాలువకు పూర్తిస్థాయిలో పది వేల క్యుసెక్కుల నీరు విడుదలవుతున్నా వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని డీఈ అప్పలరాజు విలేకరులకు తెలిపారు. ఇరిగేషన్ బంగ్లాలో రైతుల సమావేశం అనంతరం ఆయన  మాట్లాడారు. ఏఈలు ఎంకె బేగ్, విజయకుమార్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement