సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఏ)పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆర్‌టీఏ రాష్ట్ర కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు కోరారు.
ఆర్‌టీఏపై నిర్లక్ష్యం వద్దు
Aug 23 2013 4:08 AM | Updated on Sep 1 2017 10:01 PM
కొత్తగూడెం, న్యూస్‌లైన్: ఈ చట్టం అమలుపై ఆయన గురువారం కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారులతో స్థానిక కేసీఓఏ క్లబ్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో సరైన అవగాహన లేనందునే ఎక్కువ అప్పీళ్లు రావడం లేదన్నారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. సమాచార హక్కు చట్టం ఉద్యమకారులను కొందరు బెదిరిస్తున్నారని అన్నారు. వీటిని వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే పోలీసు రక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ చట్టం కింద కోరిన సమాచారం ఇచ్చేందుకు నిరాకరించిన అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఈ చట్టం ద్వారా ఒనగూడే ప్రయోజనాలను ఆయన సోదాహరణగా వివరించారు. ఈ చట్టం వచ్చిన తరువాత ఎక్కువ శాతం పారదర్శకత పెరిగిందని, అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కావాలనుకున్న వారు కలెక్టర్ ద్వారా తమను సంప్రదిస్తే.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా శిక్షణ ఇస్తామని అన్నారు. ఈ సమావేశానికి గైర్హాజరైన వారి వివరాలు, కారణాలు తనకు తెలపాలని ఆర్డీఓను కోరారు. సమాచార హక్కు చట్టం అమలుపై ఆర్‌టీఏ ఉద్యమకారులు రఘుమాచారి, చిట్టిమళ్ల చంద్రశేఖరాచారి, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్షుడు చారుగుండ్ల వెంకటేశ్వర్లు, నాయకుడు కండె చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ఆర్డీవో డి.అమయ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ జిల్లాలో అవగాహన తక్కువ
సమాచార హక్కు చట్టంపై ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అవగాహన తక్కువగా ఉందని, అందుకే ఇది సద్వినియోగమవడం లేదని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఆయన గురువారం కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధానంగా మున్సిపల్, రెవిన్యూ శాఖల నుంచే ఎక్కువ ఫిర్యాదులు అందాయని చెప్పారు. గతంలో అప్పీళ్ల పరిష్కారం తక్కువగా ఉండేదని, ఇప్పుడది మెరుగుపడిందని అన్నారు. ప్రతి అప్పీలును 90 రోజుల లోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి రోజు 15 నుంచి 20 వరకు అప్పీళ్లను పరిష్కరిస్తున్నామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ఆర్డీవో డి.అమయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement