
ఎటూ పోనివ్వద్దు: దిగ్విజయ్
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు పార్టీని వీడిపోకుండా చూడాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ ఆ పార్టీ నాయకులకు సూచించారు.
* కాంగ్రెస్ నేతలు చేజారకుండా చూడండి: దిగ్విజయ్
* ఏపీలో ఒక్క సీటూ గెలవకపోవడం దురదృష్టం
* కేంద్రం నుంచి రాయితీలు తెచ్చుకునే బాధ్యత బాబుదే
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు పార్టీని వీడిపోకుండా చూడాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ ఆ పార్టీ నాయకులకు సూచించారు. హైదరాబాద్, విజయవాడ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన ఆయన ఈ మేరకు రాష్ట్ర నాయకులకు సూచించినట్లు తెలిసింది. ఇదే విషయంపై గురువారం సాయంత్రం ఇక్కడి ఇందిర భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు. పార్టీ బలోపేతంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే చర్యలపై కూడా చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి క్షేత్ర స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే వ్యూహాలతో పాటు పార్టీ నుంచి వెళ్లిపోతున్నవారికి ఎలా అడ్డుకట్ట వేయాలనే అంశాలపై కార్యాచరణ రూపొందించనున్నారు. మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం, పెద్ద సంఖ్యలో సభ్యత్వాల్ని నమోదు చేయించడం తదితర వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ విషయంపై కూడా సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
పార్టీకి ఏపీ కీలకం..: బుధవారం విజయవాడలో దిగ్విజయ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఎంతో కీలకమైనదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కస్థానం కూడా గెలవకపోవడం దురదృష్టమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు పన్ను రాయితీలు ఇచ్చారన్నారు. పలు అభివృద్ధి అవకాశాలు కల్పించారని చెప్పారు. కేంద్రం నుంచి వాటన్నింటినీ సాధించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే ఉందన్నారు.
ఇక ఢిల్లీ శాసనసభ ఎన్నికలపై మాట్లాడుతూ.. కిరణ్‌బేడీని బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని దిగ్విజయ్ చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు సాగుతోందన్నారు. బీజేపీలో కొత్తగా చేరిన కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం సముచితం కాదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఆమ్‌ఆద్మీ పార్టీ నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. అంతకుముందు పదిహేను సంవత్సరాల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ సమర్ధమైన పాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, శాసనమండలి ఫ్లోర్ లీడర్ సి.రామచంద్రయ్య పాల్గొన్నారు.
పేలుడు బాధితులను ఆదుకోవాలి..
విజయవాడలో మంగళవారం జరిగిన పేలుడు దుర్ఘటనలో బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని దిగ్విజయ్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం రఘువీరారెడ్డి, ఎంపీ జేడీ శీలం తదితర నాయకులతో కలసి పేలుడు బాధితులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మరణించడం దురదృష్టకరమన్నారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ, దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు చొప్పున నష్టపరిహారం అందజేయాలన్నారు.