భక్తులదే పట్టు

Devaragattu Bunny Fight Celebration Kurnool - Sakshi

హొళగుంద/ఆలూరు: దసరా ఉత్సవాల్లో భాగంగా దేవరగట్టులో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత కర్రల సమరం కొనసాగింది. సంప్రదాయ వేడుకలో పలువురు గాయపడ్డారు. ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం దేవరగట్టు కొండల్లో కొలువుదీరిన శ్రీ మాళమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించారు. అనంతరం విహార యాత్ర (జైత్రయాత్ర)లో భాగంగా ఆలయ అర్చకులు కొండ మీద నుంచి ఉత్సవ మూర్తులను  తీసుకు వస్తుండగా.. దేవతామూర్తులకు ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా నెరణికి ,కొత్తపేట, నెరణికి తండా గ్రామాలకు చెందిన భక్తులు డిర్‌ర్‌ర్‌...గో పరాక్‌ అంటూ కర్రలు చేత పట్టుకొని విసురుకుంటూ వచ్చారు. దీంతో పలువురు గాయపడ్డారు. కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు జిల్లా పోలీసు, రెవెన్యూ అధికార యంత్రాంగం చేసిన చర్యలు ఫలించలేక పోయాయి. శ్రీ మాళ మల్లేశ్వర స్వాముల జైత్రయాత్రలో కర్రల మొగలాయి విజయవంతంగా సాగింది.  శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగుతూ వచ్చింది.

ఈ సమరాన్ని తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. గతేడాది ఉత్సవం రోజులు మొహర్రం ఉండడంతో భక్తుల సంఖ్య తగ్గగా ఈ ఏడాది  భక్తుల సంఖ్య అన్యూహ్యంగా పెరిగింది.   దేవరగట్టు పరిసరాల్లో ఉన్న దాదాపు 15 గ్రామాలకు చెందిన భక్తులు ఉత్సవంలో పాల్గొని మొగలాయి ఆడారు. కర్రల యుద్ధాన్ని సాధ్యమైనంత వరకు నివారించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున హెల్మెట్‌లను ధరించి బందోబస్తు చేపట్టారు.  జిల్లా ఎíస్పీ గోపీనాథ్‌ జెట్టి ఆధ్వర్యంలో  మిలటరీ సిబ్బంది, ఆర్మీఫోర్స్, పారామిలటరీ సివిల్‌ పోలీసులు, హోంగార్డులు కలిసి 1,200 మంది బందోబస్తుతో పాటు డ్రోన్‌ కెమెరాల ద్వారా బందోబస్తు నిర్వహించారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల వెంట ఉండి ప్రశాంతంగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకున్నారు. అలాగే భక్తులకు అంతరాయం కలగకుండా ఈ సారి ట్రాఫిక్‌  నియంత్రణ ఏర్పాటు చేశారు. కొండపై  వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.
  
పాల బాస, బండారంతో  తొలి ఘట్టానికి అనుమతి 
శ్రీ మాళమల్లేశ్వరస్వామి జైత్రయాత్ర(ఊరేగింపు)కు కొద్ది సమయం ముందు మాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవాన్ని నిర్వహించడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు.. పెద్దల అనుమతి తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు శుక్రవారం రాత్రి 10.45 గంట సమయంలో  చెరువు కట్ట (డొళ్ళిన బండ)వద్దకు చేరి  వ్యక్తిగత మనస్పర్థలను వీడి మూడు గ్రామస్తులు కలిసికట్టుగా జరుపుకుందామని పాలబాస తీసుకున్నారు.  అందులో భాగంగా రాత్రి 11.50 గంటల సమయంలో కార్యక్రమానికి హాజరైన   ఎస్పీ గోపీనాథ్‌ జెట్టికి  బండారాన్ని(పసుపు)  ఇచ్చి మాళ మల్లేశ్వరుని కల్యాణానికి అనుమతి కోరారు.  ఇందుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో మూడు గ్రామస్తులు మాళ మల్లేశ్వరునికి కల్యాణోత్సవాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యారు. 

అర్ధరాత్రి ‘గిరి’పై మోగిన కల్యాణ మేళాలు.. 
నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ఇనుప తొడుగులు తొడిగి కర్రలు, పుంజీలు ,కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడసిద్దప్ప మఠంలో ఉంచిన మల్లేశ్వరుని విగ్రహంతో పాటు పల్లకీని కొండ(గిరి)పై ఆలయంలో ఉన్న మాళమ్మ విగ్రహం వద్దకు తీసుకెళ్లారు. గిరిపై స్వామివారి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్చారణలు, భక్తులు జైజై ధ్వనుల మధ్య మాత మాళమ్మ, మల్లేశ్వరునికి అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలతో పాటు పల్లకిని ఊరేగింపుగా తీసుకు వస్తుండగా అక్కడే ఉన్న కొందరు భక్తులు అటకాయించారు. అగ్గి కాగడాలు విసురుకున్నారు. కర్రల శబ్దాలతో, డిర్‌ర్‌ర్‌...గొపరాక్‌ అంటూ విగ్రహాలను మల్లప్ప గుడిలోని సింహాసనం కట్ట మీద అధిష్టింపజేశారు. అనంతరం అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ఉత్సవాన్ని చూస్తున్న భక్తుల ఒళ్లు జలదరించేలా ఉద్వేగంగా, ఉత్కంఠంగా ముందుకు సాగింది. 

జైత్రయాత్రలో  చిందిన రక్తం 
జైత్రయాత్ర సత్య నారాయణ కట్ట, కాడసిద్ధప్ప మఠం పరిసరాల్లో కొద్ది సేపు అలజడి సృష్టించి ముందుకు కదలగా భక్తుల  కర్రలు తగిలి ఎన్నో తలలు పగిలాయి. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు  మొగలాయిల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు చేతుల్లో ఉన్న రింగు  కర్రలు తగిలి చాలా మంది గాయపడ్డారు. తలలు పగిలాయి. పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి భక్తుల ఒళ్లు కాలిపోయాయి. ఉత్సవంలో గాయపడిన భక్తుల్లో ఎక్కువ శాతం నాటుసారా, మద్యం సేంచిన వారే ఉన్నారు. మద్యం మత్తులో రింగు కర్రలు తగిలి, అగ్గి కాగడాలు మీద పడి గాయాలకు గురయ్యారు.

నాటుసారా అరికట్టేందుకు  రెవెన్యూ, సివిల్,  పోలీసులు నెలన్నర రోజులుకు ముందు  అవగాహన సదస్సులు, నాటుసారా స్థావరాలపై దాడులు, రింగు కర్రల స్వాధీనం కోసం తనిఖీలు చేపట్టారు. ఆలూరు, హొళగుంద, హాలహర్వి మండలాల్లో  నాటుసారా స్థావరాలపై దాడులు చేసి 10 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అరెస్ట్‌లు,  బైండోవర్, ఇతర కేసులు నమోదు చేశారు.  అయినా ఉత్సవంలో మద్యం, రింగు కర్రలు ప్రత్యక్షమయ్యాయి.   

నడి అరణ్యంలో రక్తం చిందించిన కంఛాబీర వంశస్తుడు.. 

జైత్రయాత్ర దట్టమైన అడవిలో సుమారు 6 కి. మీ పరిధిలో ఉన్న  ముళ్లబండ, పాదాల గట్టు మీదుగా రాక్షసపడి గుండ వద్దకు చేరుకుంది. భయంకరమైన వాతావరణంలో కంఛాబీర వంశానికి చెందిన బసవరాజు అనే భక్తుడు తన ఎడమ కాలు పిక్కల నుంచి డబ్బణంను గుచ్చుకుని వచ్చిన రక్తాని మణి, మల్లాశురులుగా పిలిచే రాక్షస గుండ్లకు సమర్పించాడు (విసరడం). అక్కడి నుంచి మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను శమీవృక్ష వద్దకు తీసుకెళ్లారు.

ఉత్సవంలో పాల్గొన్న భక్తులు కర్రలు, మిగిలిన ఆయుధాలను ఉంచి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శమీవృక్షం మీదుగా మాళ మల్లేశ్వర విగ్రహాలతో ఎదురు బసవన్న గుడి వైపుకు బయలుదేరాయి. అక్కడ ఆలయ ప్రధాన పూజారి గిరిస్వామి భవిష్యవాణి(కార్ణీకం) చెప్పిన తర్వాత జైత్రయాత్ర మల్లప్ప గుడిలోని సింహాసన కట్టకు చేరడంతో బన్ని ఉత్సవం ముగుస్తుందని ఆలయ నిర్వాహాకులు, భక్తులు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top