ఈడీ ముందు హాజరు కావాల్సిందే... | Sakshi
Sakshi News home page

ఈడీ ముందు హాజరు కావాల్సిందే...

Published Sat, Dec 1 2018 5:10 AM

Delhi High Court mandate to Sujana Chowdary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ ముందు హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జారీ చేసిన సమన్లను గౌరవించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి)కి ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సమన్ల ప్రకారం డిసెంబర్‌ 3న ఈడీ ముందు హాజరు కావాల్సిందేనని ఆయనకు తేల్చిచెప్పింది. అయితే సుజనాపై కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఈడీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ముక్తా గుప్తా శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమ నుంచి తీసుకున్న రూ.364 కోట్ల అప్పును చెల్లించకుండా ఎగవేశారంటూ కార్పొరేషన్‌ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఇటీవల హైదరాబాద్‌లోని సుజనాచౌదరి కార్యాలయం, నివాసంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, అనేక కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. అలాగే సుజనా గ్రూప్‌ కింద 120 సూట్‌కేసు కంపెనీలున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. రూ.5,700 కోట్ల మేరకు రుణాలు ఎగవేసినట్లు గుర్తించి, అందుకు సంబంధించిన కీలక పత్రాలనూ స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేసు కంపెనీల పేరిట ఆరు ఖరీదైన కార్లు రిజిస్టరైనట్లు గుర్తించి వాటినీ జప్తు చేశారు. ఈ నేపథ్యంలో స్వయంగా తమ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. ఈ సమన్లను కొట్టేయాలని అభ్యర్థిస్తూ సుజనాచౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ ముక్తా గుప్తా శుక్రవారం విచారించారు. 

వాస్తవాలు తెలుసుకునేందుకే సమన్లు..
పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈడీ నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌)లో సుజనాచౌదరి పేరు లేదన్నారు. అందువల్ల ఆయనకు జారీచేసిన సమన్లు చట్టప్రకారం చెల్లవన్నారు. ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంతో కేంద్రప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే సుజనాపై ఈడీ దాడులు జరిగాయని చెప్పారు. ఈ వాదనలను కేంద్రప్రభుత్వ న్యాయవాది అనిల్‌ సోనీ తోసిపుచ్చారు. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టస్‌ లిమిటెడ్‌లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఆ కంపెనీ డైరెక్టర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుజనాచౌదరి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయన్నారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాస్తవాలను తెలుసుకునేందుకు ఆయనకు సమన్లు ఇచ్చినట్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. డిసెంబర్‌ 3న ఈడీ ముందు హాజరు కావాల్సిందేనని సుజనాచౌదరిని ఆదేశించారు. అయితే సుజనాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఈడీకి స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశిస్తూ విచారణను డిసెంబర్‌ 18కి వాయిదా వేశారు.

Advertisement
Advertisement