డిగ్రీ ప్రశ్నపత్రం తారుమారు | degree of question paper manipulative | Sakshi
Sakshi News home page

డిగ్రీ ప్రశ్నపత్రం తారుమారు

Apr 3 2014 3:08 AM | Updated on Sep 2 2017 5:29 AM

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న మొదటి సంవత్సవరం డిగ్రీ పరీక్షలలో ప్రశ్నాపత్రం మారడంతో విద్యార్థులు ఇబ్బంది పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

కంప్యూటర్ కోర్సుకు బదులు కంప్యూటర్ స్కిల్స్‌పేపరు పంపిణీ
ఆందోళనలో ఫస్టియర్ విద్యార్థులు

 

 ఇచ్ఛాపురం,న్యూస్‌లైన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న మొదటి సంవత్సవరం డిగ్రీ పరీక్షలలో ప్రశ్నాపత్రం మారడంతో విద్యార్థులు ఇబ్బంది పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా రాత్రి వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా కంప్యూటర్ కోర్సు పేపరు రాయల్సి ఉండగా, వారికి కంప్యూటర్ స్కిల్స్ పేపరు అందజేశారు. దీంతో విద్యార్థులు చూసుకోకుండా ఆ సబ్జెక్టు పేపరుకు పరీక్ష కూడా పూర్తి చేశారు.

 

పరీక్ష పూర్తై తర్వాత జరిగిన పొరపాటును గ్రహించిన విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు రాసిన సమాధానాల పత్రాలకు వారు రాసిన ప్రశ్నాపత్రాన్నే జత చేసి బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి పంపారు. డిగ్రీ జనరల్ విద్యార్థులకు కంప్యూటర్ కోర్సు పేపర్, వోకేషనల్ విద్యార్థులకు కంప్యూటర్ స్కిల్స్ పేపరు ఇవ్వాల్సి ఉంది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు కూడా ఇక్కడే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం సుమారు 550 మంది విద్యార్థులకు 13 గదుల్లో పరీక్ష నిర్వహించారు.

 

జనరల్ విద్యార్థులున్న ఒక పరీక్ష గదిలో కంప్యూటర్ కోర్సుకు బదులు కంప్యూటర్ స్కిల్స్ ప్రశ్నాపత్రం ఇచ్చారు. వారు పరీక్ష కూడా రాసి సమాధానపత్రాలిచ్చిన తర్వాత జరిగిన పొరపాటు తెలుసుకున్నారు. దాంతో చాలా మార్కులు కొల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపాల్ రోబిన్‌కుమార్ పాడి వివరణ ఇస్తూ ప్రశ్నాపత్రం మారిన మాట వాస్తవమేనన్నారు.

 

కొన్ని పరీక్ష గదుల్లో విద్యార్థులు పొరపాటును గమనించి చెప్పడంతో వారికి సరైన ప్రశ్నాపత్రం అందజేశామని, మరో గదిలోని విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత పొరపాటును గమనించి తమ దృష్టికి తెచ్చారన్నారు. వెంటనే బీఆర్‌ఏయూ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామన్నారు. ప్రశ్నాపత్రం మారినా సుమారు 60 శాతం ప్రశ్నలు ఒకే విధంగా ఉన్నాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన ఆవసరం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement