రెక్కలు ముడిచిన పసిడి రేటు

రెక్కలు ముడిచిన పసిడి రేటు


- నాలుగేళ్లలో కనిష్టస్థాయికి పతనం

- అంతర్జాతీయ పరిణామాలే కారణం

- కళకళలాడుతున్న బంగారం దుకాణాలు


సాక్షి, రాజమండ్రి : ఒకప్పుడు మిడిసిపడి, మిన్నంటిన పసిడి ధర ఇప్పుడు క్రమక్రమంగా దిగి వస్తోంది. బంగారం మార్కెట్‌లో స్పెక్యులేటర్లు, స్టాకిస్టులపెద్ద ఎత్తున అమ్మకాలు సాగించడం, పారిశ్రామిక రంగం నుంచి కూడా పసిడికి డిమాండ్ బాగా తగ్గడం వంటి పరిణామాలతో గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 2010లో ధనత్రయోదశి సందర్భంగా 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి రూ.31,250 పలికింది. 2011, 2012 సంవత్సరాల్లో ధర రూ.31,150 నుంచి రూ.30,350 మధ్య కొనసాగింది.2013 సంవత్సరాంతానికి 24 క్యారెట్ల పదిగ్రాముల ధర రూ.30,000 నుంచి రూ.31,500 మధ్య ఉంది. నెల రోజుల క్రితం ఏప్రిల్ 29న పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.27,280, 24 క్యారెట్ల ధర రూ.30,300 గా ఉంది. మే 29 గురువారం నాటికి 22 క్యారెట్ల బంగారం రూ.25,950కు, 24 క్యారెట్ల ధర రూ.27,500కు పడిపోయాయి. అంటే 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.1850 మేర, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.2,800 మేర పతనమయ్యాయి.అప్పటి లగ్గాలకూ ఇప్పుడే..

పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు తగ్గుముఖం పట్టడంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రెండు నెలల తర్వాత వచ్చే శ్రావణంలో జరిగే పెళ్లిళ్ల నిమిత్తం కూడా ఇప్పుడే బంగారం కొంటున్నారు. దీంతో బంగారం దుకాణాలు కళ కళలాడుతున్నాయి. జిల్లాలో సుమారు 2000 వరకూ చిన్నా, పెద్దా బంగారం దుకాణాలుండగా వీటిలో 50 వరకూ కార్పొరేట్ షాపులు. వీటన్నింటిలో రోజుకు రూ.రెండు కోట్ల నుంచి రూ.నాలుగు కోట్ల వ్యాపారం జరుగుతుంది.పండగలు, వివాహాల సీజన్‌లో రూ.పది కోట్ల  వ్యాపారం జరుగుతుంది. మే మొదటి వారం నుంచీ బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా శక్తి మేరకు బంగారం కొనాలని ఆశిస్తున్నారు. కాగా కొందరు ధర ఇప్పుడు తగ్గినా భవిష్యత్తులో పెరుగుతుందన్న నమ్మకంతో, వ్యాపార దృక్పథంతో కొనుగోలు చేస్తున్నారు.ఇప్పట్లో పెరగకపోవచ్చు..

విదేశాల్లో బంగారానికి డిమాండ్ తగ్గిపోయింది. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాల్లో ఆర్థిక సంస్కరణల ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనం అయ్యాయి. ధరలు తగ్గుతుండడంతో మార్కెట్‌లో స్పెక్యులేటర్లు భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలతో మొదలైన తగ్గుదల మరింత కాలం కొనసాగవచ్చని, పసిడి ధర తిరిగి పెరగడానికి చాలా కాలం పట్టవచ్చని ఈ రంగంలో నిపుణులైనవారు అంచనా వేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top