భళా.. బాల్‌కా!

DAV School Student Select National volleyball - Sakshi

జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు డీఏవీ పాఠశాల విద్యార్థి

సత్తా చాటుతున్న మన్యం కుర్రాడు

మోతుగూడెం (రంపచోడవరం) : వాలీ బాల్‌ క్రీడలో రాణిస్తున్నాడు మన్యం కుర్రాడు. మెరుపు వేగంతో కదులుతూ అవతలి జట్టును చిత్తు చేస్తున్నాడు. తమ జట్టు సభ్యులకు బాల్‌ అందిస్తూ టీమ్‌కే కీలకంగా మారాడు. మండల స్థాయి నుంచి జాతీయ పోటీల్లో పాల్గొనే స్థాయికి చేరాడు. డీఏవీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పార్ధివ్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర  డీఏవీ స్కూల్స్‌ వాలీబాల్‌ టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

నాడు చోటు దక్కక..
గత ఏడాది హైదరాబాద్‌లో డీఏవీ స్కూల్స్‌ స్టేట్‌ మీట్‌లో ఉత్తమ ప్రతిభ చూపినా జాతీయ స్థాయి జట్టులో స్థానం దక్కలేదు. ఎత్తు సరిపోకపోవడంతో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ ఏడాది జార్ఖండ్‌లో జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలు జరిగాయి. ఈ ఏడాది హైదరాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి డీఏవీ స్కూల్‌ వాలీబాల్‌ పోటీలకు స్థానం దక్కించుకున్నాడు.

సౌత్‌ ఇండియా తరఫున జట్టులో స్థానం
దేశ వ్యాప్తంగా 900 డీఏవీ స్కూల్స్‌ ఉన్నాయి. మోతుగూడెం డీఏవీ పాఠశాల విద్యార్థి పార్ధివ్‌ సౌత్‌ ఇండియా తరఫున పాల్గొనే జట్టులో స్థానం దక్కింది. సౌత్‌ ఇండియాలో తొమ్మిది క్లష్టర్లు ఉంటాయి. క్లష్టర్‌లో పది డీఏవీ స్కూల్స్‌ ఉంటాయి. వీటి పరిధిలో 12 మందిని ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీల్లో సౌత్‌ ఇండియా తరఫున   ఆడిస్తారు. డిసెంబర్‌ 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలు జరుగుతాయి.

మండల స్థాయి నుంచి జాతీయ స్థాయిపోటీలకు
క్రీడలపై ఆసక్తి ఉన్న పార్ధివ్‌ను పాఠశాల పీఈటీ భద్రయ్య ప్రోత్సహించారు. షటిల్‌ నుంచి వాలీబాల్‌ ఆడేలా శిక్షణ ఇచ్చారు. ఏడో తరగతిలోనే మండల స్థాయిలో జరిగిన సీఎం కప్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మండల స్థాయి నుంచి జోనల్‌ స్థాయి వరకు జరిగిన వాలీబాల్‌ పోటీల్లో పాల్గొన్నాడు. ఆగస్టు నెలలో కడపలో జరిగిన క్లష్టర్‌ స్థాయి జట్టుకు ఎంపికయ్యాడు.

జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తాడు
ముందు నుంచి వాలీబాల్‌లో ప్రతిభ చూపుతున్నాడు. జట్టులో మిగిలిన సభ్యులను లీడ్‌ చేస్తూ అనేక సందర్భాల్లో జట్టు విజయానికి కృషి చేశాడు. హైదరాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తాడనే నమ్మకం ఉంది. ఎంతో భవిష్యత్తు ఉంది.–భద్రయ్య, పీఈటీ, డీఏవీ స్కూల్‌ మోతుగూడెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top