డబ్బుల్లేవ్‌.. వెంకన్నా సర్దుకో! | Currency effect | Sakshi
Sakshi News home page

డబ్బుల్లేవ్‌.. వెంకన్నా సర్దుకో!

Jan 12 2017 4:42 AM | Updated on Sep 5 2017 1:01 AM

డబ్బుల్లేవ్‌.. వెంకన్నా సర్దుకో!

డబ్బుల్లేవ్‌.. వెంకన్నా సర్దుకో!

వెయ్యి, ఐదొందల రూపాయల నోట్ల రద్దు ప్రభావం తిరుమల శ్రీవారిని తాకింది. సాధారణ రోజుల్లోనూ రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పైబడి వచ్చే హుండీ

సాక్షి, తిరుమల: వెయ్యి, ఐదొందల రూపాయల నోట్ల రద్దు ప్రభావం తిరుమల శ్రీవారిని తాకింది. సాధారణ రోజుల్లోనూ రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పైబడి వచ్చే హుండీ ఆదాయం గత పది రోజులుగా సగానికి పడిపోయింది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు హుండీ ద్వారా మొత్తం రూ.1,018 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే రోజుకు సగటున 2.78 కోట్ల ఆదాయం సమకూరినట్లు లెక్క. అయితే పెద్ద నోట్ల స్వీకరణ గడువు గతేడాది డిసెంబర్‌ 30తో ముగియడంతో అప్పట్నుంచి హుండీ కానుకలు భారీగా తగ్గాయి.

జనవరి 1న రూ.2.38 కోట్లు, 2న రూ.2.74 కోట్లు , 3న రూ.1.10 కోట్లు, 4న రూ.1.24 కోట్లు, 5న రూ.1.90 కోట్లు, 6న రూ.1.72 కోట్లు, 7న రూ.2.22 కోట్లు, 8న రూ. 3.45 కోట్లు, 9న రూ.1.45 కోట్లు, 10న రూ.1.71 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. వైకుంఠ ఏకాదశి(8 తేదీని) మినహాయిస్తే మిగిలిన రోజుల్లో ఎప్పుడూ రూ.3 కోట్ల మార్క్‌ను దాటలేదు.

తగినంత నగదు లేకపోవడం వల్లే..
2016లో మొత్తంగా 2.66 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అంటే సగటున రోజుకు 72 వేల మంది వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చారు. కొత్త సంవత్సరంలోనూ భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. కానీ హుండీ కానుకలే తగ్గాయి. పెద్ద నోట్లు రద్దు కావటం, వాటిని మార్చుకునే గడువు ముగియటం, నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశాలు పరిమితం కావటంతో పాటు ప్రజల వద్ద తగినంత నగదు లేకపోవడమే ఇందుకు కారణమని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

పెరిగిన ఈ–హుండీ కానుకలు
తిరుమలలోని శ్రీవారి హుండీ ఆదాయం తగ్గగా.. టీటీడీ నిర్వహిస్తున్న ఈ–హుండీకి మాత్రం కానుకలు పెరిగాయి. తిరుమలకు రాలేని భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా ఈ–హుండీకి కానుకలు సమర్పిస్తుంటారు. 2015లో ఈ–హుండీ ద్వారా రూ.6 కోట్లు ఆదాయం సమకూరగా, 2016లో రూ.8.8 కోట్లు వచ్చాయి. గత నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ–హుండీకి రూ.కోటి ఆదాయం రాగా, డిసెంబర్‌లో ఈ మొత్తం రూ.2.11 కోట్లకు పెరిగింది. అంటే నవంబర్, డిసెంబర్‌ మధ్యలో వంద శాతం మేర ఈ–హుండీ కానుకలు పెరిగాయి. కాగా, మున్ముందు ఈ–హుండీకి మరింత ప్రాచుర్యం కల్పిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు.

ఇదిలాఉండగా, మరోవైపు పెద్ద నోట్ల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ భక్తులు పాత రూ.500, రూ.వెయ్యి నోట్లు సమర్పిస్తూనే ఉన్నారు. ఇలా డిసెంబర్‌ 31 నుంచి జనవరి 10 వరకు వచ్చిన పాత నోట్లు టీటీడీ వద్ద రూ.1.6 కోట్ల మేర ఉన్నాయి. ఈ నోట్లు రద్దు కావటంతో వీటిని రోజువారీ హుండీ కానుకల్లో కలపటం లేదు. వీటిని ఆర్‌బీఐ వద్ద మార్చేందుకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement