దొంగ సంతకాలు... తప్పుడు నివేదిక | crda misleads ngt and central government | Sakshi
Sakshi News home page

దొంగ సంతకాలు... తప్పుడు నివేదిక

Apr 24 2017 4:41 AM | Updated on Oct 3 2018 6:52 PM

దొంగ సంతకాలు... తప్పుడు నివేదిక - Sakshi

దొంగ సంతకాలు... తప్పుడు నివేదిక

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)ను, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించింది.

  • ఎన్జీటీ, కేంద్రాన్ని బురిడీ కొట్టించిన సీఆర్‌డీఏ
  • రాజధానిపై టీసీఎస్‌ ఇచ్చిన నివేదికలో ప్రతికూల అంశాలు
  • సీఆర్‌డీఏ ఏర్పడకముందే పర్యావరణ నివేదిక తయారైందట!
  • అమరావతి నిర్మాణానికి అనుమతులు రావనే ఉద్దేశంతో తప్పుడు నివేదిక
  • సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో
    రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)ను, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించింది. దొంగ సంతకాలతో పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) నివేదికను తయారు చేసి, పర్యావరణ అనుమతులు సంపాదించింది. ఆ నివేదిక ప్రతిని సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచింది. సీఆర్‌డీఏ ఏర్పడకముందే పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక తయారైనట్లు... దొంగ సంతకం కింద వేసిన తేదీలు స్పష్టం చేస్తున్నాయి.

    దొంగ సంతకానికి స్పష్టమైన ఆధారాలు
    సీఆర్‌డీఏ చట్టానికి(యాక్ట్‌ నం.11, 2014) గవర్నర్‌ 2014 డిసెంబర్‌ 29న ఆమోదం తెలిపారు. ఆ తర్వాతి రోజు.. అంటే 2014 డిసెంబర్‌ 30న సీఆర్‌డీఏ ఏర్పాటైంది. రాజధాని ఏర్పాటు వల్ల పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాన్ని అధ్యయనం చేసి, దానిన తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయడానికి టాటా కన్సల్టింగ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌(టీసీఎస్‌)కు బాధ్యత అప్పగించారు. 2015 మే 1 నుంచి ఆగస్టు 30 వరకు.. నాలుగు నెలలపాటు టీసీఎస్‌ రాజధాని ప్రాంతంలో పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేసింది. తన నివేదికను సెప్టెంబర్‌ 4న సీఆర్‌డీఏకు సమర్పించింది.

    • నివేదికలో పేర్కొన్న అన్ని అంశాలకు టీసీఎస్‌ బాధ్యత వహిస్తుందని, వాస్తవిక అంశాలతో దీన్ని రూపొందించామని నివేదిక ప్రారంభంలోనే టీసీఎస్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఆశీష్‌ దేశ్‌పాండే సంతకం చేశారు. 10 మంది నిపుణుల పేర్లు కూడా రాశారు. ఆ 10 మందిలో ఆశీష్‌ దేశ్‌పాండే కూడా ఒకరు.  
    • నివేదికలో రెండు చోట్ల ఆశీష్‌ దేశ్‌పాండే సంతకం కనిపిస్తోంది. రెండు చోట్లా సంతకం కింద ‘28/07/2014’ అని తేదీ వేశారు. అధ్యయనమే 2015 మే 1 ప్రారంభమైంది. నివేదికను సెప్టెంబర్‌ 4న సీఆర్‌డీఏకే సమర్పించారు. మరి సీఆర్‌డీఏ పుట్టకముందు తేదీ ఎందుకు వేశారు?
    • ఎక్కడో ఉన్న పాత సంతకాన్ని స్కాన్‌ చేసి... ఈఏఐ నివేదికలో సీఆర్‌డీఏ అధికారులు ‘పేస్ట్‌’ చేశారు. వాస్తవంగా టీసీఎస్‌ రూపొందించిన నివేదికలో నిపుణులు సంతకాలు చేయకుండా, స్కాన్‌ చేసి పేస్ట్‌ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? టీసీఎస్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు స్పష్టమవుతోంది.
    • మిగతా నిపుణుల సంతకాలైనా నిజమైనవేనా? అవి కూడా ఫోర్జరీ చేశారా? ఆయా సభ్యుల సంతకాల కింద ‘4 సెప్టెంబర్‌ 2015’ అని తేదీ ప్రింట్‌ చేసి ఉంది. సంతకాల కింద తేదీ ప్రింట్‌ చేయాల్సిన అవసరం ఏమిటి?

    ఎన్జీటీకి ఇచ్చిందీ ఈ నివేదికే
    జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు కూడా దొంగ సంతకాలతో కూడిన నివేదికను సమర్పించడం గమనార్హం. పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇదే నివేదిక అందజేశారు. టీసీఎస్‌ ఇచ్చిన అసలైన నివేదికలో ప్రతికూల అంశాలు ఉండటం వల్ల పర్యావరణ అనుమతులు రావని, హరిత ట్రిబ్యునల్‌ నుంచి వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉందన్న భయంతోనే దాన్ని బుట్టదాఖలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు అధికారులు ఫోర్జరీ సంతకాలతో నివేదికను రూపొందించారనే అనుమానాలున్నాయి.

    సీఆర్‌డీఏపై కేసు పెడతా...
    ఫోర్జరీ సంతకాలతో ఈఐఏ నివేదికను రూపొందించిన సీఆర్‌డీఏపై కేసు పెడతానని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పిటీషన్‌ దాఖలు చేసిన శ్రీమన్నారాయణ చెప్పారు.

    నివేదిక మూడో పేజీలో కమిటీ నిఫుణుడు ఆశిష్‌ దేశ్‌పాండే(టీసీఎస్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌) సంతకాన్ని ‘పేస్ట్‌’ చేసినట్లు కనిపిస్తున్న దృశ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement