నిర్వాసితులపై చిన్న చూపా?

CPI Secretary Ramakrishna Fires On TDP - Sakshi

పాలకుల కళ్లు తెరిపిస్తాం

16, 17 తేదీల్లో మహాధర్నా

 సీపీఐ కార్యదర్శి రామకృష్ణ

వేలేరుపాడు: ఆంధ్రాలో విలీనమైన పోలవరం ముంపు ప్రాంతంలో నిర్వాసితుల న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించడంలో పాలకులు విఫలమౌతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గురువారం వేలేరుపాడు మండలంలోని భూదేవిపేట గ్రామంలో జరిగిన నిర్వాసితుల బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాసితులంటేనే సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. పాలకుల కళ్లు తెరిపించేందుకు రాజధాని(అమరావతి)లో ఈ నెల 16, 17 తేదీల్లో 30 గంటల మహాధర్నాకు పిలుపు నిచ్చినట్లు  తెలిపారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కొన్ని లోతట్టు ప్రాంతాలను ముంపు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించకపోవడం వల్ల దళితులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నిర్వాసితుడికీ న్యాయం జరగాలంటే మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటేనే సాధ్యమౌతుందని అభిప్రాయపడ్డారు.

పునరావాస కేంద్రాలు నిర్మించే చోట ఉపాధి లభించేలా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయ అంచనాలు ఐదు నుంచి పదిరెట్లు పెంచి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. నిర్వాసితులను అడ్డం పెట్టుకుని పోలవరం తహసీల్దార్‌ ఏకంగా రూ.80 లక్షలు కాజేసి ప్రభుత్వ ఖజానాకు టోకరా వేశాడని æఆరోపించారు. ఇలాంటి అక్రమాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం అన్ని ఆధారాలు కల్గి ఉన్న అర్హులైన నిర్వాసితులకు మాత్రం అన్యాయం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవీ సత్యనారాయణమూర్తి, రావుల వెంకయ్య, జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, డిæ.సుబ్బారావు, గిరిజన సంఘం కార్యదర్శి గోవిందు, ఎండీ మునీర్, సన్నేపల్లి సాయిబాబా, కారం దారయ్య, పిట్టా ప్రసాద్, బాడిశ రాము, కరాటం సీతామహాలక్ష్మి, ఇందిర, కొన్నేటి లక్ష్మయ్య, ఏఐవైఎఫ్‌ నాయకులు హేమ శంకర్, అచ్యుత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top