‘అమరావతి అడుగులెటు...?’ పుస్తకావిష్కరణ

CPI K Ramakrishna Fires On Chandrababu Over Land Acquisition In Amaravathi - Sakshi

సాక్షి, విజయవాడ : ‘దున్నే వాడిదే భూమి’ అనే నినాదాన్ని ‘కంపెనీలకే భూమి’ అన్న చందంగా సీఎం చంద్రబాబు మార్చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని బరితెగించి.. పారదర్శకత లేకుండా కంపెనీలకు వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రముఖ రచయిత తెలకపల్లి రవి రచించిన ‘అమరావతి అడుగులెటు..?’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి పి. మధు, సీపీఎం వర్గసభ్యుడు వై. వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

ఎంబీ భవన్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ..2013 భూసేకరణ చట్టం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ చేయడం ఇదే ప్రథమని అన్నారు. అమరావతిలో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగిందని దుయ్యబట్టారు. ఇష్టారీతిన కంపెనీలకు వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టడం అనేక వివాదాలకు కారణమవుతోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తోందని.. అధికారంలోకి వస్తే తమకు కావాల్సిన వారికి భూములను కట్టబెట్టవచ్చని భావిస్తున్నారని విమర్శించారు.

అన్నీపరిశీలించిన తర్వాతే..
ప్రజలు ఆశించిన పాలనను చంద్రబాబు అందించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ప్రభుత్వ తీరుతో కేంద్రం నుంచి సరైన సహకారం లభించలేదని.. రైతుల నుంచి పూలింగ్ ద్వారా భూమిని తీసుకోవడం వివాదంగా మారిందని పేర్కొన్నారు. రైతుల భూమితో ప్రభుత్వం.. సింగపూర్ కంపెనీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే.. రైతు కూలీలు ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మేధావులు, రాజకీయ పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, ప్రపంచ బ్యాంకు నివేదికలను కూడా పరిశీలించి తెలకపల్లి రవి అమరావతి అడుగులెటు..? పుస్తకం రచించారని పేర్కొన్నారు. అమరావతి ప్రణాళిక,  ప్రచారం,  ప్రజాందోళన తదితర పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి పుస్తకాన్ని వెలువరించారని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top