ప్లేటు ఫిరాయించారు

Corruption In Plates Distribution Anantapur - Sakshi

అన్న చెప్పాడు సరఫరా చేయొద్దు!

విద్యార్థుల భోజనం ప్లేట్ల పంపిణీలో రాజకీయం

ఏడు మండలాల్లో నిలిపివేత

ప్రేక్షకపాత్రలో విద్యాశాఖ అధికారులు

ప్రభుత్వ పాఠశాలలు.. అందరూ బడుగు..బలహీన వర్గాల వారే. మధ్యాహ్న భోజనం ప్రభుత్వమే అందిస్తున్నా...తినేందుకు ప్లేట్లు కూడా లేని దుస్థితి. ఒకే ప్లేటులో ఇద్దరు తినడం..లేదా ఒకరు తిన్న తర్వాత మరొకరు తినాల్సిన పరిస్థితి. అందుకే ప్రతి విద్యార్థికీ భోజనం ప్లేటు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ ప్లేట్లు సరఫరా చేయడంలోనూ అధికార పార్టీకి చెందిన కొందరు అడ్డుకుంటూ రాజకీయం చేయడంతీవ్ర విమర్శలకు తావిస్తోంది. 

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో మొత్తం 3,29,145 మంది 1–10 తరగతుల విద్యార్థులకు ప్లేట్లు సరఫరా చేయాల్సి ఉంది. హైదరాబాద్‌కు చెందిన నేషనల్‌ స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీ అనే సంస్థ ప్లేట్లు సరఫరా చేసే టెండరు దక్కించుకుంది. జిల్లాలో రవాణా బాధ్యతలను విజయ్‌కుమార్‌ అనే వ్యక్తికి అప్పగించారు.  జనవరి నుంచి మార్చి నాటికి జిల్లా కేంద్రానికి అన్ని ప్లేట్లు వచ్చాయి. ఇక్కడి నుంచిమార్చి, ఏప్రిల్, జూన్‌ నెలల్లో వివిధ మండలాలకు 2,93,368 ప్లేట్లు పంపిణీ చేశారు. ఇంకా ధర్మవరం, బత్తలపల్లి, నార్పల, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, గోరంట్ల మండలాలు మాత్రం మిగిలిపోయాయి.

ఆ ఇద్దరు ఎంఈఓలు ససేమిరా
బత్తలపల్లి, ధర్మవరం ఎంఈఓలు భోజనం ప్లేట్లు తీసుకోవడానికి ససేమిరా అంటున్నారని రవాణా ఏజెన్సీ ప్రతినిధి విజయకుమార్‌ వాపోతున్నారు. ఓ ప్రజాప్రతినిధిని కలవమని చెప్పారని, టెండరు హైదరాబాద్‌కు చెందిన సంస్థ దక్కించుకుందని, తాము కేవలం జిల్లాలో స్కూల్‌ కాంప్లెక్స్‌ పాయింట్లకు రవాణా చేసేవరకే చూస్తున్నామని చెప్పినా... వినకుండా వెనక్కు పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. సరఫరా చేసిన తర్వాత రిసీవింగ్‌ సంతకం చేయకపోతే తాము ఇబ్బందులు పడతామంటున్నాడు. ఈ రెండు మండలాలు కాకుండా పుట్టపర్తి, నార్పల, కొత్తచెరువు, గోరంట్ల మండలాలకు సరఫరా చేద్దామంటే ఏడు మండలాలకు సరఫరా చేసి వారితో సంతకాలు చేయించుకుని వస్తేనే బిల్లులు చేస్తామంటూ విద్యాశాఖ  అధికారులు చెబుతున్నారనీ, అలా వారికి సరఫరా చేశాక వారు సంతకం పెట్టక పోతే రవాణా చార్జీలు నెత్తిన పడతాయన్న ఉద్దేశంతో పెండింగ్‌ పెట్టామంటున్నాడు. కాగా..ప్లేట్ల సరఫరాలో నెలకొన్న రాజకీయం గురించి విద్యాశాఖ అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. కనీసం ఎంఈఓలకు ఫోన్లు చేసి గట్టిగా చెప్పడం లేదు.

ప్లేట్లు సిద్ధంగా ఉన్నాయి
ఏడు మండలాలకు సరఫరా చేసేందుకు భోజనం ప్లేట్లు సిద్ధంగా ఉన్నాయి. బత్తలపల్లి, ధర్మవరం ఎంఈఓలకు రోజూ ఫోన్లు చేస్తున్నాం. వారు స్పందించడం లేదు. విద్యాశాఖ అధికారులేమో అన్ని మండలాలకు సరఫరా చేసిన తర్వాతే సంతకాలు పెడతామంటున్నారు. మేము సరఫరా చేసిన తర్వాత వారు సంతకాలు చేయకపోతే నష్టపోతాం. ఎవరైనా తీసుకోకపోతే విజయవాడకు వెనక్కు పంపాలని టెండరుదారు చెప్పారు. కొద్దిరోజులు చూసి వెనక్కు పంపిస్తాం. – విజయ్‌కుమార్, ట్రాన్స్‌పోర్ట్‌ ప్రతినిధి

ఫిర్యాదు చేస్తే చర్యలు
ఏడు మండలాలకు భోజనం ప్లేట్లు సరఫరా చేయలేదు. టెండరుదారుతో మాట్లాడాం. రెండుమూడు రోజుల్లో అన్ని మండలాలకు సరఫరా చేస్తాం. ప్లేట్లు తీసుకోవాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. ఎవరైనా ప్లేట్లు తీసుకోలేదన్న విషయం ఓరల్‌గా చెబితే కుదరదు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సరఫరా ఏజెన్సీకి చెప్పాం.– దేవరాజు, విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top