నత్తా... నీవే నయం | Corruption in District Health Department | Sakshi
Sakshi News home page

నత్తా... నీవే నయం

Nov 10 2014 4:29 AM | Updated on Sep 22 2018 8:22 PM

ఆలస్యానికి ప్రతీకగా నత్తను చూపిస్తాం.

ఆలస్యానికి ప్రతీకగా నత్తను చూపిస్తాం. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి, అవకతవకలపై దర్యాప్తు చేసిన అధికారులు మాత్రం ‘పాపం నత్తపై నిందలు వేయొద్దు ... ఆ స్థానాన్ని మేం ఆక్రమించుకుంటున్నా’మంటున్నారు. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్న చందంగా జిల్లా అధికారే స్వయంగా అవకతవకలకు పాల్పడితే కింది స్థాయి సిబ్బంది కూడా అందిన కాడికి దోచుకున్న వ్యవహారాలపై చేపట్టిన దర్యాప్తులూ సా...గుతున్నాయి.
 
ఒంగోలు సెంట్రల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో గతంలో జరిగిన అవినీతి, అక్రమాలపై రెండుసార్లు గుంటూరు ఆర్డీ విచారణ నిర్వహించినా చర్యలు తీసుకోవడంలో జాప్యం చోటుచేసుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. డీఎంహెచ్‌వో దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది పాల్పడిన అక్రమాలపై విచారణలు పూర్తయినా చర్యలు మాత్రం కానరావడం లేదు.

నెలల తరబడి జాప్యం చోటుచేసుకుంటుండడంతో ఉరిమి ఉరిమి మంగళంమీద పడ్డట్టుగా అసలు నిందితులు తప్పించుకొని ఎవర్ని బలితీసుకుంటారోనని భయపడుతున్నారు మరికొంతమంది ఉద్యోగులు.డీఎంహెచ్‌వో పదవీ విరమణ చేసినా దర్యాప్తు మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం వెనుక కిం కర్తవ్యమంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

దర్యాప్తు ఇలా..:  ఈ ఏడాది ఏప్రిల్‌లో సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అందజేయాల్సిందిగా రీజినల్ డెరైక్టర్ ఆఫ్ హెల్త్ (ఆర్డీ) షాలినీ దేవిని  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఆ ఆదేశాలతో మే నెల 22న ఒంగోలు వచ్చి విచారణ చేపట్టారు. మళ్లీ అదే నెల 29న వచ్చి  పల్స్‌పోలియో నిధులు సంబంధిత ఇన్‌ఛార్జికి తెలియకుండా రూ.7 లక్షల దుర్వినియోగం చేశారన్న ఆరోపణపై జబ్బార్ ఇన్‌ఛార్జి వైద్యురాలు డాక్టర్ పద్మావతిని విచారించి స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు.

జిల్లాలోని ఎస్పీహెచ్‌ఓలను పిలిపించి కూడా వివరాలు సేకరించారు. వాహనాల బడ్జెట్‌ను మంజూరు చేయాలంటే రూ.12,000 వేలు లంచం అడిగారనే ఆరోపణలపై కూడా రాతపూర్వక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.  వాహనాల ఖర్చులను పర్యవేక్షించే అకౌంట్స్ అధికారి హర్షవర్థన్‌ను, కార్యాలయం పర్యవేక్షణ అధికారిని విచారించారు. వీరందరి వద్దనుంచి రాతపూర్వక ఫిర్యాదులను తీసుకున్నారు.  ఇంత జరిగినా దర్యాప్తు అడుగు మాత్రం ముందుకు పడడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement