ఎంసెట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఎంసెట్ కమిటీ ఈ సారి పలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.
కన్వీనర్ డాక్టర్ రమణ రావు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఎంసెట్ కమిటీ ఈ సారి పలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. దరఖాస్తుల్లో తప్పులు దొర్లినా.. ఆన్‌లైన్‌లోనే సులభంగా వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటి వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన సమయంలో తప్పులు దొర్లితే వాటిని సవరించుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇందుకోసం ఎంసెట్ కార్యాలయానికి రావాల్సి వస్తోంది. అయితే, ఇకపై ఆ అవసరం లేదని, దరఖాస్తుల్లో తప్పులను ఆన్‌లైన్‌లోనే సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణరావు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
- మే 17న నిర్వహించే ఎంసెట్ కోసం వచ్చే నెల 10 నోటిఫికేషన్ జారీ కానుంది.
- 4.20 లక్షల మంది విద్యార్థులు ఈ సారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా.
- ఈ నేపథ్యంలో నకిలీ దరఖాస్తులు, నకిలీ హాల్‌టికెట్లకు చెక్ పెట్టేందుకు బార్‌కోడ్, వాటర్ మార్క్‌ను ప్రవేశపెట్టనున్నారు.
- ఆన్‌లైన్ దరఖాస్తుల్లో తప్పులు దొర్లితే.. నిర్ణీత తేదీల్లో ఆన్‌లైన్‌లోనే సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
- పరీక్ష ఏర్పాట్లపై ఫిబ్రవరి 4న జరిగే సమావేశంలో మరిన్ని అంశాలపై చర్చించనున్నారు.
- ఇంటర్మీడియెట్ సిలబస్ మారినందున.. మారిన సిలబస్ ప్రకారమే ఎంసెట్ పరీక్ష ఉంటుందని కన్వీనర్ రమణరావు తెలిపారు. నోటిఫికేషన్ సందర్భంగా ప్రకటించే సిలబస్ ప్రకారం విద్యార్థులు సన్నద్ధులు కావాలని సూచించారు.