మరో ఇద్దరికి పాజిటివ్‌ 

Coronavirus: Two New Coronavirus Positive Cases In Anantapur District - Sakshi

హిందూపురం: కరోనా కట్టడిలో భాగంగా ఇకపై ఎలాంటి కారణం లేకుండా బయట తిరిగే వారిని నేరుగా క్వారంటైన్‌కు తరలించేదిశగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్, ఎస్పీ సత్యయేసుబాబులు తెలిపారు. ఆదివారం కలెక్టర్, ఎస్పీలతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ ఢిల్లీరావు హిందూపురం మున్సిపల్‌ కార్యాలయంలో కోవిడ్‌ –19 పై నోడల్‌ అధికారులు, వైద్యాధికారులు, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన వారికి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 7 మందిని ట్రేస్‌ చేస్తే జిల్లాలో 24 నుంచి 25 మందిని ట్రేస్‌ చేస్తున్నామన్నారు. సెకండరీ కాంటాక్ట్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 10 మందిని ట్రేస్‌ చేస్తే, జిల్లాలో 19 మందిని ట్రేస్‌ చేసి నమూనాలు తీసుకుని పరీక్షలు చేస్తున్నామన్నారు. ఏ ఒక్కరు మిస్‌ కాకుండా చూస్తున్నామని తెలిపారు. ఒక్కటి మిస్‌ అయినా రోజుకు 12 మందికి కరోనా వైరస్‌ వ్యాప్తిచెందే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటి వరకు పాజిటివ్‌ వచ్చిన వారికి సంబంధించి 70 శాతం మేర కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ పూర్తిచేశామన్నారు.  

‘పురం’పై ప్రత్యేక దృష్టి.. 
జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో హిందూపురంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు కలెక్టర్‌ తెలిపారు. హిందూపురంలో పాజిటివ్‌ కేసులకు సంబంధించి ఏ ఒక్క కాంటాక్ట్‌ మిస్‌ కాకుండా సర్వేచేస్తూ ప్రతిఒక్కరి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నవారికి రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని అందించాలన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న ముస్లింలకు రంజాన్‌ మాసం సందర్భంగా డ్రై ఫ్రూట్స్, పండ్లను అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.  

ముతవల్లి, మౌజమ్, పాస్టర్, పూజారులకు రూ.5 వేలు.. 
వక్ఫ్‌బోర్డు పరిధిలోని మసీదుల్లోని మౌజమ్, ముతవల్లిలతో పాటు చర్చిలలో పనిచేసే పాస్టర్లు , ఎండోమెంట్‌ పరిధిలో లేని, రూ.5 వేల కంటే తక్కువ జీతం పొందే దేవాలయ పూజారులకు ప్రభుత్వం తరఫున రూ.5 వేలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ చెప్పారు. 

రెడ్‌జోన్లలో పనిచేసే వారికి పీపీఈ కిట్లు.. 
హిందూపురంలోని రెడ్‌జోన్లలో పనిచేసే పోలీసు, రెవెన్యూ, వైద్య బృందం సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి అవసరమైన 6 వేల పీపీఈ  కిట్లు, 4 వేల మాసు్కలు, 3 వేల శానిటైజర్లు, 4 వేల గ్లౌజులను ఇవ్వాలని హిందూపురం మున్సిపల్‌ కమిషనర్, తహసీల్దార్, సీఐలకు కలెక్టర్‌ గంధం చంద్రుడు అందజేశారు. సమావేశంలో పెనుకొండ సబ్‌కలెక్టర్‌ నిషాంతి, డీఎఫ్‌ఓ జగన్నాథ్‌సింగ్, ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ చైతన్య, కోవిడ్‌ 19 నోడల్‌ అధికారులు, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

ర్యాపిడ్‌ కిట్లతో పోలీసులకు పరీక్షలు 
రెడ్‌జోన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ర్యాపిడ్‌ కిట్ల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించనున్నట్లు డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు. అలాగే రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ప్రజలెవరూ సంచరించకుండా కఠిన ఆంక్షలు విధించామన్నారు. ఈక్రమంలో డబ్బు కోసం ఇబ్బందులు పడకుండా మొబైల్‌ ఏటీఏం ద్వారా నగదును పొందే అవకాశాన్ని ఏర్పాటు చేశారు.

రెడ్‌జోన్‌లో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ 
హిందూపురం‌: పట్టణంలో రెడ్‌జోన్‌ ప్రాంతమైన ముక్కిడిపేటను కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబు, జేసీ డిల్లీరావులు ఆదివారం పర్యటించారు. కోవిడ్‌ నియంత్రణ చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన రూ.100 విలువ చేసే 120 పండ్ల కిట్లను ఆ ప్రాంత ప్రజలకు అధికారులు పంపిణీ చేశారు.   

మరో ఇద్దరి పాజిటివ్‌
అనంతపురం‌: సర్వజనాస్పత్రిలోని ఇద్దరు వైద్య సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల  సంఖ్య 53కు చేరినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. కాగా వీరిలో నలుగురు మృత్యువాత పడగా...14 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 35 పాజిటివ్‌ కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. 

సేవలందించే క్రమంలో.. 
కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు వైద్య సేవలందించే క్రమంలో ఆస్పత్రిలోని ఇద్దరు సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. నగరంలోని సాయినగర్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ 17వ కాంటాక్ట్‌తో సన్నిహితంగా ఉండటం కారణంగా కరోనా బారినపడ్డారు. అలాగే అంబేడ్కర్‌నగర్‌కు చెందిన 24 ఏళ్ల వ్యక్తికి కోవిడ్‌ సోకింది. ఇతను 46వ కాంటాక్ట్‌ కామారుపల్లికి చెందిన 28 ఏళ్ల వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో వైరస్‌ సోకింది. ఆస్పత్రిలోని సిబ్బందికి వైరస్‌ సోకుతుండటంతో వైద్యులు, స్టాఫ్‌నర్సులు, సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులకు కాంటాక్ట్‌లో ఉన్న వారు హోం ఐసోలేషన్, క్వారన్‌టైన్‌కు వెళ్లిన విషయం విధితమే. కొత్తగా నమోదైన వారితో సన్నిహితంగా ఉన్న వారు కూడా క్వారన్‌టైన్‌కు వెళ్లే పరిస్థితి నెలకొంది. కరోనా బారిన పడ్డ వీరిద్దరిని బత్తలపల్లి ఆర్డీటీ హాస్పిటల్‌కు తరలించారు.  

కంటైన్మెంట్‌ జోన్‌ .. 
తాజాగా పాజిటివ్‌ కేసులు నమోదైన నగరంలోని సాయినగర్, అంబేడ్కర్‌నగర్లలో అధికారులు కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. వంద మీటర్ల వరకు ఎవరూ బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.   

రెడ్‌జోన్‌లో కమిషనర్‌ పర్యటన 
అనంతపురం సెంట్రల్‌: నగరంలో రెడ్‌జోన్‌ ప్రాంతమైన అంబేద్కర్‌నగర్‌లో నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రశాంతి పర్యటించారు. కరోనా బారిన పడిన బాధితుల కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు రావద్దని సూచించారు. చికెన్, మటన్‌ దుకాణాలను పరిశీలించి, శానిటైజర్, గ్లౌజులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే దుకాణం మూసివేస్తామని హెచ్చరించారు. అనంతరం బిందెల వారి కాలనీకి వెళ్లి అక్కడ జరుగుతున్న స్ప్రేయింగ్‌ పనులను పరిశీలించారు.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top