రాజ్యాధికారం కావాలి | Constituent needs | Sakshi
Sakshi News home page

రాజ్యాధికారం కావాలి

Oct 12 2013 3:12 AM | Updated on Oct 8 2018 5:04 PM

తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంలో దళిత బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర కోచైర్మన్, ప్రజాగాయని విమలక్క అన్నారు.

 కొడంగల్, న్యూస్‌లైన్: తెలంగాణ   ప్రత్యేకరాష్ట్రంలో దళిత బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని తెలంగాణ  యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర కోచైర్మన్, ప్రజాగాయని విమలక్క అన్నారు. శుక్రవారం కొడంగల్ పట్టణంలో నిర్వహించిన బహుజనుల బతుకమ్మ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లోనూ వెనకబడిన ఈ ప్రాంత ప్రజలకు నిండైన తెలంగాణ రావాలని కోరారు.
 
 ఇది బంగారు బతుకమ్మ కాదని పేద బహుజనుల బతుకమ్మ అని పేర్కొన్నారు. శ్రమజీవులు ఏకమై చేసుకునే పేదల పండుగగా అభివర్ణించారు. పితృస్వామ్యం నుంచి మాతృస్వామ్యం వైపు అడుగులు వేయడమే బతుకమ్మ పండుగ ఉద్దేశమన్నారు. మట్టి, నీటితో అనుబంధం ఉన్న బతుకమ్మ పండుగను కొందరు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. చెరువులు, కుంటలు అన్యాక్రాంతం చేశారని దుయ్యబట్టారు. ప్రకృతిలో పూచే పూలు కూడా పేదలకు దక్కకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ  నవ నిర్మాణంలో బహుజనులకు సామాజిక న్యాయం దక్కాలన్నారు. ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు ఆరాట పడుతున్నాడని, అందుకే ఢిల్లీలో దీక్ష చేస్తున్నాడని ఆరోపించారు.
 
 సీమాంధ్ర పెట్టుబడిదారులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల నుంచి తెలంగాణ కు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రాంతంలో పుట్టిన తెలంగాణ ఆడపడుచులు ఇంకెన్నాళ్లు బానిసలుగా బతుకాలని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టిని, నేలను, భూమిని నమ్ముకున్న ఈ ప్రాంత ప్రజలకు వారి హక్కులను కాపాడుకునే అధికారం రావాలని ఆకాంక్షించారు. నవ తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధికారం దక్కించుకుకోడానికి సమష్టి పోరాటం చేయాలని విమలక్క పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణావాదులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement