లక్కీగా ‘హస్తం’‘ఛాన్స్‌’

Congress Situation In AP - Sakshi

అప్పారావు: ఏందిరో సుబ్బారావు ఏదో ఆలోచనలో పడ్డావ్‌.
సుబ్బారావు: ఏం లేదురా! ఏ పనీపాటా లేదని ఇంట్లో వాళ్లు రోజూ తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ఏదైనా పనిలో చేరదామని ఆలోచిస్తున్నారా. ఏం చేయమంటావ్‌!
అప్పారావు: ఓ పనిచేయరా. రాజకీయాల్లోకి వస్తావా!
సుబ్బారావు: ఏం రా. ఎగతాళి చేస్తున్నావా. రాజకీయాల్లోకి మనలాంటోళ్లని ఎవర్రానిస్తారా..!
అప్పారావు: ఒరేయ్‌ పిచ్చి సుబ్బిగా అది ఒకప్పుడ్రా. ఇప్పుడు సీట్లిస్తాం బాబూ...పోటీ చేయండంటూ బోలేడు పార్టీలొస్తున్నాయిరా. 
సుబ్బారావు: అవున్లేరా. చిన్నా చితకా పార్టీలు...ఊరూ పేరూ లేని పార్టీలు తరఫున నిలబడితే మన ఓట్లు మనకే పడవు కదరా.
అప్పారావు: అరే వెర్రివెంగళప్పా. ఊరు...పేరు లేని పార్టీలు కాదురా. వందేళ్లపైగా చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తావా.!
సుబ్బారావు: ఒరేయ్‌ మరీ వెర్రోడ్ని సేయమాకు. దేశాన్ని ఏకధాటిగా పాలించిన కాంగ్రెస్‌ మనలాంటోళ్లకి సీట్లిచ్చిద్దా...చెవిలో పూలు పెట్టమాకురా.!
అప్పారావు: సుబ్బిగా నేను చెబుతుంది నిజంరా. రాష్ట్రాన్ని చీల్చిందని ఆపార్టీలో ఉన్న చిన్నా..పెద్దా.. తేడా లేకుండా అందరూ ఖాళీ చేసి వెళ్లారు. ఉన్న నాయకులను ఆపార్టీ తరఫున పోటీచేయమని అడిగితే ఇప్పుడే వస్తామని మళ్లీ కనిపించడం లేదంటా.
సుబ్బారావు: ప్చ్‌..కాంగ్రెస్‌కు అంత పరిస్థితా..! అయితే మనం అడిగితే సీటిస్తారంటావా..!
అప్పారావు: అడక్కుండా ఇస్తున్నారు. ఒకసారి ప్రయత్నిద్దామా..! ఏందీ.
సుబ్బారావు: ఎన్నికల్లో నిలబడాలంటే డబ్బు కావాలి కదరా..! ఎలా కుదురుతుంది.
అప్పారావు: ఒరేయ్‌ పిచ్చి మొఖమా...కాంగ్రెస్‌ పార్టీ జాతీయపార్టీ...పైగా డబ్బున్న పార్టీ. పార్టీ ఫండ్‌ కింద మూడు, నాలుగు కోట్లిస్తుంది. అందులో సగం ఖర్చు పెట్టినా మిగిలిన సగంతో ఎంచక్కా బతికిపోవచ్చు.
సుబ్బారావు: అయితే నేను నిలబడతారా. 
అప్పారావు: ఒరేయ్‌ అప్పిగా నువ్వు కూడా నాకుమాదిరిగానే పనీపాట లేకుండా ఖాళీగా ఉన్నావ్‌గా. నువ్వు కూడా ఏదో నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యరా... అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ సీట్లు ఖాళీగా ఉన్నాయంటున్నావుగా....అదే మాదిరిగా మన ఆవారా బ్యాచ్‌గాళ్లకు కూడా చెప్పు పోటీ చెయ్యమని!
–సాక్షి, చీరాల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top