
ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీచేయని రిజిస్టర్డ్ పార్టీలపై ఈసీ చర్య
దేశవ్యాప్తంగా 474 పార్టీలను జాబితా నుంచి తొలగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన 9 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలను పార్టీల జాబితా నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. వాటిలో ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజాపార్టీ, లోక్‌సత్తా, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీలున్నాయి.
దేశ వ్యాప్తంగా 474 పార్టీలను జాబితా నుంచి తొలగించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వరుసగా 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేయని గుర్తింపు లేని పార్టీలను రిజిస్టర్ నుంచి తొలగించాల్సి ఉంటుంది. 2019 నుంచి ఎన్నికల్లో పాల్గొనని రాజకీయ పార్టీలపై ఈసీ విచారణ జరిపింది. సంబంధిత రాష్ట్రా ల ఎన్నికల ప్రధాన అధికారులు (సీఈఓ) ఆయా పార్టీల ప్రతినిధులను పిలిపించి సంజాయిషీ కోరారు.
ఆ తర్వాత ఆయా పార్టీలను రిజిస్టర్ నుంచి తొలగించారు. దీంతో వాటి రిజిస్ట్రేషన్ రద్దయ్యిందని ఎన్నికల సంఘం కార్యదర్శి అశ్వనీ కుమార్ మోహల్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పీల్ చేసుకోవడానికి ఆ పార్టీలకు నెల రోజుల గడువు ఇచ్చారు. జాబితా నుంచి తొలగించిన పార్టీలకు ఇకపై విరాళాల సేకరణ, ఆదాయ పన్ను మినహాయింపు, ఉమ్మడి ఎన్నికల చిహ్నం, స్టార్ క్యాంపెయినర్ తదితర సదుపాయాలు లభించవు.
మరో 10 పార్టీలకు నోటీసులు
గత మూడు ఆర్థిక సంవత్సరాల ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వార్షిక ఆడిట్ నివేదికలతో పాటు గతంలో పోటీ చేసిన ఎన్నికల్లో చేసిన వ్యయాలకు సంబంధించిన నివేదికలను గడువులోగా సమర్పించలేకపోయిన మరో 10 గుర్తింపు లేని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 10లోగా వివరణ ఇవ్వాలని కోరింది.
నోటీసులు అందుకున్న పార్టీల్లో బహుజన రాష్ట్రమ్ సమితి (హైదరాబాద్), ఇండియన్ రక్షక నాయకుడు పార్టీ (నారాయణపేట), జైమహాభారత్ పార్టీ (జో గుళాంబ గద్వాల్), జై స్వరాజ్ పార్టీ (రంగారెడ్డి), మజ్లిస్ మార్కజ్–ఏ–సియాసీ పార్టీ (హైదరాబాద్), నవప్రజారాజ్యం పార్టీ (ఆ ది లాబాద్), న్యూ ఇండియా పార్టీ (పెద్దపల్లి), ప్రజా స్వరాజ్ పార్టీ (రంగారెడ్డి), శ్రమజీవి పార్టీ (మేడ్చల్–మల్కాజిగిరి), తెలంగాణ ఇంటి పార్టీ (నల్లగొండ) ఉన్నాయి.