పాపం.. కవిత

The Condition Of A Pregnant Woman Is Serious - Sakshi

పండంటి బిడ్డకు జన్మనిచ్చి మృత్యువుతో పోరాటం 

వైద్యం కోసం అప్పులు.. స్నేహితుల సాయం 

కవితను కాపాడుకోలేక దుఃఖసాగరంలో కుటుంబం 

ఏడాది క్రితం గూడూరుకు చెందిన సునీల్, కవితలకు వివాహమైంది.. కవిత నవమాసాలు నిండి ప్రసవానికి ముందుగా ఆమెకు ఫిట్స్‌ రావడంతో ఆస్పత్రిలో చేరింది.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. అయితే మళ్లీ ఫిట్స్‌ రావడంతో వైద్యులు పరీక్షించారు.. తలలో రక్తం గడ్డ కట్టిందని, వైద్యం చేయాలంటే రూ.10 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో నిరుపేదలైన ఆ కుటుంబానికి ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పడంతో అప్పు చేసి కొంత, స్నేహితుల సాయంతో మరికొంత నగదు సమకూర్చి వైద్యం చేయించారు.. ఇంకా నగదు అవసరమై వైద్యం కోసం ఎదురుచూస్తున్న కవిత గత 10 రోజులుగా మృత్యువుతో పోరాడుతోంది. 

సాక్షి, గూడూరు: గూడూరు పట్టణంలోని కటకరాజవీధిలో అన్నం నాగమణి, సురేష్‌ దంపతులు జీవిస్తున్నారు. వారికి గాంధీ, సునీల్‌ అనే ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు గాంధీ పూర్తిగా మానసిక, శారీరక దివ్యాంగుడు. భర్త సురేష్‌ 2002లో అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో నాగమణి అన్నీతానైనే కుటుంబాన్ని పోషిస్తోంది. సునీల్‌ 10వ తరగతి వరకూ చదువుకుని గత మూడేళ్లుగా ఒక ఆటో మొబైల్‌ కంపెనీలో మెకానిక్‌ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. సునీల్‌కు 2018 జూన్‌ 25న నాయుడుపేట మండలం కాపులూరు గ్రామానికి చెందిన కవితతో వివాహమైంది. కవిత గర్భవతై నవమాసాలు నిండాయి. ఈ నెల 2వ తేదీ ఉన్నట్లుండి ఆమెకు ఫిట్స్‌ వచ్చాయి. హుటాహుటిన స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా కుమారుడు జన్మించాడు. 5వ తేదీన కవితకు మళ్లీ ఫిట్స్‌ రావడంతో వైద్యులు ఎమ్మారై తీయాలని సూచించారు.

దీంతో ఆమెను గూడూరుకు తీసుకెళ్లి ఎమ్మారై తీయించగా తలలో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించగా వైద్యులు అదేరోజు రాత్రి ఇక మేమేం చేయలేం తీసుకెళ్లండని చెప్పారు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక వారు అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు దీనికి ఆరోగ్యశ్రీ వర్తించదని, వెంటనే రూ.50 వేలు చెల్లిస్తే వైద్యం ప్రారంభిస్తామని, అయినా గ్యారంటీ లేదని తెలిపారు. చేతిలో చిల్లిగవ్వలేని ఆ కుటుంబం ఏం చేయాలో తెలీక అప్పులు చేసి, సునీల్‌ స్నేహితులు అందజేసిన మొత్తంతో ఇప్పటివరకూ రూ.2.50 లక్షలు ఖర్చు చేసి వైద్యం అందించారు. అయినా రూ.10 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆ మొత్తం వారి వద్ద లేక.. రూ.లక్షలు తీసుకొచ్చి వైద్యం చేయించలేక.. కవితను ఎలా కాపాడుకోవాలో తెలీక.. అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు సహకరించాలని వేడుకుంటున్నారు. సాయం చేయదలచిన వారు 8186810313(నాగమణి) ఫోన్‌నంబర్‌లో సంప్రదించాలని కోరారు.     

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top