రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్ శనివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై వామపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. గవర్నర్‌తో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను చెప్పించారని ధ్వజమెత్తాయి.
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్ శనివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై వామపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. గవర్నర్‌తో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను చెప్పించారని ధ్వజమెత్తాయి. విభజన నేపథ్యంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఏ సమస్యకూ పరిష్కారం చూపకపోవడాన్ని ఆక్షేపించాయి. విభజన సమయంలో కేంద్రం ప్రకటించిన పథకాలను, నిధుల్ని రాబట్టడంలో ప్రభుత్వ దివాళాకోరుతనం కొట్టొచ్చినట్టు కనిపించిందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు వేర్వేరు ప్రకటనల్లో విరుచుకుపడ్డాయి. మరో మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇంత హడావిడిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించాలని డిమాండ్ చేశాయి.
ఇదో కొత్త పల్లవా?
ఇటీవలి వరకు 2020 అని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 2050 విజన్ అంటున్నారని, సమస్యలకు పరిష్కారం చూపి ఆ తర్వాత 2050 గురించి ఆలోచించాలని సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదా సాధించే తీరేనా ఇది..
రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక హోదా సాధన వ్యవహారంలో ప్రభుత్వ తీరును సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. కనీసం నోరు విప్పి కేంద్రాన్ని అడిగే ధైర్యం కూడా లేదా? అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే ఆత్మగౌరవమా? అని నిప్పులు చెరిగారు.