సుప్రీం నోటిఫై చేసేవరకు ఉమ్మడి హైకోర్టే | Sakshi
Sakshi News home page

సుప్రీం నోటిఫై చేసేవరకు ఉమ్మడి హైకోర్టే

Published Thu, Nov 13 2014 2:07 AM

సుప్రీం నోటిఫై చేసేవరకు ఉమ్మడి హైకోర్టే - Sakshi

సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజనను సుప్రీంకోర్టు నోటిఫై చేసే వరకు ఉమ్మడి న్యాయస్థానంగానే కొనసాగుతుందని హైకోర్టు బుధవారం స్పష్టంచేసింది. ఉమ్మడి హైకోర్టుకు అప్పటి వరకు రెండు రాష్ట్రాలపై న్యాయపరిధి ఉంటుందని, ఇరు రాష్ట్రాల కేసులను విచారిస్తుందని తేల్చి చెప్పింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులెవరూ తిరిగి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేసులను విచారించే న్యాయ పరిధిపై సింగిల్ జడ్జి జస్టిస్ నరసింహారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. అంతేకాక న్యాయమూర్తులు తిరిగి ప్రమాణం చేసే విషయంలోనూ ధర్మసందేహం లేవనెత్తారు. దీనిపై ఆయన కేంద్రప్రభుత్వ వివరణను సైతం కోరారు.

ఈ విషయాన్ని ఓ న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీంతో ధర్మాసనం ఈ కేసును జస్టిస్ నరసింహారెడ్డి వద్ద నుంచి తమ బెంచ్‌కు బదిలీ చేసుకుని విచారణ చేపట్టింది. సుదీర్ఘ వాదనల అనంతరం బుధవారం తీర్పు వెలువరించింది.
 

Advertisement
Advertisement