పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా కిమ్స్‌ సవీరా

Collector Gandham Chandrudu Identify Six Corona Hospitals In Anantapur District - Sakshi

అనంతపురం: జిల్లాలోని ఆరు ఆస్పత్రులను కోవిడ్‌ లైన్‌ ఆస్పత్రులుగా గుర్తించినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. కిమ్స్‌–సవీరా ఆస్పత్రిని ఇక నుంచి పూర్తి స్థాయి కోవిడ్‌ ఆస్పత్రిగా మార్పు చేసినట్లు వెల్లడించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. సవీరాతో పాటు మరో ఐదు ఆస్పత్రులను లైన్‌ ఆస్పత్రులుగా ఏర్పాటు చేశామన్నారు. శాంపిల్స్‌ సేకరణకు జిల్లాలో 18 మొబైల్‌ వ్యాన్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శాంపిల్స్‌ టెస్టింగ్‌ సామర్థ్యం రోజుకు 300కు పెంచామన్నారు. పర్యవేక్షణకు జేసీని నోడల్‌ అధికారిగా నియమించినట్లు వెల్లడించారు. ఆరు లైన్‌ ఆస్పత్రుల్లో 723 పడకలు అందుబాటులో ఉంటాయన్నారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో సీరియస్‌గా ఉన్నవాటిని సవీరాకు పంపుతారనీ, లైన్‌–2 ఆస్పత్రిగా ఉన్న బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి నాన్‌ సీరియస్‌ పాజిటివ్‌ కేసులను పంపిస్తామన్నారు.

ఇక లైన్‌–3 ఆస్పత్రిగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి, లైన్‌–4 ఆస్పత్రిగా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి, లైన్‌–5 ఆస్పత్రిగా వైఎస్సార్‌ మెమోరియల్‌ ఆస్పత్రి, లైన్‌–6 ఆస్పత్రిగా చంద్ర సూపర్‌ స్పెషాలిటీ ఉంటాయన్నారు. శాంపిల్స్‌ సేకరణ, టెస్టింగ్‌ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో రక్షణ సామగ్రిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం 7,073 పీపీఈ కిట్లు, 1,700 ఎన్‌–95 మాస్‌్కలు, 71 వేల సర్జికల్‌ మాస్కులు, 1.75 లక్షల గ్లౌజ్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. అనంతరం కోవిడ్‌ కేసుల అంశంపై కలెక్టర్‌ కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ డిల్లీరావుతో కలిసి జిల్లా, డివిజన్, మండల స్థాయి, మునిసిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారి శాంపిల్స్‌ తీయడంతో పాటు, వారందరినీ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని సూచించారు.

రైల్వే ఐసోలేషన్‌ బోగీల పరిశీలన.. 
గుంతకల్లు: గుంతకల్లు రైల్వే ఆస్పత్రి, జంక్షన్‌లోని 5వ నంబర్‌ ప్లాట్‌ఫారంలోని ఐసోలేషన్‌ బోగీలను, రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లోని క్వారంటైన్‌ సెంటర్లను కలెక్టర్‌ గంధం చంద్రుడు పరిశీలించారు. రైల్వే డీఆర్‌ఎం అలోక్‌ తివారీని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top