జాగ్రత్తలు పాటించండి

Collector Gandham Chandrudu Appealed To The People To Follow The Lockdown - Sakshi

కోవిడ్‌ను సమష్టిగా ఎదుర్కొందాం

జిల్లాస్థాయిలో సవీరా ఆస్పత్రికి ప్రత్యేక గుర్తింపు 

మేమంతా మీ కోసం శ్రమిస్తున్నాం 

జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ మూల్యం తప్పదు 

ఇంటిలోంచి బయటకు రాకండి 

ప్రజలకు కలెక్టర్‌ గంధం చంద్రుడు విజ్ఞప్తి 

అనంతపురం అర్బన్‌: ‘‘జిల్లాలో కోవిడ్‌(కరోనా వైరస్‌)కు అడ్డుకట్ట వేసే దిశగా పటిష్ట చర్యలు చేపట్టాం. జిల్లాస్థాయిలో సవీరా ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా గుర్తింపు ఇచ్చాం. లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతోంది. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తున్నాం. మేమంతా మీ కోసం శ్రమిస్తున్నాం. ఇటలీ, స్పెయిన్‌లో ఏమయ్యిందో చూస్తున్నాం. జాగ్రత్తలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చేతులెత్తి మొక్కి మిమ్మల్ని వేడుకుంటున్నా. జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి.’’ అంటూ కలెక్టర్‌ గంధం చంద్రుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన స్థానిక కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఓపెన్‌ ఆడిటోరియంలో విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

 అత్యవసర సేవలకు అంతరాయం లేదు 
లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన మొదటి రోజుల్లో ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ను ప్రజలు బాగా పాటిస్తున్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నాం. నగరంలో 8 చోట్ల అదనంగా కాయగూరల మార్కెట్‌లు ఏర్పాటు చేశాం. మార్కెట్లకు వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నాం. పండ్లు, కాయగూరలు, నిత్యావసర సరకులు చేరవేసే వాహనాలకు అనుమతిస్తున్నాం. ఆ వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చాం. 

మాస్క్‌లు సిద్ధం చేయిస్తున్నాం 
మాస్క్‌ల కొరత లేకుండా చర్యలు చేపట్టాం.  ఎన్‌95 మాస్క్‌లు కావాలని కొందరు అడుగుతున్నారు. వాస్తవంగా వీటిని రోగికి చికిత్స అందించే వైద్యులు, సిబ్బంది, దగ్గు, జలుబు, ఇతర రుగ్మతలు ఉన్నవారు వాడాలి. ఆరోగ్యవంతులు మాస్క్‌ వాడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మామూలు మాస్క్‌ వాడితే సరిపోతుంది. ఎస్‌జీఓ, ఎస్‌హెచ్‌జీ, ఆర్‌డీటీ ద్వారా బట్ట మాస్క్‌లు సిద్ధం చేయిస్తున్నాం. 

‘సవేరా’కు కోవిడ్‌ ఆస్పత్రిగా గుర్తింపు 
జిల్లాస్థాయిలో సవేరా ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా గుర్తించాం. జిల్లాలో నాలుగు వేల మంది ఆర్‌ఎంపీలు ఉన్నారు. వీరి సేవలను అవసరమైనప్పుడు వినియోగించుకునేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపాం. 14 నియోజకవర్గాల పరిధిలో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 686 గదుల్లో 1,951 పడకలు ఏర్పాటు చేయించాం. ప్రతి కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారి, ఒక వైద్యాధికారి, ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారు. మక్కా నుంచి 30 మంది హిందూపురం వచ్చారు. వారిని హిందూపురం క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచి పరీక్షలు నిర్వహించాం. కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించలేదు. కియా పరిశ్రమకు చెందిన 54 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. 

నిరాశ్రయులకు వసతి సదుపాయం 
నగరంలో 163 మంది నిరాశ్రయులను గుర్తించాం. మూడు నైట్‌ షెల్టర్లను గుర్తించి అక్కడికి చేర్చాం. స్వచ్ఛందసంస్థలతో చర్చించి వారికి భోజన వసతి ఏర్పాటు చేశాం. అదే విధంగా వారికి రెండు జతల దుస్తులు, టవల్‌ వంటివి అందించేందుకు చర్యలు తీసుకున్నాం. కోవిడ్‌ వ్యాప్తి నిరోధానికి చేపడుతున్న చర్యల్లో స్వచ్ఛంద సంస్థలను (ఎన్‌జీఓ) భాగస్వాములను చేయాలని నిర్ణయించాం. క్రియాశీలంగా ఉండే 28 ఎన్‌జీఓలను గుర్తించాము. వాటి స్తోమతకు తగ్గట్టుగా భాగస్వామ్యం కల్పిస్తున్నాం. 

వలస కూలీలపై ప్రత్యేక దృష్టి 
జీవనోపాధి కోసం రాయదుర్గం, కదిరి ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు కూలీలు వలస వెళ్లారు. లాక్‌డౌన్‌ నేపథ్యం వారంతా తిరిగి వచ్చారు. ఇలా తిరిగి వచ్చిన 373 మంది వలస కూలీలను గుర్తించాం. వారందరినీ స్టే ఎట్‌ హోమ్‌ నోటీసు ఇచ్చాం. 28 రోజుల పాటు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకున్నాం.

 విదేశాల నుంచి వచ్చిన వారు 1,014 మంది 
విదేశాల నుంచి 1,014 మంది జిల్లాకు వచ్చినట్లు గుర్తించాం. వీరిలో 957 మందిని ట్రేస్‌ ఔట్‌ చేశాం. మిగిలిన 57 మందిని గుర్తించాల్సించాలి ఉంది. 957 మందికి స్టే ఎట్‌ హోమ్‌ నోటీసు ఇచ్చాం. వీరిలో 167 మంది 28 రోజుల హోమ్‌ ఐసోలేషన్‌ పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారిలో కొందరు 14 రోజుల్లోపు, మరికొందరు 14 నుంచి 28 రోజుల్లోపు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించేందుకు ఒక్కొక్కరి వద్ద ఒక ఏఎన్‌ఎం అందుబాటులో ఉంచాం.  ప్రతి కుటుంబానికి ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేశాం. 

వైద్య కళాశాలలో లేబొరేటరీ 
ప్రభుత్వ వైద్య కళాశాలలో కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించేందుకు టెస్టింగ్‌ లేబొరేటరీ ఏర్పాటు చేశాం. ఇక్కడ అనంతపురం, కర్నూలు జిల్లా నుంచి వచ్చే శాంపిల్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం తిరుపతి స్విమ్స్, పూణే కేంద్రాలకు పంపిస్తారు. పరిశీలన అనంతరం గుర్తించిన పాజిటివ్‌ లేదా నెగిటివ్‌ కేసులను అధికారికంగా రాష్ట్రస్థాయికి తెలియజేస్తారు. అక్కడి అధికారులు ప్రత్యేక వైద్య బులిటెన్‌ను విడుదల చేస్తారు. 

వార్డు వలంటీర్ల ద్వారా సర్వే 
జిల్లాలో 20వేల మంది గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయిస్తున్నాం. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని వారు పరిశీలిస్తున్నారు. సమాచారాన్ని ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి పంపుతున్నారు. జాగ్రత్తల గురించి విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు ఈనెల 31 వరకు సరిపడా సరుకుల పంపిణీ చేయించాం. ఏప్రిల్‌ ఒకటి నుంచి 14 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున మరోసారి వారందరికీ అంగన్‌వాడీ సిబ్బంది, మహిళ పోలీసు వెళ్లి సరుకులు అందజేస్తారు.  

ఉద్యాన పంటల ఎగుమతికి చర్యలు 
జిల్లాలో పండిన ఉద్యాన పంటలు యూపీ, ఎంపీ, తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎగుమతి నిలిచిపోయింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శితో మాట్లాడాను. ఉద్యాన పంటల ఎగుమతికి సంబంధించి అంతర్‌రాష్ట్ర రవాణాకు అనుమతి ఇవ్వాలని కోరాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top