‘ప్రతి పార్లమెంటు స్థానానికి ఒక బోధనాసుపత్రి’

CM YS Jagan Says District Hospitals Will Serve As Medical Colleges - Sakshi

ఆస్పత్రుల్లో నాడు-నేడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: జిల్లా ఆస్పత్రులను బోధనాసుపత్రులుగా మార్చడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తద్వారా సిబ్బంది కొరత తీరే అవకాశాలుంటాయని, సరిపడా సీట్లు అందుబాటులోకి వస్తాయని సీఎం పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్‌సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, హెల్త్‌కార్డుల జారీపై సీఎం వైఎస్‌ జగన్‌ సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఉండేలా చూడాలని అన్నారు. నూతనంగా ఏర్పటయ్యే బోధనాసుపత్రులు స్వయంశక్తితో నడిచేలా ఆలోచన చేయాలని సీఎం సూచించారు.
(చదవండి : ‘గోదావరి–కృష్ణా’ అనుసంధానంతో సస్యశ్యామలం)

అయితే, 9 చోట్ల బోధనాసుపత్రులు పెట్టేందుకు అవకాశాలున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 4 నుంచి 5 ఆస్పత్రుల్లో వెంటనే ఈ ప్రతిపాదనను అమలు చేయవచ్చని పేర్కొన్నారు. ఇదిలావుండగా.. కాన్పు చేసే క్రమంలో అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేవారు. సిజేరియన్‌ లేకుండా సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని అన్నారు. ఈ మేరకు వైద్యులకు సూచనలు చేయడంతోపాటు.. గర్భిణులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సమీక్షా కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
(చదవండి : సీఎం జగన్‌ను కలిసిన రాజధాని రైతులు)

మూడు ప్రాంతాల్లో యూనివర్సిటీలు..
రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా ఏర్పాటు చేసుకుని సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. కర్నూలు–కడప–అనంతపురం, ప్రకాశం–నెల్లూరు– చిత్తూరు, కృష్ణా–గుంటూరు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జోన్లవారీగా సంబంధిత కాలేజీల్లో సూపర్‌స్పెషాల్టీ కోర్సులపై దృష్టిపెట్టాలని అన్నారు. వీటిని పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ మూడు మెడికల్‌ యూనివర్శిటీల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఏడాది మే నెల నాటికి వైద్యారోగ్యశాఖలో సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపి (గుడ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌) ప్రమాణాలతో కూడిన మందులు పంపిణీకి చేయాలని సీఎం ఆదేశించారు.

నాడు – నేడులో చేపట్టే పనులు..

ఆరోగ్య ఉపకేంద్రాల (సబ్‌సెంటర్లు) నిర్మాణంపై జరగిన సమీక్షలో.. నాడు– నేడులో చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు.

  • 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 169 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో అభివృద్ధి పనులు, కొన్నిచోట్ల కొత్తగా నిర్మాణాలు
  • 11 మెడికల్‌ కాలేజీలు, 6 బోధనాసుపత్రులు, 13 జిల్లా ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు
  • కొత్తగా 7 మెడికల్‌ కాలేజీలలు, 8 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, 1 క్యాన్సర్‌ ఆస్పత్రి, 7 నర్సింగ్‌ కాలేజీలు
  • ప్రస్తుతం ఉన్న 11 కాలేజీలకు అదనంగా ప్రతిపాదిస్తున్న కాలేజీలతో కలిపి 27 నుంచి 28 కాలేజీలు అవుతాయని సీఎం అన్నారు.

ఫిబ్రవరి 17 నుంచి మూడో విడత కంటి వెలుగు
మూడో విడత కంటి వెలుగు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానుంది. అవ్వా తాతలకు వైద్య కంటి నిపుణులు స్క్రీనింగ్‌ చేయనున్నారు. దాదాపు 10 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరమవుతాయని అంచనా వేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఆపరేషన్లు ఎక్కువగా ఉన్నందున ఈ దఫా కంటివెలుగు జూలై వరకు కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.

మార్చి 15 కల్లా అందరికీ హెల్త్‌ కార్డులు..
మార్చి 15 కల్లా అందరికీ హెల్త్‌కార్డులు జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. డయాబెటీస్, హైపర్‌ టెన్షన్, క్యాన్సర్, టీబీ, లెప్రసీల గుర్తింపునకు త్వరలో విస్తృతంగా పరీక్షలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఆరోగ్య వివరాలను హెల్త్‌ కార్డులో పొందుపరచనున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top