స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష

CM YS Jagan Review Meeting Over Spandana Program - Sakshi

సాక్షి, అమరావతి: అర్హత ఉన్నా పెన్షన్‌ రాలేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వెరిఫికేషన్‌ చేసి అర్హత ఉందని తేలితే... రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్‌ ఇస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే.. ఐదు రోజుల్లో పెన్షన్‌కార్డు ఇస్తామని పేర్కొన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్తగా 6,14,244 పెన్షన్లు ఇచ్చామనీ.. అయినప్పటికీ పథకం అందలేదన్న మాటలు వినిపిస్తున్నాయన్నారు. పెన్షన్‌ దరఖాస్తులను ఫిబ్రవరి 17 నాటికి కలెక్టర్లు రీ వెరిఫికేషన్‌ చేయాలని, 18కల్లా అప్‌లోడ్‌ చేసి, 19, 20 తేదీల్లో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశించారు. తుది జాబితా 20న ప్రకటించాలని సూచించారు. మార్చి 1న కార్డుతో పాటు, పెన్షన్‌ ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదని పునరుద్ఘాటించారు. బియ్యం కార్డుల విషయంలోనూ రీ వెరిఫికేషన్‌ పూర్తిచేయాలని ఆదేశించారు. 

అదే విధంగా అర్హులు ఎవ్వరికీ బియ్యం కార్డు రాలేదనే మాట వినిపించకూడదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ‘‘ఫిబ్రవరి 18 కల్లా రీ వెరిఫికేషన్‌ పూర్తి కావాలి. ఫిబ్రవరి 15 నుంచి బియ్యంకార్డుల పంపిణీ. ఎవరికైనా రాకపోతే ఆందోళన చెందవద్దని చెప్పండి. దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోగా కార్డు వస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఫిబ్రవరి 15 నుంచి పంపిణీ చేస్తారు. మార్చి 31 నాటికి అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ. కర్నూలు, వైఎస్సార్‌ కడప, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఫిబ్రవరి 15 నుంచి... అనంతపురం, ఉభయగోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మార్చి 7 నుంచి... కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో మార్చి 25 నుంచి... ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ .1.41 కోట్ల మందికి క్యూఆర్‌ కోడ్‌తో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలి. కాబట్టి కొంత సమయం పడుతుంది. రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం’’అని పేర్కొన్నారు.

చంద్రబాబు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు..
‘‘ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి. స్పందన ద్వారా 2 లక్షల పైచిలుకు వినతులు వస్తే 1 లక్షా 3 వేల వినతులకు శాంక్షన్‌ ఇచ్చాం. కరెంటు బిల్లులు ఎక్కువగా రావడం వల్ల దాదాపు 40 వేల వినతులను పెండింగులో ఉన్నట్టు చూస్తున్నాం. పూరిగుడిసెలో ఉన్నవాళ్లకు కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని ఆపేయడం కరెక్టు కాదు. గ్రామ వాలంటీర్‌ ద్వారా లబ్ధిదారులను గుర్తించి.. ఇళ్లపట్టా పొందడానికి అర్హుడు అని అనిపిస్తే.. వెంటనే ఇళ్లపట్టా ఇవ్వండి. నేను గ్రామాల్లో తిరిగే సరికి... ఇంటి పట్టా మాకు లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు. ఇళ్లపట్టాల విషయంలో కలెక్టర్లు చురుగ్గా పనిచేయాల్సి ఉంది.  లక్షలమంది మనపై ఆశలు పెట్టుకున్నారు. వచ్చే 2 వారాలు అధికారులు ఇళ్లపట్టాలపై దృష్టిపెట్టాలి. ప్లాటింగ్, మార్కింగ్‌ పనులు త్వరితగతిన పూర్తికావాలి. ఇళ్లపట్టాలకు అవసరమైన భూమిని మార్చి 1 కల్లా సిద్ధం చేయాలి. 25 లక్షలమంది పట్టాలు ఇవ్వాలన్న మంచి కార్యక్రమం దిశగా మనం అడుగులు వేస్తుంటే... దీన్ని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కేసులు పెట్టి.. అడ్డుకోమని టెలికాన్ఫరెన్స్‌ల్లో తన నాయకులకు చెప్తున్నాడు. భూములు కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు సాగాలి. అనుకున్నచోట భూములు దొరకని పక్షంలో ప్లాన్- బీ కూడా కలెక్టర్లు సిద్ధంచేసుకోవాలి. ఇంటి స్థలం లేని నిరుపేద రాష్ట్రంలో ఉండకూడదు. కావాల్సిన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఉగాది రోజు ఆ కుటుంబాల్లో కచ్చితంగా పండుగ వాతావరణం ఉండాలి. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి 6 లక్షల ఇళ్లు చొప్పున నిర్మించుకుంటూ పోతాం’’ అని సీఎం జగన్‌ అధికారులతో పేర్కొన్నారు. 

కంటి వెలుగు పథకం మూడో విడతలో భాగంగా... పిల్లలకు చేయాల్సిన సర్జరీలను వేసవి సెలవులు నాటికి వాయిదా వేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ‘‘25 రోజుల విశ్రాంతి అవసరం ఉన్న దృష్ట్యా తల్లిదండ్రుల కోరిక మేరకు కంటి శస్త్రచికిత్సలు వాయిదా వేశాం. కళ్లజోళ్లు కూడా అవసరమైన విద్యార్థులకు పంపిణీచేస్తున్నాం. మూడోవిడత కంటి వెలుగు కింద 56 లక్షలమంది అవ్వాతాతలకు స్క్రీనింగ్‌.  అవ్వాతాతలకు పెన్షన్ల పంపిణీతో పాటు వాలంటీర్లచే కళ్లజోళ్లు పంపిణీ. మార్చి నుంచి అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు. గ్రామ సచివాలయాల్లోనే స్క్రీనింగ్‌. ప్రతి మండలానికి 2 నుంచి 3 టీంలు. దీనికోసం రూట్‌మ్యాప్‌లు సిద్ధంచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘కలెక్టర్లంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నియోజకవర్గాల వారీగా బృందాలను ఏర్పాటు చేయాలి. కంటివెలుగు మూడోవిడత ‘‘అవ్వా-తాత’’  కార్యక్రమం 18న కర్నూలులో ప్రారంభం. ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటాను. ఆస్పత్రుల్లో  నాడు-నేడు పనులకూ అదే రోజు శంకుస్థాపన. 4906 సబ్‌ సెంటర్లను నిర్మిస్తున్నాం. 4472 సబ్‌ సెంటర్లకు స్థలాలు గుర్తించారు. మిగిలిన వాటికి వెంటనే స్థలాలను గుర్తించాలి. ఈ నెలాఖరుకల్లా పనులు ప్రారంభం అవుతాయి’’అని తెలిపారు.

జగనన్న వసతి దీవెన ఫిబ్రవరి 24న ప్రారంభం
‘‘ఉన్నత చదువులు చదువుతున్నవారికి అండగా వసతి దీవెన కార్యక్రమం. విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సంవత్సరానికి రూ.20వేల రూపాయలు రెండు దఫాల్లో ఇస్తాం.11,87,904 మందికి లబ్ధి. 53720  ఐటీఐ చదువుతున్న వారికి మొదటి దఫా రూ.5వేలు, ఏడాదికి రూ.10వేలు. పాలిటెక్నిక్‌ చదువుతున్న వారికి మొదటి దఫా రూ. 7,500వేలు, ఏడాదికి రూ.15వేలు. డిగ్రీ ఆపై చదువులు చదువుతున్న వారికి మొదటి దఫా రూ.10వేల రూపాయలు. ఏడాదికి రూ.20వేలు. విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి డబ్బు జమ చేస్తాం’’అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

  • షాపులు నడుపుకుంటున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు వచ్చే మార్చిలో ఏడాదికి రూ.10వేలు
  • కాపు నేస్తంలో భాగంగా మహిళలను ఆదుకునే కార్యక్రమం కూడా మార్చిలో ప్రారంభం
  • మార్గదర్శకాలు తయారుచేసి వాలంటీర్ల సహాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలి
  • చిరునామాల మ్యాపింగ్‌ అనేది గ్రామ, వార్డు సచివాలయాల్లో ముఖ్యమైన కార్యక్రమం
  • గ్రామ వాలంటీర్ల చేతిలో మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి
  • అడ్రస్‌ మ్యాపింగ్‌ సరిగ్గా చేయని కారణంగా.. పెన్షన్లు ఇవ్వడానికి కొన్నిచోట్ల సమయం పడుతుంది
  • మ్యాపింగ్‌ జరిగితే.. వేగవంతంగా పెన్షన్లు ఇవ్వగలుగుతాం
  • వచ్చే నెల పెన్షన్లు మొదటి 2 రోజుల్లోనే పూర్తికావాలి
  • గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు ఓన్‌ చేసుకోవాలి
  • ఎక్కడా గ్యాప్‌ లేకుండా చూసుకోవాలి
  • వాలంటీర్లు అందుబాటులో ఉన్నారా? లేదా? అన్న కనీస సమాచారం మనవద్ద ఉండాలి
  • లేకపోతే ఆ యాభై కుటుంబాలకు సంబంధించిన సేవలు పెండింగులో ఉంటాయి
  • ఇక వార్డు, గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులు కూడా సమయానికి వస్తున్నారా? లేదా? చూసుకోవాలి
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో మనం అందిస్తామన్న 541 సేవలు అనుకున్న సమయానికి అందుతున్నాయా? లేదా? చూసుకోవాలి
  • ఈ పరిశీలనలవల్ల లోపాలు ఎక్కడున్నాయో తెలుస్తాయి, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది
     
  • గ్రామ సచివాలయాలనుంచే వినతులు, దరఖాస్తులు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి

రైతు భరోసా కేంద్రాల గురించి..

  • ఈ ఏడాది ఖరీఫ్‌ కల్లా రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం
  • ప్రతి 2వేల జనాభాకు సంబంధించి పూర్తి వ్యవసాయ అవసరాలను ఈ రైతు భరోసా కేంద్రాలు తీరుస్తాయి
  • ఇ-క్రాపింగ్‌ తప్పనిసరిగా అమలు చేయాలి
  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మారుస్తాయి
  • రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించాలి
  • ఎక్కడైనా రైతు ఆత్మహత్యచేసుకుంటే... కలెక్టర్‌ కచ్చితంగా వెళ్లాలని చెప్పాం
  • పరిహారం అందని రైతు కుటుంబాలకు వెంటనే చెల్లింపులు చేయాలి
  • ఎలాంటి ఆలస్యం లేకండా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చెల్లింపులు చేయాలి
  • 2014 నుంచి 2019లో మనం అధికారంలోకి వచ్చేంత వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాల్లో పరిహారం
  • అందని 422 మంది కుటుంబాలకు ఈనెల 24న పరిహారం అందించాలి
  • స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా కుటుంబాల దగ్గరికి వెళ్లి వారికి పరిహారం ఇవ్వాలి
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top