పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనిస్తాం

CM YS Jagan Reddy Inaugurates KIA Motors Manufacturing Plant in AP - Sakshi

పెట్టుబడులతో రావాలని పారిశ్రామికవేత్తలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆహ్వానం

పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం ఎంతో అనువైన ప్రదేశమని వెల్లడి

ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

‘కియా’ మోటార్స్‌ గ్రాండ్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం

త్వరలో భారత మార్కెట్‌లోకి ‘కియా కార్నివాల్‌’ కొత్త కారు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పెట్టుబడులకు ఆంధ్ర ప్రదేశ్‌ ఎంతో అనువైన ప్రాంతమని, తమ ప్రభుత్వం చొరవ తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియా కార్ల తయారీ ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన సందర్భంగా గురువారం నిర్వహించిన ‘గ్రాండ్‌ ఓపెనింగ్‌’ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యం, రూ.13,500 కోట్ల పెట్టుబడితో కియా కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటైంది.

ప్లాంట్‌ పరిశీలించిన సీఎం..
కియా సంస్థ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షించారు. ప్రస్తుతం కియా ద్వారా నేరుగా 3 వేల మందికి, అనుబంధ కంపెనీల ద్వారా 3,500 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఏటా కార్ల ఉత్పత్తి సామర్థ్యం 70 వేల నుంచి 3 లక్షలకు చేరడం వల్ల ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీలో కియా సంస్థ పెట్టుబడులు పెట్టడం దేశానికే గర్వకారణమని, అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఇందుకోసం కృషి చేసిన కియా సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు. అంతకు ముందు ముఖ్యమంత్రి జగన్‌ గన్నవరం నుంచి నేరుగా పుట్టపర్తి చేరుకుని అక్కడి నుంచి కియా ప్లాంటు వద్దకు వచ్చారు. ప్లాంటులో కార్ల తయారీ యూనిట్‌కు సంబంధించిన అన్ని విభాగాలను సీఎం పరిశీలించారు.

ప్రభుత్వం నుంచి మంచి సహకారం: కియా గ్లోబల్‌ సీఈవో హన్‌
తమ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందని కియా సంస్థ గ్లోబల్‌ సీఈవో హన్‌ ఊ పాక్‌ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటైన ఈ ప్లాంటు ప్రపంచస్థాయి కార్ల తయారీ యూనిట్ల సరసన నిలుస్తుందన్నారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 28 లక్షల కార్లను విక్రయించాలనేది తమ లక్ష్యమని, అనంతపురం యూనిట్‌ ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. తమ సంస్థ నుంచి త్వరలో రానున్న ‘కియా కార్నివల్‌’ కారును భారతీయుల అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.

నాలుగు నెలల్లో 40,649 కార్ల విక్రయం
కియా ప్లాంటులో తయారైన సెల్టోస్‌ కారుకు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోందని హన్‌ తెలిపారు. ఒకేరోజు రికార్డు స్థాయిలో 6,046 బుకింగ్స్‌ వచ్చాయన్నారు. గత నాలుగు నెలల్లోనే 40,649 కార్లను విక్రయించినట్లు తెలిపారు. కొరియా సంస్థలకు ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని భారత్‌లో కొరియా రాయబారి బోంగో కిల్‌షిన్‌ చెప్పారు. కార్యక్రమంలో కియా మోటార్స్‌ ఇండియా ఎండీ, సీఈవో కూక్యున్‌ షిమ్, మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకరనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కియా కార్ల  గ్రాండ్‌ ఓపెనింగ్‌ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి


సీఎం వైఎస్‌ జగన్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న కియా సంస్థ అధికారులు


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సమావేశమైన కియా ప్రతినిధులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top