‘వైఎస్సార్‌ రైతు భరోసా’ ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌ | YS Jagan Launches YSR Rythu Bharosa - Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌ రైతు భరోసా’ ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

Published Tue, Oct 15 2019 11:57 AM

CM YS Jagan Launches YSR Rythu Bharosa Scheme For Farmers - Sakshi

సాక్షి, సర్వేపల్లి (నెల్లూరు): అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏడాదికి రూ.13,500 ఆర్థిక సహాయం ఇచ్చే ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పథాకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం ఉదయం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతు భరోసా పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. రైతు భరోసా పథకం ప్రారంభ కార్యక్రమంలో అబ్దుల్‌ కలాం చిత్రపటానికి సీఎం వైఎస్‌ జగన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.  

అన్నదాతలకు అండగా ఉంటానని ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాతలకు చేయూతనిచ్చే రైతు భరోసా పథకాన్ని మాట ఇచ్చిన నెల్లూరు జిల్లా నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి అన్నదాతల విశ్వసనీయతను సీఎం వైఎస్‌ జగన్‌ చూరగొన్నారు.

మంగళవారం ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ రేణిగుంట విమానశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి విక్రమ సింహపురి వర్సిటీ చేరుకున్నారు. అక్కడ వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం రైతుభరోసా పథకం లబ్దిదారులైన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ తొలి సారి నెల్లూరుకు రావడంతో జిల్లాలోని పది నియోజకవర్గాల్లోని రైతాంగం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.   

మేనిఫెస్టో ప్రకారం 2020లో ప్రారంభం కావాల్సిన రైతు భరోసా - పిం.ఎం కిసాన్  పథకం  ఏడాది ముందుగానే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. రూ. 12,500కు మరో వెయ్యి పెంచి రూ. 13,500 పెట్టుబడిసాయంగా రైతులకు అందనుంది. జూన్ నెలలో రూ. 2000 ఇప్పటికే అందించారు. మరో రూ. 9,500 అక్టోబర్ నెలలో జమచేస్తారు. మరో రూ. 2000 సంక్రాంతికి అందించనున్నారు. ఈ సొమ్ము బ్యాంకులో పాత అప్పులకు జమ కట్టకుండా రైతుల చేతికి అందేవిధంగా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కుటుంబాలకు పెట్టుబడి సాయం ఐదేళ్లకు కలిపి 67,500 అందనుంది. దాదాపు 54 లక్షల మంది ఈ పథకంలో లబ్దిదారులయ్యారు. కౌలు రైతుల కుటుంబాలకూ సాగు కుటుంబాలతో పాటుగా ఈ పథకాన్ని వర్తింప చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్కే చెల్లుతుంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో కౌలు రైతులకు మేలు చేసిన సీఎం మరొకరు లేరని రాజకీయ విశ్లేషకులు, రైతులు పేర్కొంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement