‘14500’తో అక్రమార్కులకు హడల్‌! 

CM YS Jagan launches toll-free No 14500 to curb sand smuggling - Sakshi

నిబంధనలు అతిక్రమించే మద్యం విక్రేతలపై వెంటనే ఫిర్యాదులు 

తక్షణ స్పందనే కారణం 

పల్లెల్లో చర్చనీయాంశమైన టోల్‌ఫ్రీ నంబరు 

మహిళల నుంచే అధిక ఫిర్యాదులు 

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మల్లవరం ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని నవంబర్‌ 18న టోల్‌ఫ్రీ నంబర్‌ ‘14500’కు ఓ మహిళ ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కాల్‌ సెంటర్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ప్రత్తిపాడు సీఐ తన సిబ్బందితో వెళ్లి అక్రమంగా మద్యం అమ్ముతున్న దేవమ్మ అనే మహిళను పట్టుకుని కేసు నమోదుచేశారు.  

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పక్కనున్న మరో గ్రామంలో కూల్‌డ్రింక్స్‌ షాపులో మద్యం అమ్ముతున్నారని ‘14500’కు ఫోన్‌ వచ్చింది. వెంటనే ఈ విషయం స్థానిక అధికారులకు తెలిపారు. వీరు అక్కడికెళ్లి తనిఖీ చేయగా మద్యం దొరకలేదు. అయితే, షాపు నిర్వాహకుడు గతంలో మద్యం అమ్మేవాడని విచారణలో బయటపడింది. దీంతో అతన్ని హెచ్చరించి వదిలేశారు.  

సాక్షి, అమరావతి : ..ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. గత నెల 18న టోల్‌ ఫ్రీ నంబరును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రంలో మద్యం విషయంలో ఎక్కడ అక్రమాలు జరిగినా వెంటనే స్థానికుల నుంచి ‘14500’ కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదులు వస్తున్నాయి. కాల్‌ సెంటర్‌ సిబ్బంది తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేయడం, వారు వెంటనే స్పందించడం చకచకా జరిగిపోతున్నాయి. దీంతో గతంలో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు నిర్వహించిన వారు ఇప్పుడు అక్రమంగా మద్యం అమ్మాలంటే భయపడుతున్నారు.

మద్యం, ఇసుక అక్రమ విక్రయాలు, ఎక్కడ జరిగినా ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలన్న ముఖ్యమంత్రి పిలుపునకు జనం భారీగా స్పందించడమే ఇందుకు కారణం. ఎక్కడ అక్రమాలు జరిగినా నయాపైసా ఖర్చులేకుండా జనం ఉచిత ఫోన్‌కాల్‌ ద్వారా ఫిర్యాదులు చేస్తుండటంతో ఎక్కడ జైలుపాలు కావాల్సి వస్తుందోనన్న భయం అక్రమార్కుల్లో వెంటాడుతోంది. దీనివల్లే గ్రామాల్లో గతంలో అడుగడుగునా ఉన్న మద్యం బెల్ట్‌ షాపుల జాడ ఇప్పుడు పత్తా లేకుండాపోయింది. 

బెల్ట్‌ షాపులపైనే అధిక ఫిర్యాదులు 
మొత్తం 248 ఫిర్యాదులు రాగా అందులో 204 బెల్ట్‌ షాపులకు సంబంధించినవే కావడం గమనార్హం. మరో 25 ఫిర్యాదులు ఎమ్మార్పీ ఉల్లంఘనలకు సంబంధించినవి ఉన్నాయి. అలాగే, నిర్ణీత సమయం దాటి రాత్రిపూట అమ్ముతున్నారని ఏడు ఫిర్యాదులు వచ్చాయి. మిగిలినవి ఇతరత్రా ఫిర్యాదులు. కాగా, ఈ ఫిర్యాదుల్లో సింహభాగం మహిళల నుంచే వస్తున్నట్లు సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top