‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

CM YS Jagan Launch Jagananna Amma Vodi Scheme In Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు:  సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బృహత్తర ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. గురువారం స్థానిక పీవీకేఎన్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రజాసంకల్సయాత్ర పూర్తయ్యి నేటికి సరిగ్గా ఏడాదైన నేపథ్యంలో ఇదే రోజు ప్రతిష్టాత్మక ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ఎంపీలు మిథున్‌ రెడ్డి, రెడ్డప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా, ద్వారకనాథరెడ్డి, వెంకటేగౌడ, ఎంఎస్‌ బాబు, విద్యాశాఖ, జిల్లా అధికారులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.   

అంతకుమందు ‘అమ్మఒడి’ పథకం ప్రారంభంలో భాగంగా చిత్తూరుకు చేరుకున్న సీఎం జగన్‌కు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత పథకం ప్రారంభించే సభాస్థలికి చేరుకున్నారు. సభా ప్రాంగణం వద్ద విద్యాశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను సీఎం జగన్‌ తిలకించారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఆతర్వాత దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మఒడి పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు  ఈ పథకానికి అధికారికంగా శ్రీకారం చుట్టారు. 

చదువుకు పేదరికం అడ్డుకాకూడదని, బడిబయట ఏ ఒక్క చిన్నారి ఉండకూడదనే లక్ష్యంతో.. పిల్లల్ని బడికి పంపే ప్రతి పేదతల్లికి అ‍మ్మ ఒడి పథకంలో భాగంగా ఏటా రూ. 15 వేల చొప్పున చేయూతనందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోల్లో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.  పిల్లల్ని బడికి పంపే దాదాపు 43 లక్షల మంది తల్లులకు ఈ పథకంతో లబ్ది చేకూరనుంది. ప్రతి జనవరిలో నేరుగా పథకానికి ఎంపికైన అర్హులైన తల్లుల బ్యాంక్‌ అకౌంట్లలో నగదున జమచేస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top